హైదరాబాద్‌లో పతంగుల పండుగ | kites fest in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పతంగుల పండుగ

Published Wed, Jan 13 2016 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

హైదరాబాద్‌లో పతంగుల పండుగ

హైదరాబాద్‌లో పతంగుల పండుగ

‘రంగ్ దే ఆస్మాన్’  నినాదంతో వేడుకలు
జనవరి 14, 15న ఆగాఖాన్ అకాడమీలో నిర్వహణ
గుజరాత్ తరహాలో  నిర్వహించాలని {పభుత్వం యోచన
దేశ విదేశాల నుంచి తరలి రానున్న ఔత్సాహికులు
వేడుకల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు

 సాక్షి, హైదరాబాద్: ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా పతంగుల వరస.. ఒకే దారానికి దాదాపు 250 భారీ గాలిపటాలు.. ఇంద్రధనుస్సు ఆవిష్కృతమైందా అన్న అనుభూతి.. పక్షులన్నీ వలస వెళ్తున్నాయా అనే భ్రమ.. రంగురంగుల లైట్లతో ఆకాశంలో మిరిమిట్లు.. ఒకటేమిటి మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే ఎన్నో విశేషాలు ఆ ఉత్సవాల సొంతం. ఇప్పటి వరకు ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యాటకులను కట్టిపడేసిన ఈ పతంగుల ఉత్సవానికి రాష్ర్ట రాజధాని నగరం ముస్తాబైంది. నగర శివార్లలోని ఆగాఖాన్ ఫౌండేషన్ అకాడమీలోని వంద ఎకరాల ప్రాంగణంలో ఈ నెల 14, 15 తేదీల్లో అంగరంగ వైభవంగా ‘రంగ్ దే ఆస్మాన్’ నినాదంతో ఈ వేడుకలు జరగనున్నాయి.

 గుజరాత్ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో..
 ఏటా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ ఎత్తున పతంగుల ఉత్సవాలు జరుగుతాయి. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్న ఈ ఉత్సవాలు ఆ రాష్ర్ట పర్యాటకానికి ఎంతో బలాన్నిస్తున్నాయి. గుజరాత్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పతంగుల పండుగను నిర్వహించాలని నిర్ణయించింది. పతంగులకు హైదరాబాద్‌లో కుతుబ్‌షాహీల కాలం నుంచే ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఘనంగా ఈ పండుగ నిర్వహించాలని భావిస్తోంది. ఇండోనేసియా, వియత్నాం, అమెరికా, థాయ్‌లాండ్, ఉక్రెయిన్, మలేసియా తదితర దేశాలకు చెందిన 32 మంది పతంగులు ఎగురవేసే ప్రముఖులు సహా మొత్తం 299 మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొంటారు.

 ఐదేళ్లలో గుజరాత్‌ను అధిగమిస్తాం: పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం
 పతంగుల పండగకు హైదరాబాద్‌ను బ్రాండ్‌గా మారుస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ఐదేళ్లలో గుజరాత్ ఖ్యాతిని అధిగమించడంతో పాటు పదేళ్లలో ప్రపంచంలోనే తొలిస్థానం పొందేందుకు కృషి చేస్తామని మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ఈ వేడుకలకు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఉత్సవాలు నిర్వహించేందుకు సహకరిస్తున్న ఆగాఖాన్ ఫౌండేషన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఈ వేడుకలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా జడ్ చోంగ్తు, పర్యాటక శాఖ కమిషనర్ సునీతా భగవత్, ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధి ఫిషర్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ హరికృష్ణ, నైనా జైస్వాల్, ఆర్కిటెక్చర్ డిజైన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 
 
 తెలంగాణ వంటల ఘుమఘుమలు...
 పతంగుల పండుగలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించనున్నారు. ఇందులో తెలంగాణ వంటలను విదేశీయులకు రుచి చూపించనున్నారు. కోలాటం, ఒగ్గు డోలు, చిందు భాగవతం, యక్షగానం, పేరిణీ, గుస్సాడి నృత్యం తదితర సంప్రదాయ కళారూపాల ప్రదర్శన ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఐదుగురు ప్రముఖ సితార్ విద్వాంసుల ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement