
'నాన్నకు ప్రేమతో'
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్లో సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 'ఐకాన్ ఆఫ్ ద ఇయర్'గా అవార్డులు అందుకున్న కేటీఆర్ 'నాన్నకు ప్రేమతో' బల్దియా పీఠాన్ని కానుకగా అందించారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని అధిరోహిస్తామని ఘంటాపథంగా చెప్పిన ఆయన.. ఆ మేరకు పార్టీ నేతల సమష్టి కృషితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనాన్ని ఎగురవేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన అమలు చేసిన వ్యూహం ఫలించిందనే చెప్పవచ్చు.
మొత్తం 150 డివిజన్లకు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి రెబల్స్ను బుజ్జగించడం, ప్రచార బాధ్యతలు చేపట్టి, సుడిగాలి ప్రచారంతో కేటీఆర్ సుమారు వంద డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించి, ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడే అని నిరూపించారు. తన కాన్వాయ్ మొత్తం నగరంలో ప్రచారం కోసం తిరిగితే ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారంటూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగా ప్రచారం చేపట్టలేదు. కేవలం ఒక్క బహిరంగ సభకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే.. ఆ లోటును కేటీఆర్ భర్తీ చేశారనే చెప్పొచ్చు. కేసీఆర్ పేరును పెంచకపోయినా ఫర్వాలేదు కానీ చెడగొట్టకుండా చూసుకుంటే తాను విజయం సాధించినట్లే అన్న కేటీఆర్.. దానికి మించిన స్థాయిలో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో 'నాన్నకు ప్రేమతో' అనే స్లోగన్తో ప్రస్తుతం వైరల్ అవుతోంది.