కమల దండు కదిలింది
పాదయాత్రలతో ముమ్మర ప్రచారం
సిటీబ్యూరో: గ్రేటర్ పీఠమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి ‘కమల’ దండు కదిలింది. అయితే... మిత్రపక్షమైన టీడీపీ సహకారం అంతంత మాత్రమే ఉండటం కమలనాథులకు మింగుడు పడడం లేదు. ప్రచారానికి దూరంగా ఉన్న పచ్చ నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో ఎలాగైనా అత్యధిక స్థానా లు చేజిక్కించుకొని 2002నాటి పరిస్థితులను పునరావృతం చేయాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. తాము పోటీ చేస్తున్న 65 డివిజన్లలో ప్రచారాన్ని ముమ్మ రం చేశారు. తమకు బలమున్న ప్రాంతాలపై కాకుండా ప్రత్యర్థులకు పట్టున్ను ప్రాంతాలపైనే దృష్టి పెట్టి తొలిదశ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. స్థానిక పరి స్థితులను పరిగణనలోకి తీసుకొని ఎక్కడికక్కడ వ్యూహా త్మకంగా ఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభు త్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ... తమకు అవకాశం ఇస్తే నిర్దిష్ట గడువులోగా వాటిని పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని అభ్యర్థులు మందీమార్బలంతో పాటు డ ప్పు నృత్యాలతో ఓటర్లను ఆకట్టుకునేం దుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ నామస్మరణతో నినాదాలు చేయడం తప్ప తమను గెలిపిస్తే నగరంలో ఏం చేస్తామన్న దానిపై హామీలు ఇవ్వడం లేదు. టీడీపీ డివిజన్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తూతూ మంత్రంగా ప్రచారం నిర్వహిస్తుండగా... బీజేపీ డివిజన్‌లో టీడీపీ నాయకులు ఇలా మొహం చూపి అలా మాయమై పోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అగ్రనాయకులు ప్రచారం చేయాల్సి వస్తే ఎడ మొహం... పెడ మొహంగానే వ్యవహరిస్తున్నారు.
ఉదయాన్నే మొదలు..
ఉదయం 5 గ ంటలకే వివిధ డివిజన్ల పరిధిలోని పార్కు ల వద్ద అభ్యర్థులు కాపు కాస్తూ వాకింగ్‌కు వచ్చే వారిని కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఆ తర్వాత 10 గంటల నుంచి కాలనీలు, బస్తీల్లో పాదయాత్రలు, మహిళలతో ‘ఇంటింటికీబొట్టు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శివారులోని మీర్‌పేట్, చర్లపల్లి, నాచారం, చిలకానగర్, ఉప్పల్, హబ్సిగూడ, రామాంతాపూర్, పటాన్‌చెరు, ఫతేనగర్ ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రచార జోరును మరింత పెంచారు. రోజూవారీ ప్రచారానికి ఏర్పాటు చేసుకున్న కార్యకర్తలను ఒక డివిజన్‌లో ప్రచారం ముగియగానే వాహనాల్లో మరో డివిజన్‌కు తరలిస్తున్నారు. ఈ వ్యయాన్ని అభ్యర్థులంతా కలిసి భరించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కిరాయి కార్యకర్తలను తరలించే వాహనాల్లోనే పార్టీల జెండాలను తీసుకె ళుతూ ఫలానా పార్టీ అభ్యర్థి ప్రచారం అని మేస్త్రీ ఆదేశించగానే ఆ జెండాలతో కిందికి దిగుతున్నారు. ఇలా ఒక్కో డివిజన్‌లో ఉదయం ఓసారి, సాయంత్రం ఓసారి ప్రచారం చేస్తున్నారు.