చెదిరిన మైత్రీ బంధం
⇒ ఆవేశం తెచ్చిన అనర్థం
⇒ ముగ్గురు స్నేహితుల జీవితాల్లో చీకట్లు
⇒ ఒకరిది అర్ధాంతర మరణం మరొకరు ఆస్పత్రిలో..
⇒ ఇంకొకరు పోలీసుల అదుపులో... కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం
మైత్రీ బంధమనే పునాదిపై సేవా సౌధాన్ని నిర్మించాలనే కల. నమ్మకమే ప్రధానంగా ముందుకు సాగుతున్న వేళ... ఆర్థిక విషయాల కలతలు... కలకలం సృష్టించాయి. మైత్రీ పునాదులకు బీటలు వారాయి. ఆవేశం ఆలోచనను... ఆవేదన విచక్షణను మరిపించేశాయి. కన్నుమూసి తెరిచే లోపు కలలన్నీ కల్లలయ్యాయి. ఒకరి జీవన యానం అర్థాంతరంగా ఆగిపోగా... మరో ఇద్దరి జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. ఇదీ ‘డాక్టర్ల త్రయం’ విషాద గాథ.
చైతన్యపురి:సమాజానికి సేవ చేసేందుకు పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న ఉన్నత విద్యావంతులు వారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు, హోదా ఉన్నవారు. 15 ఏళ్ల క్రితం విధి నిర్వహణలో భాగంగా వారి మధ్య చిగురించిన పరిచయం స్నేహంగా మారింది. మైత్రీ బంధం వారిని అత్యున్నత ప్రమాణాలతో ఆస్పత్రిని నెలకొల్పడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రోత్సహించింది. ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్‌లో లారెల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించే వరకు తీసుకెళ్లింది. ఆస్పత్రి ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్న ఆ ముగ్గురు మిత్రుల కల చెదిరింది. వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. ఆ కుటుంబాల్లో అంతులేని బాధను మిగిల్చింది. ముగ్గురు మిత్రుల్లో.. సర్జన్ శశికుమార్ ఆత్మహత్య చేసుకోగా.. సాయి కుమార్ (అనస్థసిస్ట్) పోలీసుల అదుపులో ఉన్నారు. బుల్లెట్ గాయాలతో ఉదయ్ కుమార్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సాయి కుమార్ ఇంటికి తాళం పడింది. వారి కలల సౌధం.. లారెల్ ఆస్పత్రి... వైద్యులు, పేషెంట్లు లేక బోసిపోయింది. ఆర్థిక విషయాల్లో ముగ్గురు మిత్రుల మధ్య పారదర్శకత లోపించడంతోనే ఇంతటి ఘోరం జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై చర్చించి... పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ క్షణికావేశమే వారి జీవితాల్లో చీకట్లు నింపిందని వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ 2003లో కొత్తపేట్ మారుతీనగర్‌లో సాయినిఖిత సూపర్ స్పెషాలిటీ ల్యాప్రోస్కోపీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. తన సేవలతో పరిసర కాలనీవాసుల మనసులను గెలుచుకున్నా రు. ఎవరికైనా ఆపద వచ్చిందంటే అర్ధరాత్రయినా శస్త్ర చికిత్స చేసేవాడని కాలనీవాసులు చెప్పారు. ఎవరితోనూ ఎలాంటి గొడవలు పెట్టుకునేవాడు కా దని... ఆస్పత్రి సిబ్బందితోనూ కలివిడిగా ఉండేవాడని అంటున్నారు. ఎప్పుడూ ఎవరిపై కోపగించుకున్న దాఖలాలూ లేవని సాయినిఖిత ఆస్పత్రి సిబ్బంది తెలి పారు.