అన్యాయం జరిగిందంటూ సీఎంవోకు రేంజ్ ఇన్‌స్పెక్టర్ల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో డీఎస్పీ పదోన్నతులపై మళ్లీ రగడ మొదలైంది. హైదరాబాద్ రేంజ్, సిటీ పోస్టుల పంచాయితీ మళ్లీ తెరమీదకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తమ పోస్టుల్లో సిటీ అధికారులు పదోన్నతులు పొంది తమను కిందకు నెట్టారంటూ రేంజ్ ఇన్‌స్పెక్టర్లు సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమను సీనియారిటీలో పట్టించుకోకుండా సిటీలోని వారికే పదోన్నతులు అంటగడుతున్నారంటూ ఆందోళన చేశారు. ప్రస్తుతం 1991, 89 బ్యాచ్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్లకు పదోన్నతులు కల్పించేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది.
అయితే తమకూ పదోన్నతులు ఇవ్వాల్సిందేనని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి పదోన్నతులు కట్టబెట్టి తమకు మళ్లీ మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ 1995, 1996 బ్యాచ్ ఇన్‌స్పెక్టర్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పదోన్నతులపై ఏం చేయాలో తెలియక పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. సీనియారిటీ ప్రకారం ముందుకెళ్దామంటే గతంలో తెచ్చిన 54 జీవో పునఃసమీక్షించలేదు. అడహాక్ పద్ధతిలో పదోన్నతులు కల్పిద్దామంటే ఆంధ్రావాళ్లకే ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చే ప్రమాదముంది.
పదోన్నతులపై పంచాయితీ
Published Wed, May 24 2017 2:15 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement