డిసెంబర్ 15 నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఆయా శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 15 నుంచి 18 వరకు సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరంలో రోడ్లను సుందరంగా మార్చాలని జీహెచ్‌ఎంసీ అధికా రులను ఆదేశించారు. రోడ్లపై చెత్త లేకుండా పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. సదస్సుకు హాజరయ్యే దాదాపు 3 వేల మంది ప్రతినిధుల పర్యటనల కోసం పర్యాటక శాఖ ఏర్పాట్లు చేయాలన్నారు.
హైటెక్స్‌లో సదస్సు..
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 1934లో ఏర్పడ్డ తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో నాలుగు రోజుల చొప్పున సదస్సులు నిర్వహించటం ఆనవారుుతీ. 1998లో నగరంలోని పబ్లిక్ గార్డెన్‌సలో నిర్వహించిన తర్వాత మళ్లీ ఇప్పుడు అవకాశం లభించింది. రోడ్ల నాణ్యతను పెంచటంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చిస్తారు. ఇటీవల తెలంగాణకు కొత్తగా 2,500 కి.మీ. కొత్త జాతీయరహదారులు మంజూరైన నేపథ్యంలో వాటి నిర్మాణంలో అనుసరించాల్సిన ఆధునిక పరిజ్ఞానం, దేశంలోనే గొప్ప రోడ్లుగా వాటిని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలై ఇందులో సూచనలు అందే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.