ఎమ్మెల్యే వివేకానందకు ఎదురుదెబ్బ
‘భవనం’ కేసులో హైకోర్టులో చుక్కెదురు
- నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టీకరణ
- ఆ భవనంలోని కాలేజీని తరలించాలని ఆదేశం
- ప్రభుత్వం క్రమబద్ధీకరించినా ఒప్పుకోమన్న కోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ భవంతిని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాల్సిందేనని వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పింది. ఈ కూల్చివేత ప్రక్రియను తామే స్వయంగా చేపడతామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని వారికి హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు 15 రోజుల గడువునిచ్చింది.
హామీ ఇవ్వని పక్షంలో జీహెచ్‌ఎంసీ కూల్చివేత ప్రక్రియను చేపట్టవచ్చని ధర్మాసనం తెలిపింది. అంతేకాక ఈ భవనంలో కాలేజీ నిర్వహించడానికి వీల్లేదని నారాయణ కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. కాలేజీని అక్కడి నుంచి తరలించాలని స్పష్టం చేసింది. ఎటువంటి సెట్‌బ్యాక్‌లు విడిచిపెట్టని భవనంలో కాలేజీ నిర్వహణకు అనుమతినిచ్చి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టలేమంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన హైకోర్టు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులు కుత్బుల్లాపూర్ గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం అనుమతులు తీసుకుని, అందుకు విరుద్ధంగా భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదంటూ వివేకానంద సమీప బంధువు కె.ఎం.ప్రతాప్ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, తగిన అనుమతులు లేకుండా, సెట్‌బ్యాక్‌లు విడిచిపెట్టకుండా, పార్కింగ్ ఏర్పాట్లు చేయకుండానే వివేక్ అతని కుటుంబ సభ్యులు భారీ వాణిజ్య సముదాయం నిర్మించారని తేల్చారు. దానిని కూల్చివేయాలంటూ జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. అలాగే ఈ వాణిజ్య సముదాయంలో కాలేజీ నిర్వహిస్తున్న నారాయణ కాలేజీ యాజమాన్యానికి కాలేజీని తరలించాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ అటు వివేకానంద, ఇటు నారాయణ కాలేజీ యాజమాన్యం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి.
క్రమబద్ధీకరణ కోరడం అలవాటుగా మారింది...
ఈ సందర్భంగా వివేక్ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ, భవనంలో కొంత భాగాన్ని కూల్చేసి పార్కింగ్ ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ భవనం క్రమబద్ధీకరణ కోసం వివేకానంద దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘చాలా దురదృష్టకరం. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించడం. తరువాత క్రమబద్దీకరణ అడగటం అలవాటుగా మారింది. 1+1 కి అనుమతి తీసుకుని 1+4 నిర్మించడం సరికాదు’ అని పేర్కొంది. ఈ సమయంలో జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు స్పందిస్తూ, ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై తగిన చర్యలకు ఆదేశించామని చెప్పారు.
చట్టాలు ఉల్లంఘించడానికి కాదు...
దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘అసలు ఇటువంటి భవనాలను ఎలా క్రమబద్ధీకరిస్తారు.? సెట్‌బ్యాక్‌లు విడిచిపెట్టకపోతే పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు రావడానికి అక్కడ స్థలం ఏదీ? ఇటువంటి అక్రమ కట్టడాలను మొదట్లోనే సంబంధిత శాఖ అధికారులు అడ్డుకోవాలి. ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నది చట్టాలు చేయడానికే తప్ప, చట్టాలను ఉల్లంఘించడానికి కాదు. ఈ కేసులో ఎమ్మెల్యే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అక్రమంగా భవనాన్ని కట్టేసి క్రమబద్ధీకరించండి అంటే ఎలా? ప్రభుత్వం ఎమ్మెల్యే భవనాన్ని క్రమబద్ధీకరించినా, మేం మాత్రం అందుకు అంగీకరించబోం’ అని స్పష్టంచేసింది.
మేమే కూల్చుకుంటాం..
భవనాన్ని తామే కూల్చివేసుకుంటామని, అందుకు అనుమతినివ్వాలని ప్రకాశ్‌రెడ్డి కోరారు. ఇందుకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ధర్మాసనం ఆయనకు స్పష్టం చేసింది. లేకపోతే జీహెచ్‌ఎంసీ కూల్చివేత ప్రక్రియను ప్రారంభిస్తుందని తేల్చి చెబుతూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది