
బొమ్మత్తు!
నగరంలోని ఓ ప్రాంతంలో నలుగురు యువకులు చిట్‌చాట్ చేస్తున్నారు. వివిధ రకాలైన డిజైన్లు, బొమ్మలతో ఉన్న చిన్న సైజు పేపర్లను చేతితో పట్టుకున్నారు.. అప్
బొమ్మల మాటున ఎల్‌ఎస్‌డీ మాదక ద్రవ్యం
సిటీలో జోరుగా సింథటిక్ డ్రగ్ విక్రయం
పెడ్లర్స్ ఆచూకీ కోసం పోలీసుల యత్నం
సిటీబ్యూరో: నగరంలోని ఓ ప్రాంతంలో నలుగురు యువకులు చిట్‌చాట్ చేస్తున్నారు. వివిధ రకాలైన డిజైన్లు, బొమ్మలతో ఉన్న చిన్న సైజు పేపర్లను చేతితో పట్టుకున్నారు.. అప్పుడప్పుడు ఈ కాగితాలను చిన్న ముక్కలుగా చేసి నాలుకపై పెట్టుకుని సరదాగా చప్పరిస్తున్నారు... ఈ సీన్ చూస్తే సాధారణంగా ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు. తరచి చూస్తే ఆ బొమ్మల్లో భయంకరమైన ఎల్‌ఎస్‌డీ డ్రగ్ దాగుంటుంది. ఇటీవల కాలంలో పొరుగు రాష్ట్రాల ముఠాలు ఈ సింథటిక్ మాదక ద్రవ్యాన్ని సిటీకి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో నిఘా ముమ్మరం చేశారు.
పెరిగిన నిఘా
గడిచిన కొన్నేళ్లలో నగర పోలీసులు అనేక డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. వారి నుంచి బ్రౌన్‌షుగర్, కొకైన్, ఎక్ట్ససీ, ఖత్ వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి డ్రగ్స్‌ను నగరానికి తరలించడం.. విక్రయించడంలో కీలక పాత్ర పోషిస్తున్న (పెడ్లర్స్) సౌతాఫ్రికా జాతీయులతో పాటు కొన్ని పబ్స్‌లో పని చేసే స్థానికులపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో విక్రేతలు, వినియోగదారుల కన్ను ఎల్‌ఎస్‌డీపై పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
డిజైన్ మధ్యలో మాదక ద్రవ్యం...
లినర్జిక్ యాసిడ్ డై థైలామెడ్ (ఎల్‌ఎస్‌డీ) మాదక ద్రవ్యం వాస్తవానికి ఘన రూపంలో కనిపించే ద్రావణం. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో దీన్ని బ్లాటింగ్ పేపర్‌పై పూతలా ఏర్పాటు చేస్తారు. దీనికి ముందు ఆ కాగితంపై ఓ డిజైన్ రూపొందిస్తారు. కంప్యూటర్ సాయంతో అలాంటి డిజైన్ ఉన్న కాగితాలను ఒకే సైజులో, పెద్ద సంఖ్యలో తయారు చేస్తారు. వీటిపై ఎల్‌ఎస్‌డీ పూసే విధానం పూత రేకుల తయారీని పోలి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పూతరేకులపై పంచదార ఎలా వేస్తారో... బ్లాటింగ్ పేపర్‌పై ఎల్‌ఎస్‌డీ ద్రావణాన్ని అదే విధంగా పూస్తారు. ఈ కాగితాన్ని మామూలుగా చూస్తే ఓ డిజైన్‌తో కూడినట్టుగా మాత్రమే కనిపిస్తుంది. పరీక్షగా చూస్తేమాత్రమే ఎల్‌ఎస్‌డీ పూత ఉందనే విషయాన్ని గుర్తించగలం. సమయం, డిమాండ్‌ను బట్టి ఒక్కో గ్రాము ఎల్‌ఎస్‌డీ రూ.1500 నుంచి రూ.2500 వరకు పలుకుతోందని సమాచారం.
నెదర్లాండ్‌స కేంద్రంగా...
ఎల్‌ఎస్‌డీ మాదక ద్రవ్యం ఎక్కువగా నెదర్లాండ్స్‌లో తయారవుతోంది. భారత్‌లో గోవాతో పాటు ఉత్తరాదిలోని కొన్ని నగరాల్లో దీని ‘యూనిట్లు’ ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఆకులతో పాటు ఘన రూపంలో ని ఇతర మాదక ద్రవ్యాలు సుపరిచితమైపోవడంతో పెడ్లర్స్ ఎల్‌ఎస్‌డీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని పోస్ట్, కొరియర్, ప్రైవేట్ ట్రావెల్స్, వ్యక్తుల ద్వారా నగరానికి పంపుతున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వ్యాపారం లాభసాటిగా ఉండడంతో ఆ ముఠాలు ఇక్కడే దృష్టి కేంద్రీకరిస్తున్నాయని సమాచారం.
నేరుగా నాలుకపై వేసుకుని...
ఈ డ్రగ్‌ను తీసుకోవడం చాలా తేలిక కావడం పెడ్లర్స్‌కు కలిసి వస్తున్న అంశం. వీరు బ్లాటింగ్ కాగితాలపై ఎల్‌ఎస్‌డీని తీసుకువచ్చి ఒక్కో కాగితం లేదా గ్రాము చొప్పున విక్రయిస్తున్నారని తెలిసింది. దీనిపై పోలీసులకు పెద్దగా సమాచారం, అనుమానం లేకపోవడంతో ఉత్తరాదికి చెందిన అనేక మంది పథకం ప్రకారం బెంగళూరు మీదుగా నగరానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. సిటీలోని పెడ్లర్స్ వీటిని పబ్స్‌తో పాటు అనేక ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. బ్లాటింగ్ పేపర్‌లో నుంచి ఓ ముక్కను చింపుకుని నేరుగా నాలుకపై పెట్టుకుంటూ వాడుతున్నారని తెలుస్తోంది.
‘సోషల్’ సంప్రదింపులు
నగరంలోని కొందరు పెడ్లర్స్ తమ రెగ్యులర్ క్లయింట్స్‌తో సోషల్ మీడియా ద్వారా సంప్రదించడంతో పాటు డ్రగ్ అందుబాటుపై సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమ ‘వినియోగదారుల’తో సోషల్ మీడియాల్లో ప్రత్యేక గ్రూప్‌లు ఏర్పాటు చేస్తూ సంప్రదిస్తున్న విక్రేతలు శని, ఆదివారాల్లో కొన్ని పబ్బులు, హోటళ్ల కేంద్రంగా భారీ విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పెడ్లర్లు పదుల సంఖ్యలో ఈ పేపర్లు పట్టుకు వచ్చినా.. కొరియర్, పోస్టు ద్వారా పంపినా ఎవరికీ అనుమానం రాదు. ఈ పార్శిళ్లను స్కానింగ్ చేసినప్పటికీ డ్రగ్ పూతను కనిపెట్టడం సాధ్యం కాకపోవడం వీరికి కలిసి వస్తోంది. సిటీలో ఎల్‌ఎస్‌డీ విక్రయంపై సమాచారం అందుకున్న పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది.