'మహా' ఒప్పందం దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్ | Is the motto of the country | Sakshi
Sakshi News home page

'మహా' ఒప్పందం దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

Published Wed, Aug 24 2016 4:26 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

'మహా' ఒప్పందం దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్ - Sakshi

'మహా' ఒప్పందం దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

- తెలంగాణ-మహారాష్ట్ర ఒప్పందంపై సీఎం కేసీఆర్
- తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరాటా నిర్మాణంపై ముందడుగు
- ముంబైలో జరిగిన భేటీలో సంతకాలు చేసిన కేసీఆర్, ఫడ్నవీస్

 
 సాక్షి, హైదరాబాద్ : సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ-మహారాష్ట్రల మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. రైతులకు ఎంతో మేలు చేసే ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం కావడం సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సందర్భమని పేర్కొన్నారు. నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణ-మహారాష్ట్ర ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించడం దేశానికి ఆదర్శణీయమన్నారు. మంగళవారం మహారాష్ట్రలో ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో మూడు ప్రా జెక్టుల నిర్మాణ ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు.

అనంతరం మాట్లాడారు. దేశం లో ఒక మంచి ఒరవడికి ఈ ఒప్పందం నాంది పలుకుతుందని కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్నేహ హస్తం అందించినందుకు తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున , వ్యక్తిగతంగా కూడా ఆ రాష్ట్ర సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి.. ఒప్పం దాలు కుదిరేందుకు విశేష కృషి చే శారని ప్రశంసించారు. ఏటా వేలాది టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని.. ఆ నీటిని సద్వినియోగం చేసుకుని, రైతులకు అందించేందుకే ప్రాజెక్టులు చేపట్టామని కేసీఆర్ తెలిపారు.  

 ప్రేమ భావనతో ముందుకెళుతున్నాం
 ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు పొరుగు రాష్ట్రాలతో జగడాలు పెట్టుకుని ప్రాజెక్టులను కట్టలేదని కేసీఆర్ విమర్శించారు.గతంలో ఏపీలో, కేం ద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తాము మాత్రం ప్రేమ భావనతో ముందుకు వెళుతున్నామన్నారు. దేశంలో నీటి కోసం ఎన్నో వివాదాలు నెలకొన్నాయని.. కానీ కేంద్రం జోక్యం లేకుండా ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కారం కావడం చారిత్రాత్మకమని కొని యాడారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ పొరుగు రాష్ట్రాలతో స్నేహపూరిత వైఖరిని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా అన్ని విషయాల్లో పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళతామన్నారు. త్వరలో కృష్ణా జలాలపై కూడా ఒప్పందం కుదుర్చుకుంటామని, అవసరమైతే ట్రిబ్యునల్‌లో కలసి పోరాడుతామని పేర్కొన్నారు.

 పరస్పర సన్మానం
 ఒప్పందం కుదిరిన తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు పరస్పరం శాలువాలు కప్పి సత్కరించుకున్నారు. ఫడ్నవీస్‌కు వెండి చార్మినార్ ప్రతిమను కేసీఆర్ అందజేయగా.. కేసీఆర్‌కు వెండి వినాయకుడి ప్రతిమను ఫడ్నవీస్ అందజేశారు. మహారాష్ట్ర మంత్రులకు మంత్రి హరీశ్‌రావు.. తెలంగాణ మంత్రులకు ఆ రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ జ్ఞాపికలు అందించారు.

 మహా గవర్నర్‌తో భేటీ...
 సాక్షి, ముంబై: మహారాష్ట్రతో ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకున్న అనంతరం.. మంగళవారం మధ్యాహ్నం ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
 
 హరీశ్‌రావుకు అభినందనల వెల్లువ
 తెలంగాణ-మహారాష్ట్రల మధ్య సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందం కుదరడానికి మంత్రి హరీశ్‌రావు విశేష కృషి చేశారంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అభినందించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారి అనుమానాలను హరీశ్ నివృత్తి చేశారని కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర నీటి పారుదల మంత్రి, అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై సమస్యను పరిష్కరించడానికి కృషి చేశాడన్నారు.ప్రాజెక్టుల విషయంలో హరీశ్ ఎంతో కష్టపడ్డారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రశంసించారు. ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో సమావేశాలు ఏర్పాటుచేసి సమన్వయంతో వ్యవహరించారని... వెంటపడి మరీ తక్కువ సమయంలోనే ఒప్పందం కుదరడానికి కృషి చేశారని పేర్కొన్నారు.
 
 ఉమ్మడి రాష్ట్రంలో ముందుకు పడలే: కేసీఆర్
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులు తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడకుండా చేశారని.. సమస్యలను పరిష్కరించుకునే బదులు మరింత జటిలం చేశారని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నామన్నారు. ‘నేను మొదటిసారి ముంబై వచ్చినపుడు స్పష్టంగా చెప్పాను. మాకు కావాల్సింది నీళ్లే తప్ప వివాదాలు కాదు. రైతు ఎక్కడివాడైనా రైతే. సమైక్య ఏపీలో నీటి పారుదల రంగంలో తీవ్రంగా నష్టపోయాం. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ముంపు సమస్య లేకుండా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 152మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కడతామని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని.. దానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పారు. ఈ పరిస్థితిని నివారించేందుకు తాము తమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ బ్యారేజీని డిజైన్ చేశామని.. 101 మీటర్ల ఎత్తు బ్యారేజీ నిర్మాణానికి అనువుగా బేస్‌మెంట్ నిర్మించి, 100 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడతామని తెలిపారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు అందిస్తామన్నారు. ఇక ఛనాఖా-కొరాటాతో పాటు ఇతర బ్యారేజీల నిర్మాణానికి పరస్పర అంగీకారం కుదరడం శుభ సూచకమన్నారు.
 
 కేసీఆర్‌ది స్నేహపూర్వక వైఖరి: ఫడ్నవిస్
 ఉమ్మడి ఏపీ ఉన్నపుడు తమకు నిత్యం ఘర్షణ పూరిత వైఖరి ఉండేదని.. తెలంగాణ ఏర్పడ్డాక సంబంధాలు మెరుగయ్యాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న స్నేహపూర్వక వైఖరే దీనికి కారణమని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సామరస్యపూర్వకంగా ఒప్పందాలు చేసుకోవడం శుభపరిణామమని... ఇది దేశంలో కొత్త అధ్యాయానికి తెరతీసిందని పేర్కొన్నారు. తక్కువ ముంపుతో ఎక్కువ నీళ్లు వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ చేసిందని ప్రశంసించారు. తాజాగా కుదిరిన ఒప్పందం వల్ల గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదుల నీరు ఇరు రాష్ట్రాల రైతులకు ప్రయోజనకరమని తెలిపారు. ఇది మంచి సాంప్రదాయమని, రాబోయే కాలంలో కూడా ఇదే సహకార స్ఫూర్తి కొనసాగుతుందని ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement