హైదరాబాద్ ట్రాఫిక్ క్లియర్
► విరిగిపడ్డ చెట్ల కొమ్మలను తొలగించిన సిబ్బంది
► హోర్డింగుల తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్న కమిషనర్
► చాలా ప్రాంతాల్లో అడ్డంకుల తొలగింపు
► ప్రధాన రోడ్లలో చాలావరకు ముగిసిన పనులు
► ఉదయానికే మెరుగుపడిన సిటీ ట్రాఫిక్
► కాలనీ రోడ్లలో పరిస్థితి మాత్రం అస్తవ్యస్తమే
హైదరాబాద్
నగరంలో రోడ్ల పరిస్థితి శనివారం ఉదయానికి చాలావరకు మెరుగైంది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి కోఠి, లక్డీకాపుల్, మెహిదీపట్నం, బంజారాహిల్స్.. ఈ ప్రాంతాలలో ఎక్కడా అడ్డంకులు అన్నవి కనిపించలేదు. నిజానికి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు విపరీతమైన గాలి, వాన.. హోర్డింగులు పడిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, ట్రాన్స్‌ఫార్మర్లు టపటపలాడుతూనే ఉన్నాయి.. చెట్ల కొమ్మలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఐదారు కిలోమీటర్ల దూరం దాటేందుకే దాదాపు గంట సేపు పట్టిన పరిస్థితి. కానీ శనివారం ఉదయం వాహనచోదకులు వెళ్తుంటే ఎక్కడా ఆగాల్సిన అవసరమే రాలేదు. రోడ్లు చాలావరకు క్లియర్ అయ్యాయి. రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన చెట్ల కొమ్మలను తొలగించి, వాటిని నరికి రోడ్డకు పక్కగా వేసి ఉంచడం కనిపించింది. అలాగే రోడ్డుమీద నిలిచిపోయిన నీళ్లను కూడా మోటార్లతో తోడుతున్నారు. దాంతో ప్రధాన రోడ్లలో వాహనాల రాకపోకలకు దాదాపు ఎక్కడా అంతరాయం కలగలేదు. అయితే కాలనీలలో మాత్రం పరిస్థితి ఇంకా అస్తవ్యస్తంగానే కనిపిస్తోంది. చెట్లు విరిగిపడి వాహనాలు కదలడం కష్టంగానే ఉంది.
గాలి దుమారం తాకిడితో నేలకూలిన హోర్డింగులు, చెట్ల తొలగింపు పనులను జీహెచ్‌ఎంసీ ముమ్మరం చేసింది. కమిషనర్ జనార్ధన్‌రెడ్డి శనివారం ఉదయం 7 గంటల నుంచి నగరంలో పర్యటిస్తున్నారు. గాలి తీవ్రతకు జుబ్లీహిల్స్‌లో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన హోర్డింగుల తొలగింపును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1, 12లలో రహదారులపై పడిన చెట్లు, కరెంటు స్తంభాలు, ఇతర అడ్డంకుల తొలగింపును అధికారులతో సమీక్షిస్తున్నారు.