భారతీయులకు ‘హెచ్1బీ’ జారీ తగ్గలేదు
* దానిపై పెరిగిన ఫీజుల ప్రభావం లేదు
* భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఫీజులు పెంచలేదు
* మీడియాతో అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ కాన్సులార్ అఫైర్స్ బాండ్
సాక్షి, హైదరాబాద్: హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజులను ఇటీవల భారీగా పెంచినప్పటికీ భారతీయ వృత్తి నిపుణులకు జారీ చేసిన ఆ వీసాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ కాన్సులార్ అఫైర్స్ మిషెల్ బాండ్ తెలిపారు. వీసా ఫీజుల పెంపుపై భారతీయ కంపెనీల ఆందోళనను అర్థం చేసుకోగలమని, అయితే భారత్‌ను లక్ష్యంగా చేసుకొని వీసా ఫీజులు పెంచలేదని ఆమె తెలిపారు. అమెరికా చట్టాల్లో మార్పుల వల్లే వీసా ధరలు పెరిగాయన్నారు.
ఇతర దేశాల వీసా ఫీజులతో సమానంగా అమెరికా వీసా ఫీజులు ఉన్నాయని వివరించారు. భారత్‌తో వ్యాపార సంబంధాలు తమకు ఎంతో ముఖ్యమని, ఫీజుల పెంపు ప్రభావం దానిపై ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మిషెల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతేడాది భారతీయులకు అత్యధిక టూరిస్టు, బిజినెస్ వీసాలు జారీ చేశామని, గత ఐదేళ్లతో పోల్చితే ఇది 81 శాతం అధికమన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య పెరుగుతున్న సంబంధాలకు ఈ లెక్కలు నిదర్శనమన్నారు. 2017లో టూరిస్టు, స్వల్పకాలిక బిజినెస్ వీసాల సంఖ్యపై పరిమితి (క్యాప్) ఉండదన్నారు. అర్హులైన దరఖాస్తుదారులందరికీ వీసాలు జారీ చేస్తామన్నారు.
పదేళ్ల కాలపరిమితితో ఈ వీసాలు జారీ చేస్తామని, వీటితో ఎక్కువ పర్యాయాలు అమెరికాలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. నైపుణ్యంగల భారతీయ ఉద్యోగులను అమెరికా ఆహ్వానిస్తోందన్నారు. అమెరికాలో ఉద్యోగం కోసం జారీ చేసే హెచ్1బీ వీసాల విషయంలో అత్యంత లబ్ధిపొందిన దేశం భారతేనన్నారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాల్లో 72 శాతం, ఎల్1 వీసాల్లో 30 శాతం వీసాలను భారతీయులే అందుకున్నారని చెప్పారు. అమెరికా వీసాలు పొందడంలో భారతీయుల విజయాలకు ఈ గణాంకాలే నిదర్శమన్నారు. భారతీయ వ్యాపారవేత్తలకు సత్వరమే సమర్థంగా, పారదర్శకంగా సేవలందించేందుకు ఇక్కడి అమెరికన్ రాయబార, కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు కట్టుబడి ఉన్నాయన్నారు.
ఐదో స్థానంలో హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్...
భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు అమెరికాలోని వర్సిటీలు, కాలేజీల్లో చేరుతుండడం తమకు సంతోషదాయకమని మిషెల్ పేర్కొన్నారు. గతేడాది 60 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేశామని తెలిపారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత రెండో స్థానం భారతీయ విద్యార్థులదేనన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య గతేడాదికి 1.32 లక్షలకు పెరిగిందన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం అత్యధిక వీసాలు జారీ చేసిందని, ప్రపంచంలోని 200 యూఎస్ కాన్సులేట్ కార్యాలయాలతో పోల్చితే అత్యధిక వీసాల జారీలో నగరంలోని కాన్సులేట్ ఐదో స్థానంలో నిలిచిందన్నారు.
హైదరాబాద్ టీం పనితీరుపై గర్వపడుతున్నామన్నారు. అమెరికా-భారత్‌ల మధ్య ఆర్థిక, వాణిజ్య, సామాజిక సత్సంబంధాలే తమకు అత్యంత ప్రాధాన్యాంశమన్నారు. ఇరు దేశాల నడుమ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 2017ను పర్యాటక సంవత్సరంగా పరిగణించాలని గత జూన్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని మోదీ ప్రకటించారని మిషెల్ గుర్తుచేశారు.
కొత్త భవనం నిర్మిస్తాం...
అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌లో కొత్త కాన్సులేట్ జనరల్ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. 2017లో నిర్మాణం ప్రారంభించి 2020 నాటికి భవనం అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ భవనంలో 52 ఇంటర్వ్యూ విండోలు ఉంటాయన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, ఎవరిపైనా వివక్ష చూపబోమన్నారు. గతేడాది కొందరు భారతీయ విద్యార్థులను అమెరికా ఎయిర్‌పోర్టుల నుంచే స్వదేశానికి తిప్పి పంపిన ఉదంతంపై విలేకరుల ప్రశ్నలకు మిషెల్ స్పందించారు. వీసాలు మంజూరు చేసినా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్, స్క్రీనింగ్ అధికారులు ప్రత్యేక కేసులు, ఏదైనా సమాచారం ఆధారంగా అమెరికాలోకి ఎవరి ప్రవేశాన్నైనా నిరాకరించే అవకాశం ఉందన్నారు.