సమస్యల ‘భాగ్య’నగరి
హైదరాబాద్.. ప్రపంచంలోనే 33వ అతిపెద్ద కాస్మోపాలిటన్ నగరంగా, ఆసియా ఖండంలో 27వ అతి పెద్ద విశ్వనగరంగా విలసిల్లుతున్న భాగ్యనగరి. సింగపూర్, అట్లాంటా, డాలస్, రోమ్, సిడ్నీ, టొరంటో తదితర సుప్రసిద్ధ విశ్వనగరాల కంటే హైదరాబాద్ నగర జనాభా ఎక్కువ. ఫిబ్రవరి 2న జరగనున్న మహానగర పాలక మండలి ఎన్నికల నేపథ్యంలో మన మహానగరం చరిత్ర స్థూలంగా... 1591లో మహ్మద్ కులీ కుతుబ్‌షా పన్నెండు వేల మొహల్లాల(బస్తీలు), పద్నాలుగు వేల భవనాలతో కూడిన ఈ మహానగర నిర్మాణాన్ని ప్రారంభించే సమయంలో ప్రత్యేక ప్రార్థన చేస్తూ ‘‘వీలైనంత త్వరగా నా రాజ్యం సుసంపన్నం కావాలి. అందరికీ సంతృప్తికరమైన జీవితానికి కేంద్రం కావాలి. సకల జాతుల జనంతో నిండిపోయి, ఈ సుందర ప్రపంచంలోని దేశాల్లోకెల్లా.. మహానగరమై కలికితురాయిగా మెరిసిపోవాలి. సముద్రంలో చేప పిల్లల్లా... కుల, మత, జాతి వివక్ష లేకుండా ప్రజలంతా కలకాలం కలిసి ఉండాలి’’ అని వేడుకున్నారట. ఆయన కోరుకున్నట్టే హైదరాబాద్ నేడు మహానగరమైంది.
వివిధ జాతులు, సమూహాల సమైక్యతకు చిహ్నంగా ఆవిర్భవించిన హైదరాబాద్ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. 400 ఏళ్ల క్రితమే అప్ఘనిస్తాన్ పఠాన్లు, కాబూలీలూ, మక్కా, మదీనాల అరబ్బులూ, బ్రిటన్ నుంచి ఆంగ్లేయులూ, ఆఫ్రికా దేశాల చావూస్‌లూ, ఇథియోపియా హబ్సీలూ, ఇరాన్, ఇరాక్‌ల నుంచి తరలివచ్చిన షియా, సున్నీ, బోరా ముస్లింలతో హైదరాబాద్ కళకళలాడింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జైన్లు, మార్వాడీలు, అగర్వాళ్లు, పార్సీలు, బెంగాలీలు, సిక్కులు, లోథాలు, పార్థీలు, తమిళులు, రోహిల్లాలు, మరాఠీలు, కన్నడిగులు తదితరులు హైదరాబాద్ చేరి, ఇక్కడి సంస్కృతి, నాగరికతలో పాన్‌సుపారీలా కలిసిపోయారు. అదంతా గతం. వివిధ జాతుల, మతాల, వర్గాలతో జన’కోటి’కి చేరువైన నేటి హైదరాబాద్ నిజంగా విశ్వనగరి. కానీ ఆ పేరుకు తగ్గ స్థాయి మౌలిక సదుపాయాలున్నాయా? జనజీవితం సులువుగా, సజావుగా సాగిపోయే ఏర్పాట్లు జరిగాయా?
భాగ్యనగరికి తాగునీరే మహా సమస్య
ప్రణాళికా రహితంగా, ముందు చూపు లేకుండా నగరం విస్తరించిన తీరు, మంచినీటి పంపిణీలో ఘోరవైఫల్యం నగర జనాభాలో 60 శాతం మందిని ఇబ్బంది పెడుతోంది. సుమారు 35 లక్షల నివాస గృహాలున్నా, జలమండలి రక్షిత మంచినీటి కనెక్షన్లు ఉన్న వారి సంఖ్య కేవలం 8.5 లక్షలే. ప్రపంచ ప్రమాణాల ప్రకారం ప్రతి మనిషికి రోజు 140 లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. కానీ రోజుకు సగటున 40 లీటర్ల నీరు అందుతున్న దాఖ లాలు లేవు. కృష్ణా నీటి సరఫరా మూడు దశల్లో 270 ఎంజీడీలు కాగా, గోదావరి 172, సింగూరు, మంజీరా 120, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు 30 ఎంజీడీల చొప్పున నగరానికి సరఫరా చేస్తున్నాయి. వీటిలో కాలం చెల్లిన పైపుల లీకేజీల వల్ల 40 శాతానికి పైగా నీరు వృథా అవుతోంది. రోజుకు సుమారు వెయ్యి ఎంజీడీల నీరు అవసరమైతే సరఫరా చేస్తున్నది 250 ఎంజీడీలే.
ప్రజా రవాణా వ్యవస్థ విఫల గాథ
ప్రజావసరాలను తీర్చడంలో ప్రజా రవాణా వ్యవస్థ విఫలం చెందటంతో చిరుద్యోగులు సైతం సొంత వాహనాలపై రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొంది. నేడు నగరంలో సుమారు 45 లక్షల సొంత వాహనాలున్నాయి. ఏటా పది శాతానికి పైగా ఆ సంఖ్య వృద్ధి చెందుతోంది. సుమారు రెండు లక్షల ఆటోలు, 3,800 ఆర్టీసీ బస్సులు జనం అవసరాలను తీర్చలేకపోయాయి. ఎంఎంటీఎస్ రైళ్లను తిప్పుతున్నా.. వాటికి ఆర్టీసీ బస్సులతో అను సంధానమే లేదు. నగరంలో కనీసం 9 శాతం రహదారులుండాల్సి ఉంటే, ఉన్నది కేవలం 5-6 శాతమే. దీంతో వాహనాల వేగం గంటకు 12 నుంచి 14 కి.మీ. మించటం లేదు.
భయపెడుతున్న అంటువ్యాధులు
దోమలు, ఈగలు తదితర కీటకాల ద్వారా వచ్చే వ్యాధుల్లో హైదరాబాద్ దేశంలోనే టాప్ రేంజ్‌లో ఉంది. 1950వ ద శకం వరకు మంచి నీరందించిన మూసీనది మురికి కూపమై పోయింది. దీనికి తోడు, పూడుకు పోయిన 60 నాలాల ఆధునీకరణకు 2007లోనే రూ.268 కోట్లను కేంద్రం మంజూరు చేసినా... పనులు ఇంకా మొదలుకాలేదు. నగరం 1,50,000 ఎకరాల్లో విస్తరించగా మూడు వేల ప్రాంతాలకే డంపర్‌బిన్‌లు పరిమితమ య్యాయి. దీంతో ప్రధాన కూడళ్లన్నీ చెత్త కేంద్రాలయ్యాయి. ప్రతి సీజన్‌లో దోమలు, ఈగలు తదితర క్రిమికీటకాల ద్వారా వ్యాప్తి చెందే రోగాలు పెచ్చుపెరిగిపోతున్న నగరంగా హైదరాబాద్ దేశంలో ఎప్పుడూ మొదటి మూడు స్థానాల్లోనే ఉంటోంది.
గ్రీన్ టాప్..లేచిపోయింది
సమశీతోష్ణ స్థితి ఒకప్పటి హైదరాబాద్ ప్రత్యేకత. సముద్రమట్టానికి ఎత్తున ఉండటం, నగరంలో భాగంగా చెరువులూ, చుట్టూతా అటవీ సంపదా ఉండేవి. నగర విస్తరణతో పాటే చెరువులు, అటవీ సంపద కనుమరుగై సమశీతోష్ణ స్థితి, గతంగా మారిపోయింది. పచ్చదనం విస్తీర్ణం కూడా 6 శాతానికి తగ్గిపోయింది. వీటికి తోడు కాలుష్యం. యాభై శాతం వాహనాల కాలుష్యమైతే మరో 30 శాతం పారిశ్రామిక కాలుష్యం, మరో 20 శాతం వీధులు, రహదారులపై ఉన్న దుమ్ము కలిసి నగర వాతావరణ కాలుష్యాన్ని ప్రమాద కరంగా పెంచుతున్నాయి.
విశ్వఖ్యాతి పొందిన ఈ నగరంలో చావు, పుట్టుకల సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లెసైన్స్‌ల నుంచి పరిశ్రమ, నివాస గృహం ఏది నిర్మించాలన్నా, విద్యుత్, మంచినీటి కనెక్షన్ పొందాలన్నా మరే పనికైనా దళారులను ఆశ్రయించక తప్పని దుస్థితి. హైదరాబాద్ ఘన చారిత్రక కీర్తి స్ఫూర్తితో నగరాన్ని ముందడుగు వేయించటంలో అడుగడుగునా కనిపించే ఈ వైఫల్యా లకు పరిష్కారం ఎన్నడు? రేపటి ఏడవ మహానగర పాలిక మండలి ఆ దిశగా ముంద డుగు వేయగలదా? హైదరాబాద్‌ను తిరిగి భాగ్యనగరిని చేయగలదా?
- శ్రీగిరి విజయ్ కుమార్‌రెడ్డి సాక్షి, చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్