టెట్‌లో అన్యాయం | Injustice in TET | Sakshi
Sakshi News home page

టెట్‌లో అన్యాయం

Published Mon, Jun 26 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

టెట్‌లో అన్యాయం

టెట్‌లో అన్యాయం

- డీఎడ్‌–డిగ్రీ వారికి పేపర్‌–2 రాసేందుకు అనుమతి నిరాకరణ
డిగ్రీలో 50 శాతం మార్కులు లేని జనరల్‌ అభ్యర్థులు ఔట్‌
 
సాక్షి, హైదరాబాద్‌: విద్యా శాఖ అనాలో చిత నిర్ణయాలవల్ల అనేక మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) అభ్యర్థులకు అన్యాయం జరగనుంది. త్వరలో నిర్వహించనున్న టెట్‌కు వేల మంది అభ్యర్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) పూర్తి చేసి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లక్షల మంది ఉన్నారు. వారికి టెట్‌ పేపర్‌–2 రాసేందుకు విద్యా శాఖ ఈసారి అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో పడ్డారు.

ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలను తుంగలో తొక్కి లక్షల మంది అభ్యర్థులకు విద్యా శాఖ అన్యాయం చేస్తోంది. 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) పూర్తి చేసిన జనరల్‌ అభ్యర్థులను కూడా టెట్‌కు అనుమతించలేదు. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పనిచేయాలనుకునే వారు కూడా కచ్చితంగా టెట్‌లో అర్హత సాధించాలని ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది. ఈ నిబంధనలతో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు కనీసం ప్రైవేటు పాఠశాలల్లోనైనా ఉపాధి పొందలేని పరిస్థితి నెలకొంది. 
 
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే... 
విద్యా హక్కు చట్టం ప్రకారం 2010లో టీచర్లు కావాలనుకునే వారికి టెట్‌ను ఎన్‌సీటీఈ తప్పనిసరి చేసింది. ఈ మేరకు 2010 ఆగస్టు 23న టెట్‌ మార్గదర్శకాలను జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారు 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు (ఈ మార్గదర్శకాలు వచ్చే నాటికంటే ముందుగా ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారు 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు) డీఎడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలని, వాటితోపాటు టెట్‌ పేపర్‌–1లో కచ్చితంగా అర్హత సాధించి ఉండాలని స్పష్టం చేసింది. 6, 7, 8 తరగతులకు బోధించాలనుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు (ఈ మార్గదర్శకాలు వచ్చే నాటికంటే ముందు పూర్తి చేసిన వారు 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు) బీఎడ్‌ పూర్తి చేసి ఉండాలని, డీఎడ్‌తో పాటు డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా పేపర్‌–2 పరీక్షకు హాజరుకావొచ్చంది. 
 
నిబంధనలను పక్కన పెట్టి..
టీచర్లుగా నియమితులయ్యే వారికి ఉండాల్సిన నిర్ణీత అర్హతలను సాకుగా చూపి వారికి అన్యాయం చేస్తోంది. నిర్ణీత అర్హత 50 శాతం మార్కులు ఉండాలని ఎన్‌సీటీఈ చెప్పిందంటూ వారంతా టెట్‌ రాయడానికి వీల్లేకుండా చేస్తోంది. కానీ 2015 డిసెంబర్‌ 23 నుంచి ఎన్‌సీటీఈ అమల్లోకి తెచ్చిన ‘ఉపాధ్యాయుల కనీస అర్హతలు–2014’లో అలాంటిదేమీ లేదు. అయినా విద్యా శాఖ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో బోధించే వారికి కూడా టెట్‌ను తప్పనిసరి చేసిన విద్యా శాఖ ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలున్న వారిని కూడా టెట్‌కు హాజరు కాకుండా చేస్తోంది. డీఎడ్‌ పూర్తి చేసి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు 50 వేల మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు. వారికి టెట్‌ పేపర్‌–2 రాసే అవకాశం ఇవ్వట్లేదు. గతంలో 4 టెట్‌లలోనూ వారికి అవకాశం ఇచ్చి ఈసారి మాత్రం ససేమిరా అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement