‘లింక్’ కుదర్లే
రేడియల్ రోడ్లు... ట్రాఫిక్ సమస్యకు హెచ్‌ఎండీఏ ఎంచుకున్న పరిష్కార ‘మార్గం’. ఇన్నర్ రింగ్ రోడ్డుకు...ఔటర్ రింగ్ రోడ్డుకు ‘లింక్’ పెట్టడం ద్వారా రాజధాని నగరంలో ప్రయాణాన్ని ఆహ్లాదంగా మార్చాలనే ప్రయత్నం. నిత్యం పెరుగుతున్న వాహనాలు... అంతే స్థాయిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు... పొరపాటున ఒక్క మోటార్ సైకిల్ ఆగినా రోడ్లపై వాహనాల బారులు... ఇవి నగర జీవికి నిత్యానుభవాలు. ‘లింక్’ రహదారులతో ఈ కష్టాలు తప్పించాలనేది హెచ్‌ఎండీఏ యత్నం.కాస్తంత దృష్టి పెడితే సిటీ జనానికి ఎంతో మేలు చేసే ఈ రహదారులపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. నిధులు విదల్చనంటోంది.
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ తలపెట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్‌లో చుక్కెదురైంది. రేడియల్ రోడ్ల కోసం హెచ్‌ఎండీఏ ప్రత్యేకంగా రూ.300 కోట్లు కావాలని ప్రతిపాదించగా... బడ్జెట్‌లో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో వీటి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యే నాటికి నగరంలో మొత్తం 33 రేడియల్ రోడ్లు నిర్మించాలన్నది లక్ష్యం.
వీటిలో ఇప్పటికే ఏడింటిని (53.72 కి.మీ. మేర) హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీలు సంయుక్తంగా నిర్మించగా...జాతీయ రహదారుల మీదుగా ఉన్న మరో ఐదింటిని (83.35 కి.మీ.) నేషనల్ హైవే అథార్టీ నిర్మించింది. జీడిమెట్ల, ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్, నాగోల్, షేక్‌పేట్, కుషాయిగూడ ప్రాంతాల్లో మరో 5 రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని జైకా నిధులతో గత ఏడాది హెచ్‌ఎండీఏ చేపట్టింది. మిగిలిన 16 రేడియల్ రోడ్లనూ పూర్తి చేసి ... నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్‌ఎండీఏ భావించింది. గత ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా అవి ఫైళ్లకే పరిమితమయ్యాయి.
కొత్త ప్రభుత్వమూ అదే దారిలో వెళ్లడం అధికారులను విస్మయపరిచింది. పెండింగ్‌లో ఉన్న 16 రేడియల్ రోడ్లకు సంబంధించి ఇంతవరకు భూ సేకరణ జరుగలేదు. వీటిలో 6 రహదారులకు అసలు సర్వే కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తొలి దశలో కీలకమైన 10 రేడియల్ రోడ్లకుసర్వే చేయాలని నిర్ణయించినా... కేవలం నాలిగింటితో సరిపెట్టేశారు. సర్వే పూర్తి కాకపోవడంతో భూసేకరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో రవాణా గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం రాజధాని నగరంలో రేడియల్ రోడ్ల నిర్మాణంపై దృషి ్టపెట్టకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ట్రాఫిక్ నరకం తప్పదా..?
రాజధాని చుట్టూ 158 కి.మీ. దూరం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుకు నగరం నుంచి అనుసంధానం లేకపోతే ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రోరైల్ వంటివి ప్రవేశపెట్టినా ప్రయోజనం ఉండదంటున్నారు. కోర్ ఏరియాలో రోడ్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య నిత్యం నరకం చూపిస్తోంది.
ప్రధాన ప్రాంతాలను ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు కలిపితే...50 శాతం ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని గతంలో హెచ్‌ఎండీఏ సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితి తల్లకిందులవడంతో రేడియల్ రోడ్లపై చేతులెత్తేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడమో... లేదా జీహెచ్‌ఎంసీ, ఆర్ అండ్ బి శాఖల నుంచి నిధులు మళ్లించడమో చేస్తే తప్ప అవి సాకార మయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
గతంలో పాత భూసేకరణ చట్టం ప్రకారం కీలకమైన 16 రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.1470 కోట్లు వరకు ఖర్చవుతుందని అప్పటి ఉమ్మడి ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి రావడంతో ఈ వ్యయం మరింత పెరగనుంది. మిగిలిపోయిన 16 రేడియల్ రోడ్ల అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందనేది ఆసక్తికరంగా మారింది.