ENT Hospital
-
Black Fungus: రోగికి అడ్మిషన్ నిరాకరించిన ఈఎన్టీ ఆస్పత్రి
సుల్తాన్‌బజార్: వరంగల్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ రోగి ‘బ్లాక్ ఫంగస్’బారిన పడింది. దీంతో హైదరాబాద్ లోని ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే రోగికి కళ్లు పోయి, ముక్కు నుంచి రక్తస్రావం అవుతోంది. ఈ దశలో చికిత్స చేయకుండా ఆర్టీపీసీఆర్ రిపోర్టు లేదన్న కారణంగా ఆస్పత్రిలో అడ్మిషన్ నిరాకరించారు. వరంగల్‌కు చెందిన మల్లమ్మ(65)కు గత 20 రోజుల క్రితం కోవిడ్ సోకగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమెకు బ్లాక్ ఫంగస్ సోకడంతో వైద్యులు హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆసుపత్రికి పంపించారు. సీటీస్కాన్, ఎంఆర్ఐ తదితర రిపోర్ట్‌లతో ఆమె మనవడు శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ లేదని వైద్యులు అడ్మిషన్ నిరాకరించారు. తన అవ్వకు కోవిడ్ తగ్గిందని ఆమె మనవడు చెప్పినా ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు ఒప్పుకోలేదు. దీంతో మల్లమ్మ కటిక నేలపైనే 19 గంటల పాటు ఆసుపత్రి క్యాజువాలిటీ ముందు వైద్యం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అవ్వ పరిస్థితి విషమంగా మారిందని.. దయచేసి చేర్చుకోండంటూ ఆమె మనవడు ఎంత బతిమాలినా వినలేదు. చివరకు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న బ్లాక్ ఫంగస్ రోగులకు ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఇబ్బందిగా మారింది. కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఉదయం వేళలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నా సకాలంలో రిపోర్ట్లు రావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: Black Fungus: మందులు తక్కువ.. బాధితులెక్కువ..! -
Photo Feature: ఆపత్కాలం.. చేయాలి సాయం!
ఆపత్కాలంలో ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ సాటివారికి సహాయపడుతున్నారు. కరోనా బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు సిద్దిపేటకు చెందిన శశికర్నంద అనే యువకుడు బైక్ అంబులెన్స్ నడిపిస్తున్నాడు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్యం అందించలేమని కింగ్‌కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రి సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోనే బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ‘టౌటే’ తుపాను ధాటికి అరేబియా సముద్రంలో మునిగిపోయిన నౌక నుంచి పలువురిని కాపాడటంతో ‘బతుకు జీవుడా’ అంటూ వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఆపరేషన్లకు బ్రేక్!
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రెండు నెలలుగా ఈఎన్టీ వైద్య విభాగంలో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఆపరేషన్ థియేటర్‌ను ఆధునీకరించేందుకు ఆపరేషన్లు నిలిపివేశారు. నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తూ ఉండటంతో ఆపరేషన్ల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఆరుగురికి.. ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లో ప్రతిరోజూ ఆరుగురికి పైగానే ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రతినెలా 80కి పైగా ఆపరేషన్లు చేస్తూ ఉండటంతో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఆస్పత్రికి నెలకు రూ.12లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. రెండు నెలలుగా ఆపరేషన్లు నిలిచిపోవడంతో ఆస్పత్రికి పథకం ద్వారా వచ్చే ఆదాయం తగ్గడంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బందికి వచ్చే పారితోషికాలు సైతం తగ్గిపోయాయి. అత్యవసరమైన స్థితిలో ఆస్పత్రికి వచ్చే ఈఎన్టీ బాధితులకు మాత్రమే వారం ఒక్కరికి లేదా ఇద్దరికి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్లు చేస్తున్నారు. సాధారణ రోగులకు తెల్లరేషన్‌కార్డు ఉన్నా ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా అన్ని రకాల ఆపరేష్లన్లు చేయకపోవటంతో జీజీహెచ్ చుట్టూ రోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆస్పత్రి అధికారులు సైతం హెచ్‌డీఎస్ మీటింగ్‌లో చర్చించి అత్యాధునిక వైద్య పరికరాల ను ఈఎన్టీ వైద్య విభాగానికి కేటాయించారు. అయితే ఆధునిక వైద్య సేవలను పేద రోగులకు చేరువ చేసేందుకు ఆపరేషన్ థియేటర్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. ఆర్ధోపెడిక్ది అదే పరిస్థితి.. ఆర్ధోపెడిక్ వైద్య విభాగం ఆపరేషన్ థియేటర్ సైతం నిర్మాణం జరుగుతుంది. రెండు నెలలుగా ఆపరేషన్ థియేటర్ నిర్మాణం జరుగుతూ ఉండటంతో అత్యవసర కేసులకు, రోడ్డు ప్రమాద బాధితులకు మాత్రమే ఆర్ధోపెడిక్ వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నారు. సాధారణ సమస్యలతో వచ్చే వారు, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్నవారికి ఆపరేషన్ థియేటర్స్ కొరత వల్ల ఆపరేషన్లు చేయడంలేదు. ప్రభుత్వం 2015 లో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందటం తో ఆస్పత్రి అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయిం చింది. నిధులను సకాలంలో వినియోగించలేదనే ఆరోపణలు ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికా రులపై వచ్చాయి. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సైతం జీజీహెచ్‌కు విడుదల చేసిన నిధులు వినియోగంలో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి మెమో కూడా జారీచేశారు. ఆస్పత్రి అధికారులు సకాలంలో ఆపరేషన్ థియేటర్ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని వైద్య సిబ్బంది, రోగులు కోరుతున్నారు. వారంలో పనులు పూర్తి చేస్తాం ఎన్ఏబీహెచ్ నిధులతో జీజీహెచ్‌లో ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నాం. మరో వారం రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.4 కోట్లతో నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. డిసెంబర్ కల్లా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులోకి వస్తాయి. –యడ్లపాటి అశోక్‌కుమార్,ఈఈ, ఏపీఎంఎస్ఐడీసీ, గుంటూరు -
శ్రావణిలో ‘కాక్లియర్ ఇంప్లాంట్’ సర్జరీ
కాకినాడ : పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడుతున్న చిన్నారులకు అత్యాధునిక శస్త్రచికిత్సా విధానం ఇప్పుడు కాకినాడ శ్రావణి ఈఎన్టీ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చింది. ఇంతవరకు హైదరాబాద్, గుంటూరు వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని గోదావరి జిల్లాల్లో తొలిసారిగా ఇద్దరు చిన్నారులకు విజయవంతంగా చేసినట్టు ఆ హాస్పిటల్æ వైద్యులు డాక్టర్ సత్తి వీర్రెడ్డి, డాక్టర్ సత్తి కృష్ణారెడ్డి ఆదివారం విలేకర్లకు చెప్పారు. జిల్లాకు చెందిన పవన్, సాయికృష్ణలు పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడుతున్నారు. వీరికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా సాధారణ జీవితం గడిపే అవకాశం ఉన్నా దూరప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించలేక, ఆర్థికస్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక తోడ్పాటు లభించింది. దీంతో వీరికి ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో తయారైన కాక్లియర్ ఇంప్లాంట్ పరికరాన్ని రప్పించి చెవి వెనుకభాగంలో అమర్చారు. హైదరాబాద్ కేర్బంజారా హాస్పిటల్ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ విష్ణు స్వరూపరెడ్డి తోడ్పాటుతో కాకినాడ శ్రావణి ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సత్తి వీర్రెడ్డి, డాక్టర్ సత్తి కృష్ణారెడ్డి ఆదివారం ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడేవారికి తమ వద్ద తొలిసారిగా ఈ తరహా ఆపరేషన్ చేసి సక్సెస్ కావడం ఈ ప్రాంతప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ సత్తి కృష్ణారెడ్డి చెప్పారు. చికిత్స అనంతరం వారం రోజుల్లో వీరిని డిశ్చార్జ్ చేస్తామని, కాక్లియర్ ఇంప్లాంట్‌తోపాటు చికిత్స చేయించుకున్న రోగికి ఏడాది పాటు ఇచ్చే ఎవిటి థెరఫీ ద్వారా మాటలు నేర్చుకుంటారని, ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా ఇక్కడే అందుబాటులో ఉందన్నారు. -
కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు పెరిగాయి. సీట్ల పెంపుపై ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వైద్య విద్య సంచాలకుడికి లేఖ రాసింది. గాంధీ వైద్య కళాశాల ఛాతీ విభాగంలో 1, అనస్తీషియా విభాగంలో 2, కాకతీయ వైద్య కళాశాల చర్మ వ్యాధుల విభాగం లో 1, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగంలో 5, రేడియాలజీలో 3, ఈఎన్టీలో 1, కంటి విభాగంలో 1, ఉస్మానియా వైద్య కళాశాల స్త్రీ వ్యాధుల విభాగంలో 4, ఈఎన్టీ విభాగంలో 3, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అనస్తీషియా విభాగంలో 6 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో్ల పెంచిన సదుపాయాలతోనే 27 సీట్లు పెరిగాయని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. -
తారుమారుకు ప్రణాళిక!
