
పుల్ జోష్ దిల్ ఖుష్
ఆశలు ఫలించాయి. నిరీక్షణకు తెరపడింది. అన్ని గుండెచప్పుళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. గుండె గుండెనా గూడుకట్టుకున్న అభిమానం ఒక్కసారిగా ఆనందమై ఎగసింది. ఉత్సాహం మిన్నంటింది. జగన్నినాదం హోరెత్తింది. బాణసంచా మెరుపులు.. మిఠాయిల పంపకాలు.. పరస్పర అభినందనలు.. ఎటుచూసినా వేడుకే.. పండగొచ్చినంత సంబరం.. సోమవారం సాయంత్రం జగన్‌కు బెయిల్ మంజూరు కాగానే నగరం నలుమూలలా చోటుచేసుకొన్న జనోత్సాహమిది.
సాక్షి, హైదరాబాద్ : జయహో జగన్.. సత్యమేవజయతే.. వైఎస్సార్ అమర్ రహే.. అన్న నినాదాలతో నగరం హోరెత్తిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ కోసం సోమవారం ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేసిన అభిమానులు.. సాయంత్రం కోర్టు ప్రకటనతో సంబరాలు జరుపుకొన్నారు. అభిమాన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎవరికీ వారే తమ సన్నిహితులతో ఆనందాన్ని పంచుకోగా, పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికారులు, ఉద్యోగులు మిఠాయిలు పంచుకుని హర్షం వెలిబుచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నగరమంతటా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినదించారు. బెయిల్ ప్రకటన వెలువడగానే పార్టీ సీఈసీ సభ్యులు కె.శివకుమార్, నగర పార్టీ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ కోర్టు వెలుపల విజయోత్సవం నిర్వహించగా, యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో చంచల్‌గూడ జైలు సమీపంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఖైరతాబాద్‌లో పి.విజయారెడ్డి, రాజేంద్రనగర్‌లో సీఈసీ సభ్యులు బి.జనార్దన్‌రెడ్డి, కూకట్‌పల్లిలో వడ్డేపల్లి నర్సింగ్‌రావు, సరూర్‌నగర్‌లో దేపా భాస్కర్‌రెడ్డి, కంటోన్మెంట్‌లో జంపన ప్రతాప్, వెంకట్రావు, కుత్బుల్లాపూర్‌లో సురేష్‌రెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, జూబ్లీహిల్స్‌లో కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఉప్పల్‌లో ధన్‌పాల్‌రెడ్డి, ముషీరాబాద్‌లో పీవీ అశోక్‌కుమార్, శ్వేతా వెంకట్రామిరెడ్డి, శేరిలింగంపల్లిలో ముక్కా రూపానందరెడ్డి, మల్కాజిగిరిలో సూర్యనారాయణరెడ్డి, సుమతీమోహన్, సనత్‌నగర్‌లో వెల్లాల రాంమోహన్‌ల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి ప్రధాన కూడళ్లలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు.
పోలీసుల అత్యుత్సాహం
జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ లభిస్తోందన్న విషయాన్ని తెలుసుకుని నాంపల్లి కోర్టుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాదు నియోజకవర్గం ఇన్‌చార్జి మతీన్ ముజద్దదీ, వికారాబాదు నియోజకవర్గం ఇన్‌చార్జి సంజీవరావు ఆధ్వర్యంలో చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దీనికి నిరసనగా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నాంపల్లి కోర్టు నుంచి మే రోజ్ కేఫ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అరెస్టయిన మతీన్ ముజద్దదీ, సంజీవరావులు నాంపల్లి పోలీస్ స్టేషన్‌లోనే ధర్నా చేశారు. సీబీఐ కోర్టులో జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో అరెస్టు చేసిన నాయకులను పోలీసులు విడుదల చేశారు. జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ లభిందన్న సంతోషంతో నాంపల్లి పోలీస్ స్టేషన్ ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. టపాకాయలు పేల్చారు.
జీహెచ్‌ఎంసీలో ఆనందం
సాక్షి, సిటీబ్యూరో : జగన్‌కు బెయిల్ లభించిందన్న విషయం తెలియగానే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో పలువురు సభ్యులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో మేయర్ మాజిద్ హుస్సేన్ సభకు టీ బ్రేక్ ఇచ్చారు. ఆ సమయంలో విషయం తెలిసిన వైఎస్సార్‌సీపీ సభ్యులు సురేష్‌రెడ్డి (సూర్యనారాయణరెడ్డి), సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి తదితరులు సభ్యులకు స్వీట్లు పంచారు. మేయర్ మాజిద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్‌హుస్సేన్, ఎమ్మెల్సీ జాఫ్రీ, కార్పొరేటర్లు తదితరులకు స్వీట్లు ఇచ్చి ఆనందం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా పలువురు సభ్యులు జగన్ విడుదలపై ఉత్సాహం కనబరిచారు. జీహెచ్‌ంఎసీ ఉద్యోగులు సైతం ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు.
యోధుడిలా బయటకు వస్తున్నారు
టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రల ఫలితంగానే వైఎస్‌జగన్ జైలుపాలయ్యారు. 16 నెలలుగా పోరాడుతూ పలు రాజకీయ ఒత్తిడులు ఎదుర్కొంటూ ధీరుడిలా నిలిచారు. ఎవరెన్ని అడ్డంకులు కలిగించినా చీకట్లను చీల్చుకు వచ్చిన సూరీడులా బెయిల్‌పై విడుదలై బయటకు వస్తున్నారు.
- దేప భాస్కర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సమన్వయ కర్త
ప్రజాభిమానం గెలిచింది
మహనేత వైఎస్‌ఆర్ మరణానంతరం ప్రజలకిచ్చిన మాట కోసం జగన్ ఇన్ని రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయినా మడ మ తిప్పని వ్యక్తిగా బాధలు భరిస్తూ కుటుంబానికి 16 నెలలుగా దూరంగా ఉన్నారు. ప్రజల మధ్య ఉన్న నాయకుడిని అందరికీ దూరం చేశారు. ప్రజాభిమానం ముందు జైలు గోడలూ అడ్డుకావని కుట్రదారులకు అర్థం కావాలి. ఎదేమైనా ప్రజాభిమానమే గెలిచింది.
- లింగాల హరిగౌడ్, మలక్‌పేట నియోజకవర్గ సమన్వయకర్త
టీడీపీకి చెంపపెట్టు
రాష్ట్ర ప్రజల కల నెరవేరింది. జగన్‌కు బెయిల్ రాకుండా మొదట్నుంచీ చివరివరకు టీడీపీ ప్రయత్నించినా న్యాయమే గెలిచింది. తెలంగాణాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుంది. మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగేందుకు జగన్ నేతృత్వంలోని వైసీపీ పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో కుల, మత, ప్రాంతాలకతీతంగా ఆయన బెయిల్‌ను ప్రజలు స్వాగతిస్తున్నారు.
- బి.జనార్దన్‌రెడ్డి, సీఈసీ సభ్యులు
ఆరోపణలు అబద్ధమని తేలింది
వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు నిజం కాదని తేలింది. దేవుడు జగన్ కుటుంబానికి న్యాయం చేశాడు. ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు.
- కాలేరు వెంకటేష్, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, అంబర్‌పేట నియోజకవర్గం
దసరా ఇప్పుడే మొదలైంది
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలలు గన్న స్వర్ణయుగాన్ని సాకారం చేయాలంటే జగన్‌కే సాధ్యం. అక్రమ నిర్భంధం నుంచి జగన్ విడుదల అవుతున్నందుకు యావత్ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దసరా వేడుకలు ఇప్పుడే మొదలయ్యాయా అన్నట్లు సందడి నెలకొంది.
- పుత్తా ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు