అన్నీ కలిపి వడ్డిస్తారు..!
‘హెల్మెట్’తో ఆగిపోదు!
హెల్మెట్ లేకుండా చిక్కితే ఇతర ‘తనిఖీలు’
► అన్ని ఉల్లంఘనలకు కలిపి భారీగా వడ్డింపు
► కొత్త విధానం అవలంభిస్తున్న నగర పోలీసులు
► ప్రమాదాల్లో మృతుల తగ్గింపే ప్రధాన లక్ష్యం
► సాంకేతిక విధానం అమలుకు కసరత్తులు
సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ లేకుండా బైక్ నడుపుకుంటూ వెళ్లిపోదాం... ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే రూ.వందో, రూ,రెండొందలో కట్టేసి ముందుకు పోదాం... అనుకుంటున్నారా..? ఇకపై అలా కుదరదు. ఈ ఉల్లంఘనతో చిక్కిన వాహనచోదకుల్ని ఇతర అంశాలనూ ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అవన్నీ సక్రమంగా లేకపోతే అన్నింటికీ కలిపి భారీగా వడ్డిస్తున్నారు. ‘సేఫ్ సిటీ’ లక్ష్య సాధనలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకే ఈ విధానం అమలు చేస్తున్నామని ట్రాఫిక్ విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ హెల్మెట్ బాదుడును సాకేంతిక పద్దతిలో చేపట్టడానికీ నగర అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
టూవీలర్సే అత్యధికం
నగరంలోని వాహనాల సంఖ్య 50 లక్షలు దాటిపోతోంది. వీటిలో 80 శాతం వాటా ద్విచక్ర వాహనాలదే. ఇదే పంథా రోడ్డు ప్రమాదాల్లోనూ కనిపిస్తోంది. సిటీలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొత్తం 620 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవి 249 (40.16 శాతం) కాగా, ఈ వాహనచోదకులు బాధితులుగా మారినవి 306గా (49.35 శాతం) నమోదయ్యాయి. మొత్తమ్మీద నగరంలో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 89.51 శాతం ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే. బాధితుల్లోనూ యువతే ఎక్కువగా ఉంటున్నారు. ఈ కేసుల్లో అత్యధిక శాతం మరణాలు చోటు చేసుకోవడానికి కారణం తలకు దెబ్బతగలడమేనని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ నిబంధన పక్కాగా అమలు చేస్తే ఈ పరిస్థితుల్ని మార్చవచ్చని అభిప్రాయపడుతున్నారు.
పోలీసు విభాగం ప్రాధాన్యం
నగర ట్రాఫిక్ విభాగం అధికారులు తొలినాళ్లల్లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రమాదాలు, వాటి కారకాలు, మృతులు/బాధితులుగా మారుతున్న వారి వివరాలు విశ్లేషించిన తర్వాత దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే 2013లో వితౌట్ హెల్మెట్ కేసులు కేవలం 217 మాత్రమే ఉండగా... 2015లో ఈ సంఖ్య 1,03,551 కు పెరిగింది. గత ఏడాది ఏకంగా 17,32,030కు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ 10 వరకే 3,83,219 కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధారణను పెంచాలని నిర్ణయించిన ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్‌లు సైతం చేపట్టింది. హెల్మెట్ నిబంధన అమలుకు ట్రాఫిక్ పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ కేసు సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
‘దగ్గరి వారిలోనే’ నిర్లక్ష్యమంటూ...
సిటీలో హెల్మెట్ ధారణపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఓ సర్వే చేపట్టారు. ఇందులో తక్కువ దూరం ప్రయాణించే వారే హెల్మెట్ ధరించట్లేదని వెలుగులోకి వచ్చింది. తాము నివసిస్తున్నా ప్రాంతానికి సమీపంలో, ఒకే పోలీసుస్టేషన్ పరిధిలో సంచరించే వారు దగ్గరే కదా అనే ఉద్దేశంతో హెల్మెట్ ధరించట్లేదని పోలీసులు గుర్తించారు. ఇదే వాహనచోదకులు తాను నివసిస్తున్న ప్రాంతానికి కాస్త దూరం వెళ్లాల్సి వస్తే మాత్రం కచ్చితంగా హెల్మెట్ ధరిస్తున్నాడని పరిశీలనలో తెలుసుకున్నారు. మరికొందరు వాహనచోదకులు పోలీసులు ఉన్న ప్రాంతంలో హెల్మెట్లు పెట్టుకున్నా... వారిని దాటిన తర్వాత తీసేస్తున్నారనీ వెల్లడైంది. వీటిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు హెల్మెట్ లేకపోవడమో, ఇతరు దుష్ఫ్రభావాల వల్లో ధారణ చేయని వారి కంటే నిర్లక్ష్యంతో ధరించని వారే ఎక్కువగా ఉన్నారని తేల్చారు. ఇలాంటి వారు ప్రమాదాల బారినపడినప్పుడు ప్రధానంగా తలకు గాయమై తీవ్రంగా గాయపడటమో, మరణించడమో జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
అన్నీ చూస్తారు
ఈ నిర్లక్ష్య ధోరణికి చరమగీతం పాడించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక విధానాన్ని అవలంభిస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీలో ఎవరైనా వాహనచోదకు డు హెల్మెట్ లేకుండా చిక్కితే జరిమానాతో ఆగిపోకుండా ఆదేశాలు జారీ చేశారు. వారి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ధ్రువీకరణల్నీ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. వీటిలో ఏవి వాహనచోదకుడు కలిగి ఉండడో గుర్తించడం ద్వారా హెల్మెట్ ఉల్లంఘనతోపాటు మిగిలిన వాటికీ కలిపి వడ్డించాల్సిం దిగా స్పష్టం చేశారు. నగరంలోని కొంత మంది వాహనచోదకులు వివిధ రకాలైన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో హెల్మెట్ ధరించలేకపోతున్నారనీ పోలీసు ల దృష్టికి వచ్చింది. దీనిపై సానుకూలంగా స్పంది స్తున్న ట్రాఫిక్ పోలీసులు అలాంటి వారికి మినహా యింపు ఇస్తామని, అయితే వైద్యులు జారీ చేసిన సం బంధిత ధ్రువీకరణ పత్రాన్ని కచ్చితంగా చూపిం చాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. సిటీలో హెల్మె ట్ ధారణను పెంచడం ద్వారా ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు.
ఐఐటీతో ఒప్పందం
అత్యాధునిక ఎనలటిక్స్‌గా పిలిచే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి హెల్మెట్ ధరించని వాహనచోదకులపై చర్యలు తీసుకోవడానికి నగర పోలీసు విభాగం సమాయత్తమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు హైదరాబాద్ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగాత్మక, అభివృద్ధి దశలో ఉన్న ఈ విధానం త్వరలో పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. దీని ప్రకారం...
► నగరంలోని అన్ని జంక్షన్లలో ఉన్న కెమెరాలు పోలీసు కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (టీసీసీసీ) అనుసంధానించి ఉంటాయి.
► ఈ టీసీసీసీలో ఉండే సర్వర్‌లో కొన్ని రకాలైన ఎనలటిక్స్‌గా పిలిచే సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తం చేస్తారు.
► ప్రతి రోజూ రద్దీ వేళల్లో మూడుసార్లు ఈ ఎనలటిక్స్‌ను వినియోగించి హెల్మెట్‌లేని ఉల్లంఘనులపై సాంకేతిక డ్రైవ్ చేపడతారు.
► ఎనలటిక్స్ వినియోగించిన ఫలితంగా నిర్ణీత సమయంలో నగరంలోని అన్ని జంక్షన్లలో ఉన్న కెమెరాలు ఒకేసారి పని చేస్తాయి.
► ఆయా చోట్ల ఉన్న వాహనచోదకుల్లో హెల్మెట్ ధరించని వారిని ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. ఆ వాహనచోదకుడి ఫొటోతో పాటు వాహనం నెంబర్ ఫొటోను తీస్తుంది.
► టీసీసీసీలో ఉండే సర్వర్ ఈ వివరాలను సరిచూసి, ఆర్టీఏ డేటాబేస్‌లో ఉండే వాహనదారుడి చిరుమానాతో పోలుస్తుంది.
► కొన్ని నిమిషాల వ్యవధిలోనే హెల్మెట్ ధరించని వాహనచోదకులందరికీ ఈ–చలాన్ జారీ అయ్యేలా చేస్తుంది.
► ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఓ ఉల్లంఘనకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఒక రోజులో ఒకేసారి జరిమానా విధించే అవకాశం ఉంది.
► ఎనలటిక్స్ ద్వారా పదేపదే ఫొటోలు తీస్తే ఒకే వ్యక్తిని అనేకసార్లు ఈ–చలాన్ జారీ అయ్యే అవకాశం ఉంటుందనే అంశాన్ని పోలీసు విభాగం గుర్తించింది.
► ఈ నేపథ్యంలోనే ఒకే వ్యక్తికి, ఒకేరోజు పదేపదే ఈ–చలాన్ జారీ కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎనలటిక్స్‌లో ఇందుకు అవసరమైన మార్పుచేర్పులు చేయిస్తున్నారు.