Kottapally Geeta
-
మంత్రి తలసాని కుమారునిపై కేసు
హైదరాబాద్: బెదిరింపుల వ్యవహారంలో మంత్రి తలసాని యాదవ్ కుమారుడు సాయి యాదవ్‌పై కేసు నమోదైంది. భూ వివాదంలో జోక్యం చేసుకుని, తనను బెదిరించాడంటూ ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు గురువారం ఉదయం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలోని తన ఐదెకరాల భూమి డెవలప్మెంట్ కోసం రామకృష్ణ అనే వ్యక్తికి చెందిన రామకృష్ణ కన్స్ట్రక్షన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నానని, అయితే అతడు సరిగా డబ్బులు చెల్లించకపోవటంతో డీల్ రద్దు చేసుకున్నట్లు రామకోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయమై మాట్లాడాలని తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొడుకు సాయియాదవ్, రామకృష్ణ కలసి తాజ్‌కృష్ణ హోటల్‌కు రావాలని బుధవారం సాయంత్రం కబురు పంపారని, అక్కడికి వెళ్లగా తనను మంత్రి కుమారుడు బెదిరించాడని ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరిపి మంత్రి కొడుకు సాయి యాదవ్‌పై కేసు నమోదు చేశారు. అయితే, ఇదే వ్యవహారంలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన భర్తను మంత్రి కుమారుడు కిడ్నాప్ చేశారంటూ బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. -
'ఎవరైనా తాజ్ కృష్ణా హోటల్లో కిడ్నాప్ చేస్తారా'
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వర రావును తన కుమారుడు కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. కిడ్నాప్ చేసే వాళ్లు ఎవరైనా తాజ్‌కృష్ణా హోటల్లో కూర్చుని మాట్లాడుతారా అని ఆయన ప్రశ్నించారు. కిడ్నాప్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన.. డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించారన్న వార్తలు కూడా అవాస్తవం అన్నారు. కేవలం ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని మాత్రమే అడిగారని, అయితే డబ్బు ఇచ్చే వరకు డాక్యుమెంట్లు పెట్టుకోవాలని రామకోటేశ్వర రావే అన్నారని తెలిపారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఇరువురి అగ్రిమెంట్లకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడిస్తానని తలసాని తెలిపారు. 2011లో కొత్తపల్లి గీత కుటుంబం తమ వద్ద 11 కోట్లు అప్పుగా తీసుకున్నారని అయితే అవి ఇప్పటి వరకూ తిరిగి చెల్లించకపోగా ఇప్పుడు ఈ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తాజ్ కృష్ణా హోటల్ నుంచి అందరూ నవ్వుకుంటూనే బయటకు పోయారని ఆ ఫోటేజీ చూస్తే కిడ్నాప్ వార్తలు అవాస్తవం అని అర్థమౌతుందన్నారు. 'గీత భర్త మీడియాతో మాట్లాడుతూ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు అనే విషయాన్ని మాత్రమే చెబుతున్నారు, వారు డబ్బు ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని వెల్లడించడం లేదు' అని తలసాని మండిపడ్డారు. -
అర్థరాత్రి ఎంపీ భర్త కిడ్నాప్ హైడ్రామా!
హైదరాబాద్: అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత.. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. తన భర్త రామకోటేశ్వర రావును బుధవారం సాయంత్రం బలవంతంగా తీసుకెళ్లారని ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి 12 గంటల సమయంలో రామకోటేశ్వర రావు ఇంటికి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అర్థరాత్రి ఇంటికి చేరుకున్న ఆయన్ను వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామకోటేశ్వర్ రావు.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. మంత్రి తలసాని కొడుకు సాయి యాదవ్, మరో వ్యక్తి రామకృష్ణతో వ్యాపార లావాదేవీలపై చర్చించడానికి తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లినట్లు తెలిపారు. అయితే.. ఓ భూ వ్యవహారంలో మంత్రి తలసాని కుమారుడు తనను బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను మంత్రి కుమారుడు బలవంతంగా లాక్కున్నాడని, దీనికి సంబంధించిన వివరాలను పోలీసులకు తెలిపానని రామకోటేశ్వర రావు వెల్లడించారు. కిడ్నాప్ వ్యవహారంపై వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్ అయినట్లు సమాచారం అందగానే విచారణ చేపట్టామని వెల్లడించారు. తలసాని కుమారుడు తనను బెదిరించాడని రామకోటేశ్వరరావు చెప్పాడని, అయితే.. దీనిపై లిఖిత పూర్వక ఫిర్యాదు అందగానే బెదిరింపుల వ్యవహారంపై విచారణ చేపడుతామని డీసీపీ తెలిపారు. -
ఎర్రమంజిల్ కోర్టుకు హజరైన కొత్తపల్లి గీత
హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టుకు ఎంపీ కొత్తపల్లి గీత హాజరయ్యారు. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీకాల్ చేయాలని చేసిన విజ్క్షప్తికి ఎర్రమంజిల్ కోర్టు సానుకూలంగా స్పందించింది. దాంతో కొత్తపల్లి గీతపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ను కోర్టు రీకాల్ చేసింది. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 25 కోట్ల రుణాన్ని కొత్తపల్లి గీత తీసుకున్నారు. కొత్తపల్లి గీత ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోర్టులో పిటిషన్ వేశారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కొత్తపల్లి గీత, ఆమె భర్త సీఆర్‌కే రావులు డైరెక్టర్లుగా ఉన్నారు. -
అనర్హత వేటు పడితే మళ్లీ పోటీ చేస్తా: గీత
న్యూఢిల్లీ : తనపై అనర్హత వేటు పడితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం కొత్తపల్లి గీత...టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసిన విషయం తెలిసిందే. మంగళవారమిక్కడ కొత్తపల్లి గీత మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలతో కలిసి పని చేస్తానని తెలిపారు. అయితే తాను ఇప్పుడు తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కలవలేదని, ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కొత్తపల్లి గీతా తెలిపారు. -
గీత ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ వేశారు
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఈశ్వరి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ పత్రా లు దాఖలు చేశారని, దీనిపై విచారణ జరిపించి ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టాలని పాడేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. అఫిడవిట్లో తనను ప్రతిపాదించిన వారి పేర్ల ఎదుట ఫోర్జరీ సంతకాలు చేసి ఎన్నికల అధికారికి సమర్పించారని చెప్పారు. ఈ మేరకు ఆమె మంగళవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గీత నామినేషన్ అఫిడవిట్ పత్రాల నకళ్లను ఈ సందర్భంగా చూపించారు. సంతకాలు ఫోర్జరీ అయిన ముగ్గురు ఓటర్లను కూడా ఈశ్వరి విలేకరుల సమావేశానికి తీసుకునిచ్చారు. సీహెచ్ గోపాలకృష్ణ, డి.పి.రాంబాబు, ఎస్.గౌరీశంకర్రావు అనే ఈ ముగ్గురూ.. తమ ఓటరు గుర్తింపు కార్డులను చూపుతూ కొత్తపల్లి గీత తమకు తెలియకుండానే తమ పేర్లను, ఓటరు ఐడీ నెంబర్లతో సహా ఆమె నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదకులుగా చేర్చారని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని చెప్పారు. గీతకు నిజంగా దమ్మూ, ధైర్యం ఉంటే వైఎస్సార్సీపీని వీడి ఎంపీగా మళ్లీ పోటీచే సి గెలవాలని, గిరిజనుల సత్తా ఏమిటో అప్పుడు చూపిస్తామని సవాలు విసిరారు. గీత అసలు పేరు గ్లాడిస్ అనీ, ఆమె గిరిజనురాలు కాదని 1993లో అప్పటి జాయింట్ కలెక్టర్ మంగపతిరావు పేర్కొన్నారని, గీత తల్లి, తండ్రి, తాత, ముత్తాతలు గిరిజనులు కానేకాదని, ఆమె ఎస్సీ మాల వర్గానికి చెందినవారని కూడా వివరించారని చెప్పారు. ఇదంతా తాను వ్యక్తిగతంగా చేస్తున్నానని వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. -
ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తా: కొత్తపల్లి గీత
విశాఖ: ప్రత్యర్థులు ఎవరైనా ఆరోపణలు చేస్తే వారిపై పరువునష్టం దావా వేస్తానని అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి కొత్తపల్లి గీత హెచ్చరించారు. నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా అడ్డతీగల ఎమ్మార్వో ఎస్టీనని ధృవీకరించారని కొత్తపల్లి గీత తెలిపారు. ఎమ్మార్వో ధృవీకరించినా తనపై ఆరోపణలు చేస్తే తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. నేను ఎస్టీ వాల్మీకి కులస్తురాలినని, 2002లోనే ఎస్టీనని హైకోర్టు తీర్పు ఇచ్చిందనే విషయాన్ని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. రాజకీయంగా లబ్ది పొందడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత ఎస్టీ కాదని ప్రత్యర్ధులు తప్పుడు ఆరోపణలు చేయడంపై ధీటుగా స్పందించారు.