మహిళా డీఎస్పీ ఫొటో తీసిన హోంగార్డు
సర్వీస్ నుంచి హోంగార్డు తొలగింపు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పోలీసు డిపార్టుమెంట్‌లో ఒక ఆకతాయి తుంటరి చర్యలకు పాల్పడ్డాడు. నేర విచారణ విభాగం (సీఐడీ) లో విధులు నిర్వహిస్తున్న మహిళా డీఎస్పీని ఓ హోంగార్డు తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడు. వెంటనే పసిగట్టిన సదరు డీఎస్పీ.. హోంగార్డు సెల్‌ఫోన్ తీసుకుని పరిశీలించారు.
విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. హోంగార్డు తీసిన ఫొటోలను పరిశీలించి, అవి ఉద్దేశపూర్వకంగానే తీసినట్లు భావించారు. వెంటనే అతడిని సర్వీస్ నుంచి తొలగించడంతోపాటు.. సీఐడీలో ఐపీసీ 509, 354డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.