హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 12 వ తేదీ నుంచి పవిత్ర కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 12 వ తేదీన ప్రారంభమై 23 వ తేదీతో ఈ పుష్కరాలు ముగుస్తాయి. పుష్కరాల ఏర్పాట్ల కోసం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి. పుష్కరాల కోసం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 173 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు శనివారం వెల్లడించారు. పుష్కరాల కోసం మూడు జిల్లాల్లోని 326 దేవాలయాలను ఆధునీకరిస్తామని చెప్పారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6656 ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఇకపోతే దేవాలయాల్లో జరిగే పూజలకు సంబంధించి భక్తుల ఇళ్ల వద్దే దేవుడి ఆశీస్సులు అందించే కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఉగాది పండుగ నుంచి ఏడు సందర్భాల్లో పూజారులు భక్తుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆశీర్వాదాలు అందించే కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. పిల్లలు పుట్టిన వేళ, వారికి నామకరణం, అన్న ప్రాసన వంటి కార్యాలను గుడి పూజారి దేవుడి చిత్రపటంతో భక్తుడి ఇంటికెళ్లి దీవెనలిస్తారని తెలిపారు. వివాహం జరిగినప్పుడు కొత్త దంపతులను ఆశీర్వదించడం, గర్భవతులకు సీమంతం చేసినప్పుడు అమ్మవారి కుంకుమ అందజేయడం వంటివి చేస్తారని చెప్పారు.
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
Published Sat, Jan 23 2016 5:59 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM
Advertisement