'ఎవరైనా తాజ్ కృష్ణా హోటల్లో కిడ్నాప్ చేస్తారా'
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వర రావును తన కుమారుడు కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. కిడ్నాప్ చేసే వాళ్లు ఎవరైనా తాజ్కృష్ణా హోటల్లో కూర్చుని మాట్లాడుతారా అని ఆయన ప్రశ్నించారు. కిడ్నాప్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన.. డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించారన్న వార్తలు కూడా అవాస్తవం అన్నారు. కేవలం ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని మాత్రమే అడిగారని, అయితే డబ్బు ఇచ్చే వరకు డాక్యుమెంట్లు పెట్టుకోవాలని రామకోటేశ్వర రావే అన్నారని తెలిపారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఇరువురి అగ్రిమెంట్లకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడిస్తానని తలసాని తెలిపారు.
2011లో కొత్తపల్లి గీత కుటుంబం తమ వద్ద 11 కోట్లు అప్పుగా తీసుకున్నారని అయితే అవి ఇప్పటి వరకూ తిరిగి చెల్లించకపోగా ఇప్పుడు ఈ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తాజ్ కృష్ణా హోటల్ నుంచి అందరూ నవ్వుకుంటూనే బయటకు పోయారని ఆ ఫోటేజీ చూస్తే కిడ్నాప్ వార్తలు అవాస్తవం అని అర్థమౌతుందన్నారు. 'గీత భర్త మీడియాతో మాట్లాడుతూ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు అనే విషయాన్ని మాత్రమే చెబుతున్నారు, వారు డబ్బు ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని వెల్లడించడం లేదు' అని తలసాని మండిపడ్డారు.