పరిశుభ్రత, త్రికరణశుద్ధితోనే సంపూర్ణ ఆరోగ్యం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు
విజయనగర్‌కాలనీ: శస్త్ర చికిత్స అవసరమైన వారు కూడా మెడిటేషన్‌తో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ప్రధాని నరేంద్రమోడి ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాసబ్‌ట్యాంక్ జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ప్రాంగణంలోని ఆడిటోరియం హాలులో ‘క్లీన్ నేచర్-క్లీన్ నేషన్’ పేరిట నిర్వహించిన ప్రచారోద్యమ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ... పరిసరాల పరిశుభ్రతతో పాటు మానవుని ఆలోచనలు కూడా త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించిగలడన్నారు. ఈ ప్రచారోద్యమంలో బ్రహ్మకుమారీలు పర్యావరణ పరిరక్షణ పట్ల మన పూర్వీకుల విజ్ఞత తెలియజేసి ఆ సాంప్రదాయాన్ని ప్రజలు కొనసాగించేందుకు ప్రోత్సహిస్తారన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. విజయకిశోర్ మాట్లాడుతూ కళాశాలలోని 1400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కళాశాల ప్రాంగణాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతారన్నారు. ప్రతి విద్యార్థి ఈ కళాశాలలో చదివే నాలుగు సంవత్సరాలలో చదువుతో పాటు ప్రకృతి పరిశుభ్రత, దేశ పరిశుభ్రతతో పాటు శాంతి సామరస్యంతో సుందరమైన జీవనాన్ని సాగించగలిగే ఎన్నో అంశాలను నేర్చుకుంటారన్నారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రచారోద్యమం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పర్యటిస్తూ ఈ నెల 29న కరీంనగర్‌లో ముగిస్తుందన్నారు. బ్రహ్మకుమారిస్ సరళా దీదీ, మోహన్ సింఘాల్, లేఖ, జ్యోతి, శాంతి సరోవర్ రిట్రీట్ సెంటర్, గచ్చిబౌలి డెరైక్టర్ రాజయోగిని కులదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణాలతో పాటు గ్రామాలు, పల్లెలు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నాయంటూ జానపద కళాకారులు ఆలపించిన గేయాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి.