
'కోదండరామ్ ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గుచేటు'
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం సిగ్గుచేటని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. చివరకు తెలంగాణ ఉద్యమ కారులపై కూడా నిఘా పెట్టడడంతో ప్రభుత్వ నిజరూపం బట్టబయలైందన్నారు. ఆయన మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారం ప్రభుత్వ దిగజారుడు తనాన్ని రుజువు చేస్తోందని వ్యాఖ్యానించారు.
తమకు నచ్చని వ్యక్తులపై నిఘా పెట్టడం తెలంగాణ ప్రభుత్వానికి ఓ అలవాటుగా మారిందని ఆరోపించారు. వ్యక్తి స్వేచ్చను హరించే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ పోషించిన కీలక పాత్ర గురించి అందరికీ తెలుసనీ, అప్పటి కంటే ఇప్పుడే జేఏసీ అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం జేఏసీ పనిచేయాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి ఏమైందో అంతుబట్టడం లేదని రావల వ్యాఖ్యానించారు.