హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం: కేటీఆర్
- నిపుణుల కమిటీ సూచన మేరకు నాలాల ఆధునీకరణ
- వచ్చే సంవత్సరం వర్షాకాలం నాటికి మార్పు చూపిస్తాం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరద, రహదారుల సమస్యల్ని ఇప్పటికిప్పుడు తీర్చలేమని, వచ్చే సంవత్సరం వర్షాకాలం నాటికి గణనీయంగా మార్పులు చూపిస్తామని మునిసిపల్ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి వరద కాలువల్ని మెరుగుపరచడం, నాణ్యమైన రహదారులు వేయడం.. వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం వంటి చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలకు అండగా ఉండేందుకు తాను, మేయర్, కమిషనర్ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డితో కలసి జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. హుస్సేన్‌సాగర్ పూర్వవైభవానికి పటిష్ట కార్యాచరణతో కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌లో మురుగునీరు కలువకుండా చర్యలు చేపట్టామని, నాలా మళ్లింపు పనులు చేశామన్నారు.
ఏడుగురి మృతి దురదృష్టకరం
హైదరాబాద్‌లో భారీ వర్షాలకు ఏడుగురు మృతి చెందడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భోలక్‌పూర్ ఘటనలో విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందారని చెబుతున్నారని, విద్యుత్ విభాగానికి ఫోన్ చేసినా స్పందించలేదనే ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరుపుతామన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షలు, జీహెచ్‌ఎంసీ నుంచి రూ. 2 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబాలకు ఆపద్బంధుకు అర్హత ఉంటే మరో రూ. 50 వేలు వెంటనే అందజేస్తామన్నారు. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీ.కాగా, ప్రస్తుతం దాన్ని అధిగమించి 513.61 మీ.కు చేరడంతో మారియట్ హోటల్ దగ్గరి తూము గేటు తెరచి 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. నగరంలో వరదనీరు 93 శాతం మూసీలోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, నాలాల ఆక్రమణల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
భారీ వర్షాలకు భోలక్‌పూర్, రామంతపూర్‌లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు, బంధువులను బుధవారం గాంధీ మార్చురీ వద్ద మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్థీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పరామర్శించారు.