డ్రైనేజీలో కోట్లు మింగారు | Huge scam in the sewage sytem | Sakshi
Sakshi News home page

డ్రైనేజీలో కోట్లు మింగారు

Published Sat, May 6 2017 2:27 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

డ్రైనేజీలో కోట్లు మింగారు

డ్రైనేజీలో కోట్లు మింగారు

- ‘మురుగు కాంట్రాక్టర్ల’తో ఇంజనీర్ల కుమ్మక్కు
- బోగస్‌ వేబిల్లులతో భారీ దోపిడీకి యత్నం


సాక్షి, హైదరాబాద్‌: ‘గ్రేటర్‌’లో నాలాల పూడికతీతకు సంబంధించిన భారీ స్కామ్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్ల మెడకు చుట్టుకుంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్‌) అధికారులు గత వారం 18 మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాంట్రాక్టర్లు రూపొందించిన బోగస్‌ వే బిల్లులు కళ్లు మూసుకుని పాస్‌ చేసిన 13 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్ల పాత్రను పోలీసులు నిర్థారించారు. ఏటా వర్షాకాలానికి ఆరు నెలల ముందు నుంచే జీహెచ్‌ఎంసీ నాలాల్లో పూడికతీత పనులు ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలో అవినీతికి ఆస్కారం లేకుండా కొన్ని కీలక నిబంధనలను జీహెచ్‌ంఎసీ మార్చింది. ఎంత మేరకు పూడిక తీశారో పక్కాగా తూకం వేసి ఆ మొత్తాన్నే కాంట్రాక్టులకు చెల్లించేలా చర్యలు తీసుకుంది.

నంబర్లు మార్చేసి
దీన్నీ తమకు అనువుగా మార్చుకున్న కాంట్రా క్టర్లు భారీ దోపిడీకి యత్నించారు. నాలాల నుంచి తీసిన పూడికను లారీల ద్వారా జవహ ర్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డ్‌కు తరలించాలి. అలా తీసుకువెళ్లే సమయంలో వేబ్రిడ్జ్‌ల వద్ద తూకం వేయించి బిల్లు తీసుకోవాలి. ఏ లారీ ద్వారా పూడికను తరలిస్తున్నారో దాని నంబర్‌ నమోదు చేయాలి. అయితే వేబ్రిడ్జ్‌ బిల్లుల్లో ‘వాహనాలను మార్చేశారు’. లారీ నంబర్లు ఉండాల్సిన చోట బైక్స్, ఆటోలు, కార్ల నంబర్లను పొందుపరిచారు. గత నెల్లో నకిలీ బిల్లుల్ని ఏఈలకు సమర్పించగా.. 13 మంది వీటిని కళ్లు మూసుకుని పాస్‌ చేసేశారు. దీంతో కాంట్రాక్టర్లు రూ.1.18 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. చెక్కులు జారీ కావడానికి కొన్ని రోజుల ముందు అనుమానం వచ్చిన ఆడిట్‌ అధికారులు వాహనాల నంబర్లు వెరిఫై చేయగా.. అవి లారీలవి కాదని తేలింది. విషయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా చెల్లింపులు ఆగిపోయి అంతర్గత విచారణ జరిగింది. మొత్తం ఆరు ‘తరలింపు వ్యవహారాలకు’ సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు గత వారం 18 మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేశారు.

కాంట్రాక్టర్‌ నిరసన..
ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలైన ఓ కాంట్రాక్టర్‌కు ఈ హైడ్రామా గురించి తెలియడంతో సీసీఎస్‌ వద్ద నిరసనకు దిగారు. తమను అరెస్టు చేసిన పోలీసులు ఏఈల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. తప్పు చేసిన ఏఈలను జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు రక్షిస్తున్నారని ఆరోపించారు.

అరెస్టు అయిన ఏఈలు వీరే...
తిరుపతి, జమీల్‌ఖాన్, సంతోష్, వాయిదర్, లాల్‌సింగ్, మోహన్‌రావు, శంకర్, ప్రేమణ, పాపమ్మ సహా మరో నలుగురు.

సీసీఎస్‌లో హైడ్రామా..
13 మంది ఏఈలను పోలీసులు శుక్రవారం తమ కార్యాలయానికి పిలిపించారు. ప్రతి ఒక్కరి పాత్రను నిర్థారించిన తర్వాత.. అరెస్ట్‌ చేశారు. సాయంత్రం 4 గంటలకు 13 మంది నిందితుల్ని కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్లారు. ఏ స్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు కానీ.. దాదాపు న్యాయస్థానం వరకు వెళ్లిన పోలీసులకు.. వెనక్కి రావాల్సిందిగా వర్తమానం వెళ్లింది. దీంతో 15 నిమిషాల్లోనే నిందితుల్ని మళ్లీ సీసీఎస్‌కు తీసుకు వచ్చారు. మూడున్నర గంటల మల్ల గుల్లాల తర్వాత సీసీఎస్‌ పోలీసులు 13 మందికీ స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి.. మీడియా కంట పడకుండా వివిధ మార్గాల్లో బయటకు పంపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement