అర్థరాత్రి ఎంపీ భర్త కిడ్నాప్ హైడ్రామా!
హైదరాబాద్: అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత.. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. తన భర్త రామకోటేశ్వర రావును బుధవారం సాయంత్రం బలవంతంగా తీసుకెళ్లారని ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
రాత్రి 12 గంటల సమయంలో రామకోటేశ్వర రావు ఇంటికి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అర్థరాత్రి ఇంటికి చేరుకున్న ఆయన్ను వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామకోటేశ్వర్ రావు.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. మంత్రి తలసాని కొడుకు సాయి యాదవ్, మరో వ్యక్తి రామకృష్ణతో వ్యాపార లావాదేవీలపై చర్చించడానికి తాజ్ కృష్ణ హోటల్కు వెళ్లినట్లు తెలిపారు. అయితే.. ఓ భూ వ్యవహారంలో మంత్రి తలసాని కుమారుడు తనను బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని తన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను మంత్రి కుమారుడు బలవంతంగా లాక్కున్నాడని, దీనికి సంబంధించిన వివరాలను పోలీసులకు తెలిపానని రామకోటేశ్వర రావు వెల్లడించారు.
కిడ్నాప్ వ్యవహారంపై వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్ అయినట్లు సమాచారం అందగానే విచారణ చేపట్టామని వెల్లడించారు. తలసాని కుమారుడు తనను బెదిరించాడని రామకోటేశ్వరరావు చెప్పాడని, అయితే.. దీనిపై లిఖిత పూర్వక ఫిర్యాదు అందగానే బెదిరింపుల వ్యవహారంపై విచారణ చేపడుతామని డీసీపీ తెలిపారు.