తెలంగాణలో టీడీపీ ఖాళీ! | huge damage to TDP in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీడీపీ ఖాళీ!

Published Fri, Dec 11 2015 11:51 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

తెలంగాణలో టీడీపీ ఖాళీ! - Sakshi

తెలంగాణలో టీడీపీ ఖాళీ!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వరసపెట్టి సీనియర్ నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారు. నిన్న గాక మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. అంతకు ముందు అయిదుగురు ఎమ్మెల్యేలు ఇదే తరహాల్లో పార్టీ మారు. కాగా, పార్టీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయ రామారావు టీ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే ఆయన పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.

ఈ కారణంగానే టీడీపీ జాతీయ కమిటీలో కానీ, టీటీడీపీ రాష్ట్ర కమిటీలో కానీ ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు. ఈ కారణాలన్నింటి నేపథ్యంలోనే ఆయన గత రెండు రోజులుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గం నాయకులు, తన అనుచరులతో మాట్లాడి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారికి వివరించారని సమాచారం. అన్నీ ఆలోచించుకునే, విజయ రామారావు శుక్రవారం టీడీపీకీ రాజీనామా చేస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు. ‘ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇన్నాళ్లూ మీరు అందించిన సహకారానికి కతజ్ఞతలు..’ అని బాబు రాసిన లేఖలో స్పష్టం చేశారు. కాగా, విజయ రామారావు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

తటస్థ కోటాలో తెరపైకి
కేంద్రంలో సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసిన కె.విజయ రామారావు తటస్థ కోటాలో 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో ఖైరతాబాద్ టికెట్ పొంది గెలవడమే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. రోడ్లు, భవనాలు, వాణిజ్య పన్నుల శాఖా మంత్రిగా ఆయన సేవలు అందించారు. పార్టీతో సంబంధం లేని వారిని, వివిధ రంగాల్లో పేరున్న వారిని తటస్థ కోటాలో టికెట్లు ఇస్తామని నాడు చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పార్టీలో చేరారు. ఎన్నికల్లో పి.జనార్ధన్‌రెడ్డిని ఓడించారు. కానీ, 2004, 2009 ఎన్నికల్లో ఆయన వరసగా ఓటమి పాలయ్యారు. కాగా, 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక ఎన్నికల్లో టీడీపీ నాయతక్వం ఖైరతాబాద్ నుంచి ఆయనకు టికెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా బీజేపీకి అవకాశం ఇచ్చింది. దీంతో పార్టీతో ఆయనకు మరింత దూరం పెరిగింది.

విజయ రామారావు కోసం... కేసీఆర్‌కు నో చెప్పిన బాబు
1999 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాటి మంత్రి వర్గంలో కె.చంద్రశేఖర్‌రావుకు అవకాశం ఇవ్వక పోవడానికి విజయ రామారావును కేబినెట్‌లోకి తీసుకోవడమే ప్రధాన కారణం. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం కల్పించలేమని, పార్టీలో సీనియర్ అయిన కేసీఆర్‌ను కాదని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విజయరామారావును అక్కున చేర్చుకున్నారు. దీంతో పార్టీలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాతి పరిణామాల్లోనే కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ని ఏర్పాటు చేశారు. ఒక విధంగా టీఆర్‌ఎస్ ఏర్పాటుకు బీజం పడిందే విజయ రామారావు వల్ల అన్న అభిప్రాయం బలంగా ఉంది. కానీ, ఇప్పుడాయ టీడీపీని వదిలి అదే టీఆర్‌ఎస్‌లో చేరనుండడం విశేషం

మూడు రోజుల కిందట హరీష్‌తో భేటీ
టీ టీడీపీ క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటన్న మాజీ మంత్రి విజయ రామారావును మూడు రోజుల కిందట రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు కలిసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్నే హరీష్ తీసుకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని తెలిసింది. ఆ తర్వాత వెనువెంటనే జరిగిన పరిణామాలతో విజయ రామారావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖ రాశారని భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement