హెల్మెట్ లేకుంటే కుదరదు
మారేడుపల్లి
వాహన దారులు హెల్మెట్ పెట్టుకునేలా చేసేందుకు మారేడ్ పల్లి పోలీసులు కొత్త రకం ప్లాన్ వేశారు. వాహన్ డాక్యుమెంట్లు లేకున్నా అంతగా పట్టించుకోని పోలీసులు.. హెల్మెట్ లేకుండా దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలటం లేదు. హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికితే హెల్మెట్ కొనుక్కుంటావా లేక భారీ ఎత్తున ఫైన్ వేయమంటావా అంటూ.. వాహన దారులకే ఛాయిస్ ఇస్తున్నారు.
అప్పటికప్పుడు హెల్మెట్ కొనుక్కుంటే చలాన్ ఉండదని చెబుతున్నారు. అంతే కాదు. వాహన దారుని వెంట.. ఓ కానిస్టేబుల్ ను పంపించి హెల్మెట్ తీసుకున్న తరువాతే వదిలేస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఏఓసీ గేట్, కార్ఖానా, తదితర ప్రాంతంలో మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. కొన్ని రోజులుగా చేపట్టిన ఈ డ్రైవ్‌లో భారీగా చలాన్లు విధించడమే కాకుండా వేల మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోజుకు వందల సంఖ్యలో కరపత్రాలను వాహనదారులకు ఇస్తు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో పూర్తిగా అవగాహన రావడం లేదని ట్రాఫిక్ పోలీసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు హెల్మెట్ వాడకంపై మరింత కఠినంగా వ్యవహరించండి అనడంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ లో మరింత వేగం పెంచారు..ఉదయం సాయంత్రం ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు టీంలుగా ఏర్పడి వాహనదారులకు కౌన్సిలింగ్ తో పాటు వారికి చలాన్లు విదిస్తున్నారు. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ స్థాయి అధికారి కూడా ఈ డ్రైవ్ లో పాల్గొంటూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మొదటి సారి పట్టుపడితే రూ.100, రెండో సారి పట్టుబడితే.. రూ.300 ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.