ఖరీఫ్ సాగు.. 1.08 కోట్ల ఎకరాలు
ఖరీఫ్ సాగు.. 1.08 కోట్ల ఎకరాలు
Published Wed, Jun 14 2017 12:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
- 2017–18 కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయశాఖ లక్ష్యం
- గతేడాది కంటే రెండున్నర లక్షల ఎకరాలు పెరగనున్న వరి
- ఖరీఫ్, రబీ విత్తన సరఫరా లక్ష్యం 10 లక్షల క్వింటాళ్లు
- ఈ ఏడాది భారీగా ఆహారాధాన్యాల ఉత్పత్తి: పోచారం
సాక్షి, హైదరాబాద్: తాజా ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగును వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఖరీఫ్‌లో 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈ సారి మరో ఆరు లక్షల ఎకరాలు అదనంగా సాగు చేయాలని, రబీ పంటల సాగును కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీలకు కలిపి 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 2017–18 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం విడుదల చేశారు. గత ఖరీఫ్‌లో వరి 22.15 లక్షల ఎకరాల్లో సాగుచేయగా.. ఈసారి రెండున్నర లక్షల ఎకరాలు అదనంగా 24.65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. ఇక గత రబీ సాగు విస్తీర్ణం 30 లక్షల ఎకరాలు కాగా.. వచ్చే రబీలో 37.62 లక్షలకు పెంచనున్నారు.
పప్పులు, మొక్కజొన్న లక్ష్యం తగ్గింపు
2017–18 వ్యవసాయ సం వత్సరంలో 90.89 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2016–17లో వరి ఉత్పత్తి లక్ష్యం 55.43 లక్షల టన్నులుకాగా.. 2017–18లో 58.11 లక్షల టన్నులకు పెంచింది. అయితే పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం తగ్గింది. 2016–17లో పప్పు ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 5.78 లక్షల టన్నులుండగా.. ఈసారి 4.69 లక్షల టన్నులకు పరిమితం కానుంది. ఇందులో 2016–17లో కంది లక్ష్యం 2.24 లక్షల టన్నులుకాగా 2.03 లక్షల టన్నులకు.. మొక్కజొన్న లక్ష్యం 31.24 లక్షల టన్నుల నుంచి 27.01 లక్షల టన్నులకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మిరప లక్ష్యం 2.69 లక్షల టన్నులు, పత్తి 32.28 లక్షల టన్నులుగా నిర్ధారించారు.
అవసరమైన స్థాయిలో విత్తనాలు
ఈ ఖరీఫ్‌లో 6 లక్షల క్వింటాళ్లు, రబీలో 4 లక్షల క్వింటాళ్లు.. మొత్తంగా 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పేర్కొంది. 2016–17లో ఈ రెండు సీజన్లకు కలిపి సరఫరా చేసింది 7.5 లక్షల క్వింటాళ్లు మాత్రమే. ఇక ఈ సారి ఎరువుల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించారు. 2016–17 ఖరీఫ్‌లో 17.30 లక్షల టన్నుల ఎరువుల సరఫరా లక్ష్యంగా పెట్టుకోగా.. 2017–18 ఖరీఫ్‌లో 16.20 లక్షల టన్నులే సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇక రబీ ఎరువుల సరఫరా లక్ష్యాన్ని 12.50 లక్షల టన్నుల నుంచి 12 లక్షల టన్నులకు తగ్గించారు.
90.89 లక్షల టన్నుల ఆహారధాన్యాలు
ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. ఖరీఫ్, రబీల్లో కలిపి 90.89 లక్షల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసినట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,755 కోట్లు కేటాయించామని.. విత్తన సబ్సిడీ కోసం రూ.139 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం రూ.337 కోట్లు ఇచ్చామని చెప్పారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులపై ప్రీమియం భారం తగ్గించేందుకు ఈ ఏడాది రూ. 224 కోట్లు.. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ కోసం రూ.343 కోట్లు కేటాయించామన్నారు. 10 విత్తన క్షేత్రాల పరిధిలో 407 హెక్టార్లలో వరి, కందులు, శనగ, పెసర, మినుములు, వేరుశెనగ తదితర పంటలకు సంబంధించి 17,464 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనం పండించేలా ప్రణాళిక రూపొందిం చామన్నారు. ఇక కౌలు రైతుల పేర్లను సమగ్ర రైతు సర్వేలో నమోదు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
Advertisement
Advertisement