హైదరాబాద్‌లో ‘హునర్ హాత్’ ఏర్పాటు
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నఖ్వీ
న్యూఢిల్లీ: తెలంగాణలో మైనారిటీ వర్గాలకు చెందిన నిపుణులైన కళాకారులు, చేతివృత్తుల వారిని ప్రోత్సహించ డానికి, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ను వారికి అందు బాటులోకి తేవడానికి అనువుగా హైదరాబాద్‌లో త్వరలోనే ‘హునర్ హాత్’ను నిర్వహిస్తామని కేంద్ర మైనారిటీ వ్యవహా రాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. మొదటి హునర్ హాత్‌ను గత నవంబర్‌లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో జరుగుతున్న రెండో హునర్ హాత్‌కు చెందిన ఫేస్‌బుక్ పేజీని నఖ్వీ గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్తాన్, గుజరాత్, కశ్మీర్, అస్సాం, ఒడిశా రాష్ట్రాల నుంచి మైనారిటీ వర్గాలకు చెందిన 100కి పైగా చేతివృత్తుల వారు, శిల్పులు, వంటల నిపుణులు హునర్‌హాత్‌లో ఏర్పాటు చేసిన 130 స్టాళ్లలో పాల్గొంటున్నారు. తెలంగాణకు చెందిన బంజారా ఎంబ్రాయిడరీ హునర్ హాత్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో హునర్ హాత్ విజయవంతం కావడంతో హైదరాబాద్, ముంబై, లక్నో, కోల్‌కతా, పట్నాలలో త్వరలోనే హునర్ హాత్‌లను నిర్వహించాలని నిర్ణయించామని నఖ్వీ చెప్పారు.