
విద్యావంతులే బోల్తాపడుతున్నారు!
- సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న సిటీవాసులు
- వరుడు, ఫ్రెండ్ రూపంలో దగా
- పార్శిల్ గిఫ్ట్ పంపిస్తామని లక్షల్లో దోచుకుంటున్న వైనం
సాక్షి, సిటీబ్యూరో: మొన్న...భారత్ మ్యాట్రీమోని కన్నడిగూడ వెబ్‌సైట్‌లో తార్నాకలో ఉంటున్న 54 ఏళ్ల విజయలక్ష్మి పేరు రిజిస్టర్ చేసుకుంది. చందన్ డేవిడ్ పటేల్ అనే వ్యక్తి తన ప్రొఫైల్‌కు లైక్ కొట్టడంతో అతని వివరాలను తెలుసుకునేందుకు వెబ్‌సైట్ వాళ్లకు రూ. 5 వేలు చెల్లించింది. తనకు పెళ్లి అయి విడాకులయ్యాయని, యూకేలోని ఆయిల్ రిఫైనరీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని అతను పేర్కొన్నాడు. ఇలా వీరిమధ్య సన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలోనే 40 వేల యూఎస్ డాలర్లు, వెడ్డింగ్ రింగ్, బంగారు ఆభరణాలతో పాటు విడాకుల పత్రాలతో పార్సిల్ పంపుతున్నానని ఆమెకు చెప్పాడు.
అలా ఆమెకు మరుసటి రోజు డాక్టర్ ఫిలిప్స్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో కార్ట్‌కోడ్‌తో పాటు కస్టమ్స్ టాక్స్, మనీ లాండరింగ్ కింద దాదాపు 15,89,000ల ఆయా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసింది. మరో నాలుగు లక్షలు కట్టాలని మళ్లీ కాల్ రావడంతో అనుమానం వచ్చిన పెద్దావిడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను జూలై 21న ఆశ్రయించింది. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లి వలపన్ని చందన్ డేవిడ్ పటేల్ అలియాస్ డూయిస్‌ను అరెస్టు చేసి తీసుకొచ్చారు.
నిన్న...మెట్టుగూడలో ఉంటున్న పద్మిని కూడా విజయలక్ష్మి మాదిరిగానే మోసపోయింది. భారత్ మ్యాట్రీమోని కన్నడిగూడ వెబ్‌సైట్‌లో పేరు రిజిస్టర్ చేసుకుంది. అమెరికాలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నానని దేవ్ ప్రిన్స్ అడిగ పరిచయం చేసుకున్నాడు. గిఫ్ట్ పంపుతున్నానని చెపి.. డబ్బు కాజేశాడు. మళ్లీ డబ్బు పంపించమని అడగడంతో మోసపోయానని గ్రహించిన ఆమె జూలై 17న సైబర్ పోలీసులను ఆశ్రయించింది. అతడిని హైదరాబాద్ రప్పించి పట్టుకొనేందుకు సైబర్ పోలీసులు పథకం వేశారు.
తాజాగా... తెలుగు దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్న యువతికి ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో స్కాట్లాండ్‌కు చెందిన జాన్సన్ మోరేతో పరిచయం ఏర్పడింది. అలా అతను ఆమె కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు. వారం క్రితం 15 వేల పౌండ్లు, రింగ్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ పార్శిల్ పంపుతున్నానని చెప్పాడు. మరుసటి రోజే కార్తీ అగర్వాల్ కస్టమ్స్ అధికారిగా ఫోన్ చేసి డెలివరీ చార్జీస్ కింద రూ. 42,500లు, మనీ లాండరింగ్ కింద 1,30,000, టాక్స్ కింద 1,70,000లు చెల్లించాలని బ్యాంక్ ఖాతాలు ఇచ్చాడు. ఆ యువతి ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేసింది. మళ్లీ యాంటీ టైస్టు డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నామని, 2,90,000లు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని కోరడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను బుధవారం ఆశ్రయించింది.
