అటవీశాఖలో ఖాళీల భర్తీ: మంత్రి రామన్న
హైదరాబాద్: అటవీ శాఖలోని ఉద్యోగాలన్నీ త్వరలో భర్తీ చేస్తామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఇక్కడ నెహ్రూ జులాజికల్ పార్కులో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి మాట్లాడారు. రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. అటవీ సంరక్షణకు చట్టాలను బలోపేతం చేసి బెయిలబుల్ కేసులను నాన్ బెయిలబుల్‌గా మారుస్తున్నామని చెప్పారు.
అటవీ సంపద, వన్యప్రాణులను సంరక్షించే క్రమంలో స్మగ్లర్ల చేతిలో 22 మంది అటవీ అధికారులు అమరులయ్యాయని అన్నారు. స్మగ్లర్ల బెడదను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని చెప్పారు. అటవీ సంపదను మరింత విస్తరించడంలో భాగంగా ప్రభుత్వం హరితహారాన్ని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా 29.50 కోట్ల మొక్కలను నాటినట్లు వివరించారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 10కు బదులు ఈ నెల 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం మంత్రి రామన్నను రాష్ట్ర జూనియర్ ఫారెస్ట్ అధికారులు, ఆలిండియా ఫారెస్ట్ అసోసియేషన్ అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు బి.ఆర్.మీనా, పి.కె.ఝా, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.