
నెత్తిపై నిప్పుల వాన
రాష్ట్రంలో భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలు.. తీవ్ర వడగాడ్పులు.. భరించలేని ఉక్కపోతతో తెలంగాణ ఉడికిపోతోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయి. శుక్రవారం తెలంగాణకు అతి వడగాడ్పుల హెచ్చరిక చేసిన వాతావరణ శాఖ దాన్ని శనివారం కూడా కొనసాగించింది. మరో రెండు మూడు రోజులపాటు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఈ సీజన్‌లోనే శనివారం ఎక్కువ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకటి రెండు మినహా అన్ని ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోయాయి. ఆరు జిల్లా కేంద్రాల్లోనైతే ఏకంగా సాధారణం కంటే ఏడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
మండుతున్న నల్లగొండ, ఖమ్మం
నల్లగొండ పట్టణం శనివారం అగ్నిగుండంగా మారింది. వరుసగా రెండు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20 ఏళ్ల రికార్డును బద్దలుకొడుతూ శుక్రవారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. శనివారం 44.8 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఎండ తీవ్రతతో ఖమ్మం జిల్లా భగభగలాడుతోంది. శనివారం కొత్తగూడెంలో ఏకంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో ఆ ప్రాంతం నిప్పులకొలిమిని తలపించింది. ఐదు నిమిషాల పాటు కూడా ఎండలో ఉండలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు విద్యుత్ సరఫరాతో అంతరాయంతో జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మణుగూరులో 46, ఖమ్మం పట్టణంలో 45, భద్రాచలంలో 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లా రామగుండంలో శనివారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం వివిధ జిల్లాల్లో వడదెబ్బకు 54 మంది బలయ్యారు.