రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఈశ్వరి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ పత్రా లు దాఖలు చేశారని, దీనిపై విచారణ జరిపించి ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టాలని పాడేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. అఫిడవిట్‌లో తనను ప్రతిపాదించిన వారి పేర్ల ఎదుట ఫోర్జరీ సంతకాలు చేసి ఎన్నికల అధికారికి సమర్పించారని చెప్పారు. ఈ మేరకు ఆమె మంగళవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గీత నామినేషన్ అఫిడవిట్ పత్రాల నకళ్లను ఈ సందర్భంగా చూపించారు. సంతకాలు ఫోర్జరీ అయిన ముగ్గురు ఓటర్లను కూడా ఈశ్వరి విలేకరుల సమావేశానికి తీసుకునిచ్చారు. సీహెచ్ గోపాలకృష్ణ, డి.పి.రాంబాబు, ఎస్.గౌరీశంకర్‌రావు అనే ఈ ముగ్గురూ.. తమ ఓటరు గుర్తింపు కార్డులను చూపుతూ కొత్తపల్లి గీత తమకు తెలియకుండానే తమ పేర్లను, ఓటరు ఐడీ నెంబర్లతో సహా ఆమె నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదకులుగా చేర్చారని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని చెప్పారు. గీతకు నిజంగా దమ్మూ, ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీని వీడి ఎంపీగా మళ్లీ పోటీచే సి గెలవాలని, గిరిజనుల సత్తా ఏమిటో అప్పుడు చూపిస్తామని సవాలు విసిరారు. గీత అసలు పేరు గ్లాడిస్ అనీ, ఆమె గిరిజనురాలు కాదని 1993లో అప్పటి జాయింట్ కలెక్టర్ మంగపతిరావు పేర్కొన్నారని, గీత తల్లి, తండ్రి, తాత, ముత్తాతలు గిరిజనులు కానేకాదని, ఆమె ఎస్సీ మాల వర్గానికి చెందినవారని కూడా వివరించారని చెప్పారు. ఇదంతా తాను వ్యక్తిగతంగా చేస్తున్నానని వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
గీత ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ వేశారు
Published Wed, Aug 13 2014 3:45 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement
Advertisement