ఆల్ ది బెస్ట్
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సిటీబ్యూరో: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షల్లో భాగంగా తొలిరోజు ప్రథమ సంవత్సరం పరీక్ష జరగనుంది. గ్రేటర్ పరిధిలో దాదాపు 1.92 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోనున్నారు. వీరికోసం 400కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఇప్పటికే అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కేందుకు వీలైనంత త్వరగా ఇళ్ల నుంచి బయలు దేరాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని కేంద్రాలను అనసంధానం చేస్తూ గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తోంది. కాగా పరీక్షల సమయంలో విద్యార్థులు ఆహారం, ఆరోగ్యం విషయంలో నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని మానసిక, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతుండడంతో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలంటున్నారు.
ఆర్టీసీ వెయ్యి ప్రత్యేక బస్సులు
ఈ నెల 1వ తేదీ నుంచి 18 వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 1000 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్‌లతో పాటు ఉచిత, రాయితీ బస్‌పాస్‌లను కూడా కలిగి ఉండాలి. ఈ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫోన్ 9959226160, 9959226154 నెంబర్‌లకు సంప్రదించవచ్చు.