జయలలిత ఆస్తులపై పిల్ కొట్టివేత
- పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు
- 4వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలితకు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటిం చాలని కోరుతూ దాఖలైన పిల్‌ను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. ప్రచారం కోసమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్న న్యాయస్థానం, పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు వారాల్లోగా జమ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత వ్యవధిలో జరిమానా మొత్తం చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవచ్చని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వారసులు లేరని ఎలా చెప్తారు?
జయలలితకు వారసులు లేరని, హైదరాబా ద్‌లో ఆమెకున్న ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించి, వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ ప్రతినిధి జి.భార్గవి.. హైకోర్టు లో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.వి.రావు వాదనలు వినిపిస్తూ, 2015 ఎన్నికల అఫిడవిట్‌లో తనకు జీడిమెట్ల వద్ద 14.5 ఎకరాల స్థలం, శ్రీనగర్‌లో 7,009 చదరపు అడుగుల వాణిజ్య సముదా యం ఉన్నాయని జయలలిత పేర్కొన్నట్లు వివరించారు. తాను అవివాహితనని, వారసులు ఎవరూ లేరని కూడా ఆమె తన అఫిడవిట్‌లో వివరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, జయలలిత వీలునామా రాయలేద ని, వారసులు లేరని దేని ఆధారంగా చెబుతు న్నారని డి.వి.రావును నిలదీసింది.
ప్రచారం కోసం దాఖలు చేసిన వ్యాజ్యం!
‘జయలలిత చనిపోయి నెలరోజులు కూడా కాలేదు. ఆమెకు వారసులు లేరని ఎలా చెబుతున్నారు, దేని ప్రకారం ఈ నిర్ధారణకు వచ్చారు అని ప్రశ్నించింది. ఇది కేవలం ప్రచారం కోసం దాఖలు చేసిన వ్యాజ్యమని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది నారాయణరెడ్డి చెప్పారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. ఉత్తర్వుల మధ్యలో రావు పదే పదే అడ్డు తగులుతుండటంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.