హైదరాబాద్‌లో ఐసిస్?
తమ కాలేజీలో ఉగ్రశిక్షణ అంటూ ఓ లెక్చరర్ ఆరోపణ
* అడ్డుచెప్పినందుకు తనను బెదిరించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు.. కొద్ది గంటల్లోనే మృతి
* ఈ ఘటనలపై సోషల్ మీడియాలో కలకలం
* రంగంలోకి దిగిన నిఘా వర్గాలు, పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ హైదరాబాద్‌లో వేళ్లూనిందా? కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందా? నగరంలో గత రెండు రోజుల్లో జరిగిన ఘటనలు ఈ సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి.
ఓ లెక్చరర్ తమ కాలేజీలో ఐసిస్ ఉగ్రవాద శిక్షణ జరుగుతోందని.. దాన్ని ప్రశ్నించినందుకు తనకు బెదిరింపులు వచ్చాయని ఫేస్‌బుక్‌లో పోస్టులు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కలకలం రేపింది. దీంతో నిఘా వర్గాలు, పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఆరోపణలను సదరు కాలేజీ యాజమాన్యం ఖండిస్తోంది.
ఫేస్‌బుక్‌లో వరుసగా 30 పోస్టులు
మెదక్ జిల్లా బండారుపల్లి మండలం తొగుటకు చెందిన ప్రవీణ్‌కుమార్ (28) కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఇక్కడి అక్బర్‌బాగ్ డివిజన్ పరిధిలోని నల్లగొండ చౌరస్తాలో ఉన్న ఎంఎస్ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన పేరు మీదే ఫేస్‌బుక్‌లో ఓ పేజీని నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 4.41 గంటల నుంచి 5.53 గంటల మధ్య ఆ పేజీలో దాదాపు 30 పోస్టులు పెట్టారు. తమ కాలేజీలో ఐసిస్ ఉగ్రవాద శిక్షణ జరుగుతోందని, అడ్డు చెప్పినందుకు ఉగ్రవాదులు, కళాశాల యాజమాన్యం తనను బెదిరించారని ఆ పోస్టుల్లో పేర్కొన్నారు. గతేడాది తనను హత్య చేయడానికి కూడా కుట్రపన్నారని పోస్ట్ చేశారు.
ఇది జరిగిన కొద్ది గంటల్లోనే.. బుధవారం రాత్రి వరంగల్ జిల్లా కేంద్రం లోని ఎంజీఎం సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్ మరణించారు. ప్రవీణ్ స్నేహితులుగా చెప్పుకొంటున్న కొందరు.. ఆయన ఫేస్‌బుక్ పోస్టులను, ప్రమాదంలో మరణించడాన్ని పేర్కొంటూ ‘అలర్ట్’ పేరిట ఓ సందేశాన్ని తయారుచేశారు. ప్రవీణ్ మరణంపై లోతుగా విచారణ జరగాలంటూ.. వాట్సప్, ట్వీటర్‌ల ద్వారా పలువురికి సందేశం పంపారు. ఇది మీడియాకు చేరడంతో కలకలం రేగింది.
ఆరా తీస్తున్న పోలీసులు..
ప్రవీణ్‌కుమార్ ఉదంతంపై పోలీసులతోపాటు నిఘా వర్గాలు, సైబర్ నిపుణులు రంగంలోకి దిగారు. ఆ కాలేజీ వ్యవహారాలు, ఫేస్‌బుక్ పోస్టుల్లోని అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ ఎక్కడి నుంచి ఆ పోస్టులు చేశారు, ప్రవీణ్ వ్యక్తిగత వివరాలేమిటనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక వరంగల్‌లో జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ మృతిపై ఆయన సోదరుడి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ఢీకొనడంతో మరణించినట్లు అందులో పేర్కొన్నారు. అయితే పోలీసులకు గురువారం సాయంత్రం సోషల్ మీడియా పోస్టుల సమాచారం అందడంతో ‘ఉగ్ర’కోణంలో దర్యా ప్తు ప్రారంభించారు. ప్రవీణ్‌ను ఎవరైనా కావాలని చంపారా అనేది తేల్చేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఆరోపణలను ఖండించిన కళాశాల
ప్రవీణ్‌కుమార్ ఫేస్‌బుక్ పోస్టులపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. అదంతా అవాస్తవమని కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మంగళవారం విధులకు హాజరైన ప్రవీణ్‌కుమార్ బుధవారం కళాశాలకు రాలేదని.. లీవ్ లెటర్ ఇవ్వలేదని, రాలేనని సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు. ప్రవీణ్ మరణానికి, కాలేజీకి సంబంధం లేదన్నారు. ఇక ప్రవీణ్ మరణానికి సంతాపం తెలుపుతూ కాలేజీ యాజమాన్యం గురువారం నోటీసు బోర్డులో సందేశాన్ని పెట్టింది. కాగా ప్రవీణ్‌కుమార్ ఉదంతంపై తమకు ఎటువంటి సమాచారం గానీ, ఫిర్యాదు గానీ అందలేదని చాదర్‌ఘాట్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్య వెల్లడించారు.