అంతర్జాతీయ నేరగాళ్లకు స్థావరంగా నగరం
టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే సిద్దిపేటకు గ్రేటర్ ఆదాయం: రావుల, ఒంటేరు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు అభివృద్ధి పథంలో నడిచిన హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ నేరగాళ్లకు స్థావరంగా, గొలుసు దొంగల అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నగర ఆదాయాన్ని కూడా సిద్ధిపేటకు తరలించుకోపోతారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, గజ్వేల్ ఇన్‌చార్జ్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ హయంలో అభివృద్ధికి ఆనవాలుగా నిలిచిందని.. కేసీఆర్ సీఎం అయ్యాక దొంగతనాలు, దోపిడీలతోపాటు అంతర్జాతీయ నేరగాళ్లు సంచరించే కేంద్రంమైందని విమర్శించారు.
గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ముఖచిత్రం మీద కేసీఆర్ మెడలో బంగారు గొలుసు భద్రంగా ఉందని, మహిళల గొలుసులకు మాత్రం హైదరాబాద్‌లో రక్షణ లేదని అన్నారు. నారాయణఖేడ్‌లో టీడీపీ అభ్యర్థి విజయపాల్‌రెడ్డి విజయంపై టీడీపీ ధీమాతో ఉందని, ఇక్కడ మంత్రి హరీశ్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలితం ఉండదన్నారు. సిద్దిపేటకే న్యాయం చేయని హరీశ్ నారాయణఖేడ్‌కు ఏం చేస్తారని రావుల, ఒంటేరు ప్రశ్నించారు.