ఎస్‌ఆర్‌డీపీకి సిద్ధం
రూ.1729 కోట్లతో ప్రణాళికలు
త్వరలో టెండర్ల ఆహ్వానం
విశ్వ నగరం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో హైదరాబాద్‌లోస్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ) అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు/ఫ్లై ఓవర్లు, స్కైవేల నిర్మాణానికి త్వరలో తొలి అడుగు పడనుంది. నగరంలోని వివిధ మార్గాల్లో ఈ పనులకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు రూపొం దించారు. దీనికి దాదాపు రూ. 1729 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. సీఎం ఆమోదంతో త్వరలోనే వీటికి గ్లోబల్ టెండర్లు పిలవనున్నారు. ఈ పనులకు సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌ను అంతర్జాతీయ ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయించారు.
భవన నిర్మాణ అనుమతులకు లైన్ క్లియర్
ఎస్‌ఆర్‌డీపీ డిజైన్లు ఖరారు కాకపోవడంతోసుమారు నెల రోజులుగా జీహెచ్‌ఎంసీలో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం లేదు. తాజాగా అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి అందిన 98 దరఖాస్తుల్లో 18 దరఖాస్తులకు లోతైన అధ్యయనం చేశాక అనుమతులివ్వనున్నట్లు తెలిపారు. ఆ మార్గాల్లో ఎస్‌ఆర్‌డీపీ అమలవుతున్న నేపథ్యంలో భూసేకరణ, ఆస్తుల సేకరణ, రహదారుల విస్తరణ, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టామన్నారు. సర్కిల్, జోనల్ స్థాయి కార్యాలయాల్లో మరో 590 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఎస్‌ఆర్‌డీపీ మార్గాల్లో లేని దరఖాస్తులకుస్పెషల్ డ్రైవ్ నిర్వహించి 15 రోజుల్లో అనుమతిస్తామని ప్రకటించారు. తొలిదశ ఎస్‌ఆర్‌డీపీ పనులు నగరంలో అన్ని వైపులా ఉంటాయని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ చేతుల్లోనే...
భవన నిర్మాణ అనుమతుల అధికారం జీహెచ్‌ఎంసీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుందనేది వాస్తవం కాదని కమిషనర్ స్పష్టం చేశారు. ఎస్‌ఆర్‌డీపీ పనులకు ఆటంకం క లుగకుండా ఉండేందుకు కొద్దిరోజుల పాటు భవన నిర్మాణ అనుమతులు నిలిపివేశామన్నారు. భవనాల క్రమబద్ధీకరణ, ఫ్లోర్ స్పేస్‌ఇండెక్స్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీతో పాటు హెచ్‌ఎండీఏ, బిల్డర్లు, వివిధ వర్గాల ప్రజలతో చర్చించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద న్నారు. హుస్సేన్‌సాగర్ నీటిని ఖాళీ చేసే అంశమై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నైపుణ్యం ఉన్న ఏజెన్సీలు, ప్రభుత్వ విభాగాల నుంచి నివేదికలు అందాక, ప్రణాళిక రూపొందించి సంబంధిత విభాగాలకు బాధ్యత లు అప్పగించే అవకాశం ఉందన్నారు.
ఆస్తిపన్ను చెల్లించండి
ఆస్తిపన్ను బకాయిలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేసినందున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా స్పెషలాఫీసర్ విజ్ఞప్తి చేశారు. బకాయిల వసూలుకు337 మంది నోడల్ ఆఫీసర్లు, 24 మంది సూపర్‌వైజర్లు పని చేస్తున్నారని చెప్పారు. వివిధ సర్కిళ్లలో పర్యటిస్తున్న వీరు పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతుల వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నార ని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు రూ. 97 కోట్లు అధికంగా వసూలయ్యాయని చెప్పారు. దుకాణాల ముందు డంపర్ బిన్లు పెడుతున్న విషయమై స్పందిస్తూ రెడ్‌నోటీసులు, జప్తు వారెంట్లు ఇవ్వడం, సంస్థల సీజ్‌లతో బకాయిదారులు దారికి రాకపోతే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన గ్రీన్ యూరినల్స్ చాలాచోట్ల పనిచేయడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్‌ఎంసీలో ఖాళీగా ఉన్న ఇంజినీర్లు, టౌన్‌ప్లానర్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్(రెవెన్యూ) ఎస్.హరికృష్ణ పాల్గొన్నారు.
భవనాల మధ్య...
ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్ల ఆటంకాలు లేకుండా చూడటంతో పాటు భూసేకరణ వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలన్నది జీహెచ్‌ఎంసీ యోచన. దీనికి అనుగుణంగా అవసరమైతే గ్రేడ్ సెపరేటర్లను వాణిజ్య భవనాల్లోని ఒకటి, రెండు అంతస్తుల గుండా తీసుకువెళ్లాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఆ భవనాల్లోని ఒకటి, రెండు అంతస్తుల్లో ఎలాంటి నిర్మాణాలు లేకుండా సంబంధిత యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. వాటికి ప్రత్యేక అనుమతులు జారీ చేస్తారు. తొలిదశలో చేపట్టబోయే రాచమార్గాలలో ఒకటి, రెండు చోట్ల ఇలాంటి ఏర్పాట్లకు అవకాశం ఉందని సోమేశ్ కుమార్ చెప్పారు.
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోకి ఆర్ అండ్ బీ రోడ్లు..
జీహెచ్‌ఎంసీలోని వివిధ మార్గాల్లో ఉన్న 239 కి.మీ.ల ఆర్‌అండ్‌బీరోడ్లు త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోకి రానున్నాయి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించిందని, త్వరలోనే అమల్లోకి రానుందని ఆయన వివరించారు.
తొలిదశ ఇలా...
ఎస్‌ఆర్‌డీపీ తొలిదశ పనులను జీహెచ్‌ఎంసీ నిధులతోనే చేపట్టే అవకాశం ఉంది. ఏటా దాదాపు రూ. 500 కోట్ల వంతున ఖర్చు చేయగలరని అంచనా వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఖజానా పరిపుష్టంగా ఉండటంతో పాటు మెట్రో రైలు మార్గాల్లో ప్రకటనల పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో రూ.100 కోట్లు జీహెచ్‌ఎంసీ వాటాగా రాగలవనే ధీమాలో ఉన్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరనున్నారు.
తాత్కాలికంగా ఎంపిక చేసిన మార్గాలు
1. దుర్గం చెరువు బ్రిడ్జి
2. ఎల్‌బీనగర్ వద్ద ఫ్లై ఓవర్
3. ఉప్పల్ వద్ద ఫ్లైఓవర్
4. బాలానగర్ వద్ద ఫ్లై ఓవర్
5. రసూల్‌పురా వద్ద ఫ్లై ఓవర్
6. కేబీఆర్ పార్కు వద్ద 6 జంక్షన్లు.. చుట్టు పక్కల రోడ్లు
7. జీవవైవిధ్య పార్కు జంక్షన్ నుంచి కూకట్‌పల్లి
కేబీఆర్ పార్కు: గ్రేడ్ సెపరేటర్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు
1. కేబీఆర్ పార్కు ప్రవేశ ద్వారం
2. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్
3. మహారాజా అగ్రసేన్ చౌక్, రోడ్డు నెం.12
4. ఫిల్మ్‌నగర్ రోడ్డు జంక్షన్
5. రోడ్డునెం.45 జంక్షన్
6. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు
గమనిక: వీటిలో మార్పు చేర్పులకు అవకాశం ఉంది.
తొలి అడుగు!
Published Sun, Feb 22 2015 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement