కోఠి ఈఎన్‌టీకి 50 ఏళ్లు
కోఠి(హైదరాబాద్): పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా సేవలందిస్తున్న కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి ఆదివారంనాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. మెహిదీపట్నంలోని సరోజని కంటి ఆస్పత్రిలో ఓ యూనిట్‌గా ఉన్న ఈఎన్‌టీ 1966లో కోఠిలోని నవాబ్ ప్రతాప్‌గిరి భవనంలోకి మారి పూర్తిస్థాయి ఆస్పత్రిగా సేవలు ప్రారంభించింది. మొదట బయట రోగులనే చూసేవారు. కాలక్రమంలో 125 పడకలతో ఇన్‌పేషంట్ విభాగాన్ని ఏర్పాటు చేయగా అత్యాధునిక వసతులను సమకూర్చుకుని దేశంలోనే పేరున్న ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో ఒకటిగా నిలిచింది.
ఓపీ విభాగంలో ప్రతిరోజూ 1200మందికిపైగా, ఇన్‌పేషెంట్ విభాగంలో 200మందికి పైగా వైద్య సేవలు పొందుతున్నారు. చిన్నారుల్లో వినికిడి లోపాన్ని సరిచేసేందుకు రూ.6 లక్షల ఖర్చుతో కూడుకున్న కాక్లియార్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటివరకు 250మందికి ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశారు. శస్త్రచికిత్స జరిగిన చిన్నారులకు ఆస్పత్రిలోనే ఆరు నెలలపాటు ప్రత్యేక స్పీచ్ థెరపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తుండడం విశేషం.