బాలుడి మృతి దురదృష్టకర ఘటనగా చిత్రీకరణ అయిన వారితోనే విచారణ హడావుడిగా నివేదిక 20న పూనం మాలకొండయ్య రాక ‘ఈఎన్టీ’ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు విశాఖపట్నం : ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యువాతపడ్డ బాలుడి ఉదంతాన్ని దురదృష్టకరంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వైద్యుల తప్పేమీ లేదంటూ తేల్చేం దుకు సన్నాహాలు మొదలయ్యాయి. నగరంలోని పెదవాల్తేరు ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి పెందుర్తి మండలం పురుషోత్తపురానికి చెందిన మూడేళ్ల జయశ్రీకర్ మంగళవారం మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటి దాకా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో చనిపోయిన ఘటనలు లేవు. సాక్షిలో ప్రచురితమైన ఈ కథనంపై కలెక్టర్ ప్రవీ ణ్‌కుమార్ స్పందించారు. ఆంధ్రమెడికల్ కళాశాల (ఏఎంసీ) ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవో,ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోకమిటీనియమించారు. విచారణ తీరుపై సందేహాలు ఎనస్థీషియా విభాగాధిపతి సత్యనారాయణ శుక్రవారం ఈఎన్టీ ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రామెడికల్ కళాశాల మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ, బాలుడికి మత్తు ఇచ్చిన వైద్యుడు వేణుగోపాల్ క్లాస్‌మేట్లని, శస్త్రచికిత్స చేసిన వైద్యుడు కృష్ణకిషోర్‌కు కమిటీ సభ్యుడైన డాక్టర్ సూర్యప్రకాష్ తోటి ఉద్యోగి కావడం విచారణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల కిందట కూడా మూడు నెలల కిందట కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి మరో బాలుడు మరణించాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిష్పక్షపాతం గా ఉండేందుకు మరో ఆస్పత్రి లేదా పొరుగు జిల్లా ఆస్పత్రుల వైద్యులతో విచారణ జరిపిస్తారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా కమిటీ వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాఉండగా శస్త్రచికిత్స వికటించి బాలుడు మృతి చెందిన విషయంపై తనకు ఎందుకు సమాచా రం ఇవ్వలేదని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ వద్దకు వెళ్లిన ఈఎన్టీ వైద్యులు తమ తప్పేమీ లేదని చెప్పుకున్నట్టు సమాచారం. యూనిట్ రద్దు చేస్తాం! ఈఎన్టీ ఆస్పత్రిలో వరుసగా చిన్నారులు మృత్యువాత పడుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డీలిప్ ప్రతినిధులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం వీరు ఆస్పత్రిని సందర్శించి, గతంలో ఒక బాలుడు మరణించినప్పుడు మిన్నకున్నామని, ఇప్పుడు మరో చిన్నారి చనిపోవడాన్ని ఉపేక్షించబోమని, ఇకపై ఇలాంటివి పునరావృతమైతే కాక్లియర్ ఇంప్లాంట్ యూనిట్‌ను రద్దు చేస్తామని హెచ్చరించినట్టు భోగట్టా. 20న పూనం మాలకొండయ్య రాక..! కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు వికటించడాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆమె ఈనెల 20న విశాఖ వస్తున్నట్తు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రి వర్గాల్లో కలవరం మొదలైంది. సెలవుపై సూపరింటెండెంట్? కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ఫెయిలై బాలుడు మరణించిన నేపథ్యంలో తలెత్తిన పరిణామాలతో ఆందోళన చెందుతున్న ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘునాథబాబు సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. -
కోఠి ఈఎన్టీకి 50 ఏళ్లు
కోఠి(హైదరాబాద్): పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా సేవలందిస్తున్న కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి ఆదివారంనాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. మెహిదీపట్నంలోని సరోజని కంటి ఆస్పత్రిలో ఓ యూనిట్‌గా ఉన్న ఈఎన్టీ 1966లో కోఠిలోని నవాబ్ ప్రతాప్‌గిరి భవనంలోకి మారి పూర్తిస్థాయి ఆస్పత్రిగా సేవలు ప్రారంభించింది. మొదట బయట రోగులనే చూసేవారు. కాలక్రమంలో 125 పడకలతో ఇన్‌పేషంట్ విభాగాన్ని ఏర్పాటు చేయగా అత్యాధునిక వసతులను సమకూర్చుకుని దేశంలోనే పేరున్న ఈఎన్టీ ఆస్పత్రుల్లో ఒకటిగా నిలిచింది. ఓపీ విభాగంలో ప్రతిరోజూ 1200మందికిపైగా, ఇన్‌పేషెంట్ విభాగంలో 200మందికి పైగా వైద్య సేవలు పొందుతున్నారు. చిన్నారుల్లో వినికిడి లోపాన్ని సరిచేసేందుకు రూ.6 లక్షల ఖర్చుతో కూడుకున్న కాక్లియార్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటివరకు 250మందికి ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశారు. శస్త్రచికిత్స జరిగిన చిన్నారులకు ఆస్పత్రిలోనే ఆరు నెలలపాటు ప్రత్యేక స్పీచ్ థెరపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తుండడం విశేషం. -
ఇక్కడ వైద్యం నాలుగు నెలలు లేటు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ, కోఠి) ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడికి వైద్యం కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన వసతులు, తగినంత మంది వైద్యులు లేకపోవడంతో వేలాది మంది రోగులు నెలల తరబడి చికిత్సల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక్కడ అవుట్పేషంట్ విభాగానికి రోజుకు సగటున 1300–1500 మంది రోగులు వస్తుంటారు. 125 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రికి చెవి నుంచి చీము కారడం, వినికిడి లోపం, ముక్కులో కండరం పెరిగి శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుండటం, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారే అధికంగా వస్తారు. ఇది అత్యవసర వైద్యం కాక పోవడంతో చాలా మంది చికిత్సలను నిర్లక్ష్యం చేస్తుంటారు. తీరా సమస్యను గుర్తించేసరికి ఇది మరింత జఠిలమవుతోంది. ఆలస్యంగా ఆస్పత్రికి వచ్చిన వీరికి వెంటనే చికిత్స చే సి జబ్బును నయం చేయాలి. కానీ ఆస్పత్రిలో ఐదు ఆపరేషన్ థియేటర్లు ఉండగా, రోజుకు సగటున 20–25 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో సాధారణ చికిత్సలకు కూడా నాలుగు నుంచి ఐదు మాసాలు వాయిదా వేస్తున్నారు. ఇక పుట్టుకతోనే మూగ, వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు కాంక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలంటే పెద్దస్థాయిలో పైరవీ చేయించుకోవాల్సిందే. శస్త్రచికిత్సలే కాదు కనీస మందులు అందడం లేదు. ‘ఆర్థికంగా తమకు భారమే అయినా నొప్పిని భరించే ఓపిక లేక విధిలేని పరిస్థితుల్లోనే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది’ అని నల్లగొండ జిల్లాకు చెందిన అంజిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కి దిగితే..ఫ్లోరంతా వైబ్రేషనే... ఆస్పత్రి భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి. పైకప్పులే కాదు గోడలు పె చ్చులూడి పడుతుండటంతో రోగులు బిక్కుబిక్కుమంటున్నారు. రోగులు మెట్ల ద్వారా కింది నుంచి పైకి, పై నుంచి కిందికి నడుస్తున్నప్పుడు ఒత్తిడికి ఆ ఫ్లోరంతా వైబ్రేషన్ వస్తుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దీనికి తోడు పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కన్పిస్తుం ది. ఉదయం 8. 30 నుంచి 10.30 వరకు ఓపీ కౌంటర్ కౌంటర్ తెరిచి ఉంటుంది. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రెండు ఓపీ కౌంటర్లు ఉన్నా..కేవలం రెండు గంటల్లో 1500 మందికి ఓపీ చీటీలు రాయడం సిబ్బందికి కష్టమవుతోంది. ఉదయం ఏమీ తినకుండా నాలుగైదు గంటల పాటు క్యూలో నిలబడటం వల్ల బీపీ, షుగర్‌తో బాధపడుతున్న రోగులు స్పృహ తప్పిపడిపోతున్నారు. రక్త, మూత్ర పరీక్షలే కాదు ఎక్స్‌రే కావాలంటే రెండు రోజులు ఆగాల్సి వస్తుంది. శస్త్రచికిత్సకు ముందు ప్రతి ఒక్కరికి హెచ్ఐవీ టెస్టు చేయాల్సి ఉండగా, ఆస్పత్రిలో ఇవి చేయకపోవడంతో ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. వాపుతో వస్తే..నాలుగు నెలల తర్వాత రమ్మంటున్నారు: మహ్మద్‌జానీ, బాలానగర్ ముక్కులో వాపు వచ్చింది. విపరీతమైన నొప్పి. తట్టుకోలేక రెండు నెలల క్రితం ఆస్పత్రికి వచ్చాను. వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స చేయాలన్నారు. నాలుగు నెలల తర్వాత తేదీ ఇచ్చారు. తాత్కాలికంగా మందులు వాడమన్నారు. రెండు నెలల నుంచి మందులు వా డుతున్నా నొప్పి తగ్గక పోగా వాపు మరింత పెరిగింది. నొప్పి వల్ల తాను పడుతున్న బాధను చెప్పినా విన్పించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. లోనికి రాకుండా తాళం వేశారు: నాగప్ప, బాగ్‌లింగంపల్లి మా బాబు గత రెండు రోజుల నుంచి చెవినొప్పితో ఏడుస్తున్నాడు. డాక్టర్‌కు చూపిద్దామని ఉదయం 8.30 గంటలకు ఓపీకి వచ్చాను. క్యూలో నిలబడి తీరా కౌంటర్ వద్దకు చేరుకునే సమయానికి(10.30 గంటలకు)ఓపీ టైమైపోయిందన్నారు. లోపలికి రాకుండా ప్రధాన ద్వారం గేటుకు తాళం వేశారు. ఎంత బతిమాలినా విన్పించుకోలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇయర్ డ్రాప్స్ బయట కొనుక్కొమన్నారు: తానాజీ, బోయగూడ చెవి నొప్పి ఉండటంతో ఆస్పత్రికి వచ్చాను. డాక్టర్ చూసి ఇయర్ డ్రాప్స్ వాడాల్సిందిగా సూచించారు. మందులు తీసుకుందామని ఫార్మసీకి వెళ్తే ఈ డ్రాప్స్ లేవన్నారు. బయట దొరుకుతుంది కొనుక్కుని వాడాల్సిందిగా సూచించారు. మందులు కూడా వారం రోజు లకు రాస్తే మూడు రోజులకే ఇచ్చారు. అవును.. నిజమే కానీ.. ఆస్పత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పడకల సంఖ్యే కాదు..స్టాఫ్ సంఖ్య కూడా పెరగలేదు. రోగుల సంఖ్య మాత్రం మూడు రెట్లు పెరిగింది. దీంతో ఈ నెలలో వచ్చిన వారికి నవంబర్‌లో శస్త్రచికిత్స తేదీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం ఐదు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున 25 శస్త్రచికిత్సలు చేస్తున్నాం. రోగుల రద్దీ దృష్ట్యా అదనంగా మరో మూడు ఓటీ టేబుల్స్ అవసరం. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇందుకు కావాల్సిన బడ్జెట్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. రోగులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – డాక్టర్ టి.శంకర్, సూపరింటిండెంట్, ఈఎన్టీ -
ఆ ఐదూ నకిలీనే!
► డీఈఓ కార్యాలయూనికి చేరిన ఐదుగురి బధిరుల ధ్రువీకరణ పత్రాలపై నివేదికలు ► కుల ధ్రువీకరణపై నాన్చుడి ధోరణి ► తహశీల్దార్ కార్యాలయాల గడప దాటని నివేదికలు ► ఆందోళన చెందుతున్న అభ్యర్థులు అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-14 ఎంపిక జాబితాలోని ‘నకిలీల’ పుట్ట పగులుతోంది. ఇటీవలే 14 మందిని నకిలీలుగా తేల్చిన అధికారులు.. వారిని ఎంపిక జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా మరో ఎనిమిది మంది చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల 8 మంది బోగస్ స్టడీ సర్టిఫికెట్లు, నలుగురు మాజీ సైనిక కోటా కింద, ఒకరు స్థానిక, మరొకరిని విద్యార్హత ధ్రువీకరణలో తేడా వల్ల తొలగించారు. ఐదూ నకిలీనే... బధిరుల కోటా కింద ఎంపికైన అభ్యర్థుల విషయం మరోసారి చర్చనీయాంశం కానుంది. 2008 డీఎస్సీని నకిలీ బధిరులు కుదిపేశారు. ఈసారీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బధిరుల కోటా కింద ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అదికూడా వైకల్యం 70 శాతానికి పైబడిన అభ్యర్థులే అర్హులు. ఈ డీఎస్సీలో సుమారు 20 మంది బధిరుల కోటా కింద ఎంపికయ్యారు. ధ్రువీకరణ పత్రాలపై నివేదికలు ఒక్కొక్కటిగా డీఈఓ కార్యాలయానికి వస్తున్నాయి. ఇప్పటిదాకా ఐదుగురు అభ్యర్థుల ధ్రువీకరణపత్రాలు వచ్చాయి. ఈ ఐదుగురూ అనర్హులుగా తేలింది. వీరికి 30-50 శాతం మాత్రమే వైకల్యమున్నట్లు తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లు కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన నివేదికలు తహశీల్దార్ కార్యాలయాల గడప దాటడం లేదు. నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గుత్తి నుంచి ఇద్దరు అభ్యర్థులు రెసిడెన్షియల్, యల్లనూరు నుంచి ఒకరు, బుక్కపట్నం నుంచి మరో అభ్యర్థి కుల ధ్రువీకరణ, అనంతపురం నుంచి ఒక అభ్యర్థి స్టడీ సర్టిఫికెట్‌పై నివేదికలు కోరుతూ విద్యాశాఖ అధికారులు లేఖలు రాశారు. వీటిలో గుత్తి నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు వచ్చాయి. ఇవి అర్హత కల్గినవిగా తెలిసింది. అనంతపురం నుంచి ఓ అభ్యర్థి స్టడీ సర్టిఫికెట్ బోగస్ అని నివేదిక వచ్చింది. ఇక యల్లనూరు, బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయాల నుంచి కుల ధ్రువీకరణపత్రాల నివేదికలు రావాల్సి ఉంది. ఈ రెండింటిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు వెంట పడుతున్నా.. రెవెన్యూ అధికారులు నాన్చుడి ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో జాబితాలో తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అనర్హులను తొలగిస్తే తమకు అవకాశం వస్తుందనే ఆశతో రోజూ డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 22 మంది బోగస్ బోగస్ అభ్యర్థుల జాబితా 22కు చేరింది. ఇటీవల 14 మంది జాబితాను అధికారులు ప్రకటించారు. తాజాగా మరో ఎనిమిది బోగస్‌గా తేలింది. ఐదుగురు బధిరుల సర్టిఫికెట్లు, ఒకరు బోగస్ స్టడీ సర్టిఫికెట్, ఇద్దరు బోగస్ కుల ధ్రువీకరణపత్రాలు జత చేసినట్లు తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు అధికారంగా వెల్లడించాల్సి ఉంది.