క్యాంపస్ బేజారు!
⇒ ఈ ఏడాది క్యాంపస్ నియామకాలకు కష్టకాలమే
⇒ కిందటేడాదితో పోలిస్తే 50 శాతం మేర తగ్గనున్న రిక్రూట్‌మెంట్లు!
⇒ నియామకాల్లో భారీగా కోత విధించుకున్న ఐటీ కంపెనీలు
⇒ ద్వితీయ, తృతీయ శ్రేణి కాలేజీల్లో రిక్రూట్‌మెంట్లు ఉండవన్న టీసీఎస్
⇒ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 25కుపైగా కాలేజీలకు సమాచారం
⇒ ఎంజీఐటీ, వర్ధమాన్, గోకరాజు, సీవీఆర్ కాలేజీలకు లేఖ
⇒ టాప్ కాలేజీలకే పరిమితంకానున్న ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో
⇒ అమెరికా ఎన్నికలు, బ్రెగ్జిట్ పరిణామాలే ప్రధాన కారణం
⇒ ఐటీ ఆర్డర్లు వస్తే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్
కాలేజీల్లో క్యాంపస్ నియామకాలకు బ్రేక్ పడింది! కిందటేడాది వరకు కాలేజీల ముందు క్యూ కట్టిన ఐటీ కంపెనీలన్నీ డీలా పడ్డాయి. అమెరికాలో రాజకీయ అనిశ్చితి.. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ విడిపోవడం.. వంటి పరిణామాల నేపథ్యంలో దేశీయ, విదేశీ ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు.. ద్వితీయ శ్రేణి కాలేజీల్లో ఈ ఏడాది నియామకాలు చేపట్టడం లేదు. ఇవేకాదు.. కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సైతం టాప్ కాలేజీల వరకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాయి. మొత్తమ్మీద ఈ ఏడాది 30 నుంచి 40 శాతం మేర క్యాంపస్ నియామకాలను తగ్గించుకుంటున్నట్లు కంపెనీలు సూచనప్రాయంగా వెల్లడిం చాయి.
ఐటీ పరిశ్రమ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం.. గతేడాదితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈసారి క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు 50 శాతం మేర తగ్గిపోనున్నాయి. ఈసారి క్యాంపస్ నియామకాలు చేపట్టబోమంటూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 ఇంజనీరింగ్ కాలేజీలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీ సెప్టెంబర్ మొదటివారంలోనే తెలియజేసింది. ఈ మేరకు కాలేజీ క్యాంపస్ ప్లేస్‌మెంట్ విభాగాలకు లేఖలు రాసింది. ఇలా లేఖలు అందుకున్న ప్రముఖ కాలేజీల్లో ఎంజీఐటీ, గోకరాజు రంగరాజు, వర్ధమాన్, సీవీఆర్ వంటివి ఉన్నాయి.
ఇన్ఫోసిస్‌కు బ్రెగ్జిట్ దెబ్బ
ఏటా దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 15 నుంచి 20 వేల మందికి క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్న ఇన్ఫోసిస్ ఈసారి ఆ సంఖ్యను 10 వేలకు తగ్గించుకున్నట్లు సమాచారం. బ్రెగ్జిట్‌తో భారీ ఆర్డర్ కోల్పోయిన ఇన్ఫోసిస్.. ఈ ఏడాది అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో చేపట్టబోయే రిక్రూట్‌మెంట్లను 20 శాతం మేర తగ్గించుకోనుంది. ఇక ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో రిక్రూట్‌మెంట్లు చేపట్టాలా వద్దా అన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ‘‘పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఎన్నికలు, రాజకీయ అనిశ్చితి కారణంగా ఐటీ ఆర్డర్లలో మాంద్యం కనిపిస్తోంది. ప్రతి పదేళ్లలో ఒకట్రెండు సార్లు ఇది సహజమే’’ అని బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ అధికారి ఒకరు వెల్లడించారు.
కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం తక్కువగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ఉంటాయంటూ ఈ సంస్థ కాలేజీలకు సమాచారం అందించింది. ‘‘మాకు ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం గతేడాది కంటే 20 నుంచి 25 శాతం తక్కువగా నియామకాలు ఉండొచ్చు. అమెరికా ఎన్నికలు, బ్రెగ్జిట్ వంటి పరిణామాలే ప్రస్తుత ఐటీ మాంద్యానికి కారణం’’ అని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్‌మెంట్ అధికారి ఎన్‌ఎల్‌ఎన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఏడాది నాటికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గడచిన రెండు దశాబ్దాల్లో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడినప్పుడు కూడా కంపెనీలు నియామకాలు భారీగా తగ్గించుకున్నాయని, మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తోందని ఆయన వివరించారు.
బ్యాంకుల ఎన్‌పీఏలూ కారణమే..
ఏటేటా నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)లు పెరిగిపోతుండడంతో బ్యాంకులు కూడా ఐటీకి సంబంధించిన కార్యకలాపాలను, వాటిపై పెట్టుబడులను గణనీయంగా తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ కంపెనీలకు బ్యాంకుల నుంచి ఆ మేరకు ఆర్డర్లు తగ్గిపోతున్నాయి. ఐటీ కంపెనీలు రిక్రూట్‌మెంట్లు తగ్గించుకోవడానికి ఇది కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
5 వేల మందికి కూడా కష్టమే
గతేడాది తెలంగాణ, ఏపీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాల ద్వారా 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. అయితే ఈ ఏడాది నియామకాలు సగానికంటే తగ్గుతాయని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీలు ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది నియామకాలు చేపట్టకపోవడమే ఇందుకు కారణం. గతేడాది హైదరాబాద్‌లోని 12 కాలేజీల నుంచి 2,300 మందికి ఉద్యోగాలిచ్చిన యాక్సెంచర్ ఈసారి ఆ సంఖ్యను 1,300కు పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. రాజధానితోపాటు రంగారెడ్డి జిల్లాలో కాలేజీల నుంచి 1,900 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కాగ్నిజెంట్ ఈసారి 750కు పరిమితం చేసుకుంటోంది. టీసీఎస్ అయితే భారీ ఎత్తున కోత విధించుకుంది. అమెరికాలో రాజకీయ సుస్థిరత ఏర్పడి ఆర్డర్లు భారీగా ద్వితీయార్థంలో నియామకాలు చేపడుతామని టీసీఎస్ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
కాలేజీ యాజమాన్యాల్లో గుబులు
ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు లేకుంటే ఆ ప్రభావం వచ్చే ఏడాది అడ్మిషన్లపై ఉంటుందని ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలు ఆందోళన చెందుతున్నాయి. గడచిన కొద్ది సంవత్సరాలుగా క్యాంపస్ నియామకాలతో అడ్మిషన్లకు డిమాండ్ పెంచుకున్న ఈ కాలేజీలు ఈ ఏడాది రిక్రూట్‌మెంట్లు లేవని తెలిసి కంగుతిన్నాయి. కొన్ని కాలేజీలు అయితే చిన్నా చితకా కంపెనీలను కలిసి క్యాంపస్ నియామకాలు చేపట్టాలని కోరుతున్నాయి. కనీసం పది నుంచి 20 శాతం విద్యార్థులకు ఉద్యోగాలు లభించినా పర్వాలేదన్నట్లు ఈ యాజమాన్యాలు ఉన్నాయి.