
ఐఈజీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఐఈజీ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గవర్నెన్స్) ఉద్యోగి ఒకరు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
- ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అంటూ సూసైడ్ నోట్
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐఈజీ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గవర్నెన్స్) ఉద్యోగి ఒకరు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతను హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు ఏమైనా జరిగితే దానికి బాధ్యులు చంద్రబాబు నాయుడే అని 16 పేజీల లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం చూస్తే...‘నేను ఎనిమిదేళ్లుగా ఐఈజీలో పనిచేస్తున్నాను. గత కొన్ని నెలలుగా సీఈఓ సుందర్‌గారు, స్పెషలాఫీసర్ రాధాకృష్ణ గారు చంద్రబాబు ఆదేశాలున్నాయంటూ తీవ్రంగా వేధిస్తున్నారు. ఇప్పటికే 15మందిని తీసేశారు. ఓరోజు గుంటూరుకు బదిలీ అంటారు, మరోరోజు విజయవాడకు అంటారు...నిజంగా జిల్లాల్లో ఉద్యోగుల అవసరం ఉంటే అక్కడ పనిచేసే ఉద్యోగులను ఎందుకు టెర్మినేట్ చేశారు.
చివరకు నేను విధులకు వచ్చిన రిజిస్టర్‌లో సంతకం చేస్తే ఆ సంతకాన్ని వైట్‌నర్‌తో దిద్దేశారు. అంటే రాధాకృష్ణ వేధింపులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్వయానా తెలుగుదేశం తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో చెప్పించాను. అయినా తనను తీసెయ్యాలని చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఏడు నెలలుగా నేను ఏ తప్పూ చేయలేదు. చెయ్యని తప్పుకు శిక్షణ అనుభవించడం కంటే చావడం మంచిదని అనిపించింది. చంద్రబాబు, సీఈఓ సుందర్, స్పెషలాఫీసర్ రాధాకృష్ణ, పాలనాధికారి బాబాలు నాలో ఓర్పుని తగ్గించారు. తీసేసిన మేరీ విజయ అనే మహిళా ఉద్యోగిని మళ్లీ తీసుకోండి.
నాకేదైనా జరిగితే దీనికి చంద్రబాబుగారే ప్రధాన ముద్దాయి’ అంటూ లేఖ రాశారు. రాజశేఖర్‌రెడ్డి గుంటూరు జిల్లావాసి. అవివాహితుడైన ఈయన నిద్రమాత్రలు మింగినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కొంతమంది స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో హుటాహుటిన గుంటూరు నుంచి ఆస్పత్రికి చేరుకున్నట్టు రాజశేఖర్‌రెడ్డి మిత్రులు ‘సాక్షి’కి తెలిపారు. ఈనెల 11న ‘బాబొచ్చాడు జాబులూడాయి’ అన్న శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనికి ఐఈజీ సీఈఓ సుందర్ వివరణ ఇస్తూ ప్రతిభ కనబరచని ఉద్యోగులను తొలగించే సర్వహక్కులూ మాకున్నాయని వివరణ ఇవ్వడం మరింతగా కుంగదీసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు.