భారీ వర్షాలతో వందేళ్ల రికార్డు బద్దలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఏకంగా 39 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. వాతావరణ శాఖ రికార్డు చేసిన లెక్కల ప్రకారం గత వందేళ్లలో ఎన్నడూ ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు.
1908 సెప్టెంబర్ 28వ తేదీన హన్మకొండలో 30.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 1954 జులై 10వ తేదీన ఖమ్మంలో 30 సెంటీమీటర్లు రికార్డు అయింది. ఆ తర్వాత 1983 అక్టోబర్ 6వ తేదీన నిజామాబాద్‌లో 35.5 సెంటీమీటర్లు నమోదైంది. వందేళ్ల చరిత్రలో రికార్డు అయిన వీటన్నింటినీ తిరగరాస్తూ ఆర్మూర్‌లో శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు 39 సెంటీమీటర్లు రికార్డు కావడంపై వాతావరణ శాఖ అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అలాగే అదే జిల్లా మద్నూర్, రంజల్, బోధన్, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లలో 20 సెంటీమీటర్ల కుండపోత వర్షపాతం నమోదైంది.
------------------------------------------------------------
ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైన వివరాలు (సెంటీమీటర్లలో)
-----------------------------------------------------------
ప్రాంతం అధిక వర్షపాతం తేదీ
-----------------------------------------------------------
1) ఆదిలాబాద్ 25.2 20 అక్టోబర్ 1995
2) భద్రాచలం 23.0 20 సెప్టెంబర్ 2005
3) హన్మకొండ 30.4 28 సెప్టెంబర్ 1908
4) హైదరాబాద్ 24.1 24 ఆగస్టు 2000
5) ఖమ్మం 30.0 10 జులై 1954
6) మహబూబ్‌నగర్ 25.2 15 ఆగస్టు 1978
7) మెదక్ 19.2 21 సెప్టెంబర్ 2005
8) నల్లగొండ 19.8 26 అక్టోబర్ 2013
9) నిజామాబాద్ 35.5 06 అక్టోబర్ 1983
10) రామగుండం 21.6 05 ఆగస్టు 2006
------------------------------------------------------------