
అక్షరాలా అగ్నిగుండమే
తెలంగాణలో నిప్పుల సెగలు
20 ఏళ్లలో తొలిసారి తీవ్ర వడగాడ్పుల హెచ్చరిక
రామగుండం, నిజామాబాద్‌లో నిప్పుల వాన
కొత్తగూడెం, మణుగూరు, హైదరాబాద్‌ల్లోనూ అంతే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం పతాకస్థాయికి చేరుకోవటంతో గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ కేంద్రం శుక్రవారం తెలంగాణకు తీవ్ర వడగాడ్పుల హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక శనివారం కూడా అమల్లో ఉంటుందని తెలిపింది. ఏప్రిల్‌లో ఇలా వడగాడ్పుల హెచ్చరిక జారీ చేయడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఐదారు డిగ్రీలు అదనంగా నమోదైతే దాన్ని వడగాడ్పుల పరిస్థితిగా పేర్కొంటారు. సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువైతే తీవ్ర వడగాడ్పుల హెచ్చరిక జారీ చేస్తారు.
శుక్రవారం రామగుండంలో 46.1, నిజామాబాద్‌లో 45.1, ఆదిలాబాద్‌లో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు భారత వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది. దీని పరిధిలో తెలంగాణవ్యాప్తంగా 11 అబ్జర్వేటరీలు మాత్రమే ఉన్నాయి. దాంతో మిగతా చోట్ల ఉష్ణోగ్రతలను అది లెక్కించలేకపోతోంది. నిజానికి శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరుల్లో 48 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్థానిక కేంద్రాలు తేల్చాయి. ఆ ప్రాంతాలన్నీ నిప్పుల కొలిమిని తలపించాయి.
మణుగూరు, కొత్తగూడెంలలో శుక్రవారం సాయంత్రం తీవ్ర ఈదురుగాలులతో వాన పడటంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ ప్రచండ భానుడి ప్రతాపానికి విలవిల్లాడింది. శుక్రవారం 43 డిగ్రీలు నమోదైంది. నగరంలో ఏప్రిల్లో 1973 ఏప్రిల్ 30న నమోదైన ఆల్‌టైం గరిష్టం 43.3 డిగ్రీలకు ఇది దాదాపు సమానం! గాల్లో తేమ 19 శాతానికి తగ్గడంతో వడగాల్పుల ఉదృతితో నగరజీవికి చుక్కలు కనిపించాయి. శని, ఆదివారాల్లోనూ ఎండతోపాటు వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అగ్నిగుండం... రామగుండం...
కరీంనగర్ జిల్లా రామగుండంలో 1988లో నమోదైన అల్‌టైం రికార్డు 46.8 డిగ్రీలకు చేరువగా శుక్రవారం 46.1 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్‌లో గత పదేళ్లలో గరిష్టంగా 45.1 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండల్లో 44 డిగ్రీలను మించింది. జూన్‌లో నైరుతి రుతుపవనాలు వచ్చేదాకాఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంటోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు త్వరలో 50 డిగ్రీలకు చేరే ప్రమాదముంది. పశ్చిమ, వాయవ్య వేడి గాలులతో ఉష్ణోగ్రతలు అంతకంతకూ హెచ్చుతున్నాయి. గాల్లో తేమ, మబ్బులు లేక సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతుండటమే ఎండల మంటలకు కారణమని వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యవసర పనుంటే తప్ప ఉదయం 11-సాయంత్రం 4 మధ్య బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బతో 40 మంది మృత్యువాత
సాక్షి నెట్‌వర్క్: వివిధ జిల్లాలో వడదెబ్బతో శుక్రవారం 40 మంది మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎనిమిది మంది, నల్లగొండ జిల్లాలో 11 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో నలుగురు, కరీంనగర్ జిల్లాలో 8 మంది, వరంగల్‌లో ఏడుగురు, మెదక్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.
శుక్రవారం ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతల వివరాలు
కేంద్రం గరిష్ఠం కనిష్ఠం
రామగుండం 46.1 30.2
నిజామాబాద్ 45.1 32.1
ఆదిలాబాద్ 44.8 26.0
మెదక్ 44.2 28.2
నల్గొండ 44.0 29.0
మహబూబ్‌నగర్ 43.2 30.5
హైదరాబాద్ 43.0 29.8
హన్మకొండ 42.8 25.9
ఖమ్మం 42.0 28.0
భద్రాచలం 42.0 29.0
హకీంపేట 41.4 28.1