
'సీట్లను అమ్ముకుంటే బ్లాక్ లిస్టులో పెడతాం'
హైదరాబాద్: ఈనెల 12 నుంచి ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అయితే దీనిపై ముందుగా 8 వతేదీన ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో సమావేశం నిర్వహిస్తామన్నారు. 'బి' క్యాటగిరి సీట్లను కొంతమంది బ్రోకర్లు అక్రమంగా అమ్ముకోవాలని చూస్తున్నారన్నారు. ఒకవేళ 'బి' క్యాటగిరి సీట్లను అమ్ముకుంటే ఆయా కళాశాలలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ రకంగా సీట్లను కొనుక్కోవాలనే విద్యార్థులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను విత్ హెల్డ్ లో పెట్టడమే కాకుండా.. రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 35౦ సీట్లు తగ్గినట్లు కామినేని తెలిపారు.
బీహార్ లో ఎన్నికలు ఉన్నందును ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. బీహార్ ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకం తమకు ఉందని కామినేని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం గతంలోనే తమ నాయకత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు.