కాక్లియర్ ఇంప్లాంట్ సర్జీరీ చేస్తున్న శ్రావణి హాస్పిటల్ వైద్యులు
కాకినాడ : పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడుతున్న చిన్నారులకు అత్యాధునిక శస్త్రచికిత్సా విధానం ఇప్పుడు కాకినాడ శ్రావణి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇంతవరకు హైదరాబాద్, గుంటూరు వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని గోదావరి జిల్లాల్లో తొలిసారిగా ఇద్దరు చిన్నారులకు విజయవంతంగా చేసినట్టు ఆ హాస్పిటల్æ వైద్యులు డాక్టర్ సత్తి వీర్రెడ్డి, డాక్టర్ సత్తి కృష్ణారెడ్డి ఆదివారం విలేకర్లకు చెప్పారు. జిల్లాకు చెందిన పవన్, సాయికృష్ణలు పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడుతున్నారు. వీరికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా సాధారణ జీవితం గడిపే అవకాశం ఉన్నా దూరప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించలేక, ఆర్థికస్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక తోడ్పాటు లభించింది. దీంతో వీరికి ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో తయారైన కాక్లియర్ ఇంప్లాంట్ పరికరాన్ని రప్పించి చెవి వెనుకభాగంలో అమర్చారు. హైదరాబాద్ కేర్‌బంజారా హాస్పిటల్ ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్ విష్ణు స్వరూపరెడ్డి తోడ్పాటుతో కాకినాడ శ్రావణి ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్ సత్తి వీర్రెడ్డి, డాక్టర్ సత్తి కృష్ణారెడ్డి ఆదివారం ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడేవారికి తమ వద్ద తొలిసారిగా ఈ తరహా ఆపరేషన్ చేసి సక్సెస్ కావడం ఈ ప్రాంతప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ సత్తి కృష్ణారెడ్డి చెప్పారు. చికిత్స అనంతరం వారం రోజుల్లో వీరిని డిశ్చార్జ్ చేస్తామని, కాక్లియర్ ఇంప్లాంట్‌తోపాటు చికిత్స చేయించుకున్న రోగికి ఏడాది పాటు ఇచ్చే ఎవిటి థెరఫీ ద్వారా మాటలు నేర్చుకుంటారని, ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా ఇక్కడే అందుబాటులో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment