ఇక్కడ వైద్యం నాలుగు నెలలు లేటు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ, కోఠి) ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడికి వైద్యం కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన వసతులు, తగినంత మంది వైద్యులు లేకపోవడంతో వేలాది మంది రోగులు నెలల తరబడి చికిత్సల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక్కడ అవుట్‌పేషంట్ విభాగానికి రోజుకు సగటున 1300–1500 మంది రోగులు వస్తుంటారు. 125 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రికి చెవి నుంచి చీము కారడం, వినికిడి లోపం, ముక్కులో కండరం పెరిగి శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుండటం, గొంతులో ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారే అధికంగా వస్తారు.
ఇది అత్యవసర వైద్యం కాక పోవడంతో చాలా మంది చికిత్సలను నిర్లక్ష్యం చేస్తుంటారు. తీరా సమస్యను గుర్తించేసరికి ఇది మరింత జఠిలమవుతోంది. ఆలస్యంగా ఆస్పత్రికి వచ్చిన వీరికి వెంటనే చికిత్స చే సి జబ్బును నయం చేయాలి. కానీ ఆస్పత్రిలో ఐదు ఆపరేషన్ థియేటర్లు ఉండగా, రోజుకు సగటున 20–25 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో సాధారణ చికిత్సలకు కూడా నాలుగు నుంచి ఐదు మాసాలు వాయిదా వేస్తున్నారు. ఇక పుట్టుకతోనే మూగ, వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు కాంక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలంటే పెద్దస్థాయిలో పైరవీ చేయించుకోవాల్సిందే. శస్త్రచికిత్సలే కాదు కనీస మందులు అందడం లేదు. ‘ఆర్థికంగా తమకు భారమే అయినా నొప్పిని భరించే ఓపిక లేక విధిలేని పరిస్థితుల్లోనే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది’ అని నల్లగొండ జిల్లాకు చెందిన అంజిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎక్కి దిగితే..ఫ్లోరంతా వైబ్రేషనే...
ఆస్పత్రి భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి. పైకప్పులే కాదు గోడలు పె చ్చులూడి పడుతుండటంతో రోగులు బిక్కుబిక్కుమంటున్నారు. రోగులు మెట్ల ద్వారా కింది నుంచి పైకి, పై నుంచి కిందికి నడుస్తున్నప్పుడు ఒత్తిడికి ఆ ఫ్లోరంతా వైబ్రేషన్ వస్తుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దీనికి తోడు పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కన్పిస్తుం ది. ఉదయం 8. 30 నుంచి 10.30 వరకు ఓపీ కౌంటర్ కౌంటర్ తెరిచి ఉంటుంది.
మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రెండు ఓపీ కౌంటర్లు ఉన్నా..కేవలం రెండు గంటల్లో 1500 మందికి ఓపీ చీటీలు రాయడం సిబ్బందికి కష్టమవుతోంది. ఉదయం ఏమీ తినకుండా నాలుగైదు గంటల పాటు క్యూలో నిలబడటం వల్ల బీపీ, షుగర్‌తో బాధపడుతున్న రోగులు స్పృహ తప్పిపడిపోతున్నారు. రక్త, మూత్ర పరీక్షలే కాదు ఎక్స్‌రే కావాలంటే రెండు రోజులు ఆగాల్సి వస్తుంది. శస్త్రచికిత్సకు ముందు ప్రతి ఒక్కరికి హెచ్‌ఐవీ టెస్టు చేయాల్సి ఉండగా, ఆస్పత్రిలో ఇవి చేయకపోవడంతో ప్రైవేటు
డయాగ్నోస్టిక్స్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది.
వాపుతో వస్తే..నాలుగు నెలల తర్వాత రమ్మంటున్నారు: మహ్మద్‌జానీ, బాలానగర్ ముక్కులో వాపు వచ్చింది. విపరీతమైన నొప్పి. తట్టుకోలేక రెండు నెలల క్రితం ఆస్పత్రికి వచ్చాను. వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స చేయాలన్నారు. నాలుగు నెలల తర్వాత తేదీ ఇచ్చారు. తాత్కాలికంగా మందులు వాడమన్నారు. రెండు నెలల నుంచి మందులు వా డుతున్నా నొప్పి తగ్గక పోగా వాపు మరింత పెరిగింది. నొప్పి వల్ల తాను పడుతున్న బాధను చెప్పినా విన్పించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
లోనికి రాకుండా తాళం వేశారు: నాగప్ప, బాగ్‌లింగంపల్లి
మా బాబు గత రెండు రోజుల నుంచి చెవినొప్పితో ఏడుస్తున్నాడు. డాక్టర్‌కు చూపిద్దామని ఉదయం 8.30 గంటలకు ఓపీకి వచ్చాను. క్యూలో నిలబడి తీరా కౌంటర్ వద్దకు చేరుకునే సమయానికి(10.30 గంటలకు)ఓపీ టైమైపోయిందన్నారు. లోపలికి రాకుండా ప్రధాన ద్వారం గేటుకు తాళం వేశారు. ఎంత బతిమాలినా విన్పించుకోలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఇయర్ డ్రాప్స్ బయట కొనుక్కొమన్నారు: తానాజీ, బోయగూడ
చెవి నొప్పి ఉండటంతో ఆస్పత్రికి వచ్చాను. డాక్టర్ చూసి ఇయర్ డ్రాప్స్ వాడాల్సిందిగా సూచించారు. మందులు తీసుకుందామని ఫార్మసీకి వెళ్తే ఈ డ్రాప్స్ లేవన్నారు. బయట దొరుకుతుంది కొనుక్కుని వాడాల్సిందిగా సూచించారు. మందులు కూడా వారం రోజు లకు రాస్తే మూడు రోజులకే ఇచ్చారు.
అవును.. నిజమే కానీ..
ఆస్పత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పడకల సంఖ్యే కాదు..స్టాఫ్ సంఖ్య కూడా పెరగలేదు. రోగుల సంఖ్య మాత్రం మూడు రెట్లు పెరిగింది. దీంతో ఈ నెలలో వచ్చిన వారికి నవంబర్‌లో శస్త్రచికిత్స తేదీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం ఐదు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున 25 శస్త్రచికిత్సలు చేస్తున్నాం. రోగుల రద్దీ దృష్ట్యా అదనంగా మరో మూడు ఓటీ టేబుల్స్ అవసరం. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇందుకు కావాల్సిన బడ్జెట్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. రోగులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ టి.శంకర్, సూపరింటిండెంట్, ఈఎన్‌టీ