ఇలా విద్యావంతులు, సంపన్నులు, భారీగా డబ్బు వస్తుందని మరికొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. లక్షల్లో డబ్బులు చెల్లించి పీకల్లోతు నష్టపోయాక సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫేస్‌బుక్ చాటింగ్ స్నేహంతో కొందరు... మ్యాట్రీమోనిలో వరుడి రూపంలో మరికొందరు... లాటరీ తగిలిందని ఇంకొందరు...ఇన్సూరెన్స్ డబ్బులు నాలుగింతలు చేస్తామని మరికొందరు... ఇలా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో నెలకు పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ వాటి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని సైబర్ పోలీసులు సామాజిక మాధ్యమాలు, పత్రికా ప్రకటనల ద్వారా అవగాహన కలిగించినా... ఉన్నత విద్యావంతులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను పట్టుకుంటున్నా.... వారి నుంచి మాత్రం డబ్బు రికవరీ కావడం లేదు. అందుకే సైబర్ నేరగాళ్ల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ మూల్యం తప్పదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్త అవసరం
ప్లస్ 371, ప్లస్ 371 నంబర్లతో వచ్చే ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచారం పెట్టకపోవడమే ఉత్తమం. కొన్ని సంస్థలు బూటకపు ఈ మెయిల్స్‌తో నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాయి. నగదు లావాదేవీల్లో నయా వంచన జరుగుతోంది. అమ్మాయిలు కూడా ఊరికే ఎదుట వ్యక్తులను నమ్మి లక్షలు లక్షలు ధారపోయరాదు. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తత అవసరం.
ముగ్గురు నైజీరియన్ల అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: లాటరీ తగిలిందని సిటీకి చెందిన ఓ అమ్మాయిని మోసగించిన ముగ్గురు నైజీరియన్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని మహవీర్ మార్గ్‌లో నిందితులు ఒడిడి అనిరియోడి వాల్స్, కెమాకర్ ఆంటోనీ, జెన్‌వోబసి గోస్పెల్ ఇకెన్నాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు....వారిని అక్కడి సీఎంఎం టిస్ హజారి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి బుధవారం తీసుకొచ్చారు. వివరాలు... మూడు కోట్ల 60 లక్షల సమ్‌సాంగ్ లాటరీ తగిలిందని జూన్ తొలివారంలో మల్కాజిగిరికి చెందిన ఓ అమ్మాయి సెల్‌కి ఎస్‌ఎంఎస్ వచ్చింది.
డబ్బు పంపించాలంటే చిరునామాతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు పంపించామన్నారు. దీంతో ఎగిరి గంతేసిన ఆమె పూర్తి వివరాలు పంపింది. ఆ తర్వాత రోజు సమ్‌సంగ్ కంపెనీ డెరైక్టర్ జేమ్స్ మోర్గాన్ విన్నింగ్ లాటరీ గెలుచుకుందని మెయిల్ పంపించారు. లావాదేవీలు సాఫీగా సాగేందుకు భారత్‌లోని ఆర్‌బీఐ అధికారులు కాంటాక్ట్‌లో ఉంటారని తెలిపారు. ఇన్‌కమ్ టాక్స్ క్లియరెన్స్, యాంటి టైస్టు సర్టిఫికెట్, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వివిధ బ్యాంక్ ఖాతాలు ఇవ్వగా అందులో 15,50,800లు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత కూడా డబ్బులు డిపాజిట్ చేయమని కాల్స్ రావడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
ఈ మేరకు కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్స్ ఏసీపీ జయరామ్, ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ రియాజుద్దీన్, ఎస్‌ఐ విజయ్ వార్తన్ బృందం న్యూఢిల్లీకి వెల్లి మహవీర్ మార్గ్‌లో ముగ్గరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిడి అనిరియోడి వాల్స్, కెమాకర్ అంటోనీ, జెన్‌వోబసి గోస్పెల్ ఇకెన్నాల నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు, పది సెల్‌ఫోన్‌లు, ఎనిమిది ఇంటర్నెట్ డేటాకార్డులు, 53 అక్టివ్ సిమ్‌కార్డులు, 1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన ఒడిడి అనిరియోడి వాల్స్ నైజీరియాలో పోలీసు అధికారిగా పనిచేసి...2013లో భారత్‌కు బిజినెస్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. కాలపరిమితి ముగిసినా అక్రమంగా ఢిల్లీలోనే ఉంటున్నారు.