ఐటీఎస్‌కు పోటాపోటీ! | its to the competitive! | Sakshi
Sakshi News home page

ఐటీఎస్‌కు పోటాపోటీ!

Published Mon, Nov 9 2015 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

ఐటీఎస్‌కు పోటాపోటీ!

ఐటీఎస్‌కు పోటాపోటీ!

రంగంలో ఆరు సంస్థలు
టెక్నికల్ స్క్రూట్నీపై హెచ్‌ఎండీఏ కసరత్తు  
జనవరిలో  ప్రాజెక్టు పనులకు శ్రీకారం
గ్రేటర్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్

 
సిటీబ్యూరో:  రాజధాని హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతోన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రూ.160 కోట్లతో హెచ్‌ఎండీఏ తలపెట్టిన ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టం (ఐటీఎస్) ప్రాజెక్టును దక్కించుకొనేందుకు ఆరు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐటీఎస్‌కు సంబంధించిన టెండర్స్‌ను ఓపెన్ చేసిన అధికారులు మొత్తం ఆరు బిడ్స్ దాఖలైనట్లు గుర్తించారు. వీటిలో సావ్‌రానిక్ (టర్కీ),  ఏఆర్‌ఎస్ అండ్ పి అండ్ టి (నెదర్‌ల్యాండ్స్), కొరియా ఎక్స్‌ప్రెస్ వే కార్పొరేషన్ (కేఎక్స్‌సి- కొరియా)లు విదేశీ సంస్థలు కాగా, ఎల్‌అండ్‌టి, బీఈఎల్, ఎఫ్‌కాన్‌లు స్వదేశీ సంస్థలున్నాయి.

వీటికి సంబంధించి త్వరలో టెక్నికల్ స్క్రూట్నీ పూర్తిచేసి అనంతరం  టెక్నికల్ బిడ్స్‌ను ఓపెన్ చేస్తామని ఓఆర్‌ఆర్ సీజీఎం ఆనంద్‌మోహన్ తెలిపారు. అర్హత గల సంస్థను ఖరారు చేసే ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేసి వచ్చే జనవరిలో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తిచేయాలని ల క్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ప్రాజెక్టును దక్కించుకొన్న సంస్థ నిర్మాణంతో పాటు ఐదేళ్లు నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టాల్సి ఉంటుంది.

సమగ్ర సమాచారం
నగరంలోని ప్రధాన రహదారుల్లో ప్రయాణించే వాహనదారులకు  సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని హెచ్‌ఎండీఏ చెబుతోంది.  ప్రధానంగా ప్రయాణ సమయం ఆదా, ఖర్చు తగ్గించడం, ప్రమాదాల నివారణ, వాహన కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయమైన ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.  ఐటీఎస్ వల్ల నగర రోడ్లపై ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎఫ్.ఎం రేడియో ద్వారా, వేరియబుల్ సైన్ బోర్డుల ద్వారా ముందుగానే ప్రజ లకు తెలిపేందుకు వీలవుతుందంటున్నారు.

ప్రధాన మార్గాల్లోని తాగునీటి పైపులైన్, డ్రైనేజీ పనులు అత్యవసరంగా చేపట్టాల్సి వచ్చినప్పుడు తవ్వకాలు జరపడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురై ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ముందగానే పసిగట్టి ఆ మార్గంలో వచ్చే వాహనదారులకు చేరవేయడం ద్వారా వారు మరో ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లేందుకు వీలవుతుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ట్రాఫిక్‌లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడం వల్ల పెట్రోలు వృథా, అలాగే వాహన కాలుష్యం వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నిరోధించవచ్చు. వర్షాకాలంలో రోడ్డుపై వరదనీరు నిలిచిపోయిన విషయాన్ని ముందుగానే వాహనచోదకులకు చేరవేయడం వల్ల  ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చు.

ఈ ఆధునిక వ్యవస్థ కోసం నాన్‌రామ్‌గూడ, ఘట్‌కేసర్‌లలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి కేబుల్ నెట్‌వర్క్, వైర్‌లెస్ నెట్ వర్క్ ద్వారా దీనికి అనుసంధానం చేస్తారు. సింక్రనైజ్డ్ సిగ్నలింగ్ సిస్టం, వేరియబుల్ మెసేజ్ సైన్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఇన్ఫర్మేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వీటి ద్వారా నగర రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగడంతో పాటు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందంటున్నారు. సిగ్నల్స్ వద్ద వాహనాలు ఎక్కువ సేపు నిలపకుండా వ్యవస్థను అందుబాటులోకి తెస్తే వాహన కాలుష్యం కూడా గణనీయంగా తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు.
 
3 దశల్లో నిర్మాణం...

అత్యాధునిక హంగులతో కూడిన ఇంటలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టం (ఐటీఎస్) ప్రాజెక్టును 3 దశల్లో నిర్మించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1175 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. తొలి దశలో రూ.160 కోట్లతో చేపట్టే ఐటీఎస్‌కు జైకా ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే రెండో దశను రూ.425 కోట్లు, మూడో దశను రూ.600 కోట్లతో తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement