బోగస్‌పత్రాలతో భూముల కబ్జా
- కబ్జాస్థలంలో క్రషర్ ప్లాంట్ నిర్వహణ
- మనుషుల పేర్లు మార్చేసి మాయాజాలం
- వెలుగులోకి వస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వ్యవహారాలు
- ముగ్గురు నిందితులకూ జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: బోగస్ పత్రాలతో భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు అయిన టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనా అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఈ కేసుల్ని లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 2012లో అడ్వొకేట్ శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డి శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నం. 33/ఏఏ/5లో ఉన్న 5 గుంటల స్థలంపై కన్నేశారు. మాజీ సైనికోద్యోగి అంటూ బాలయ్య అలియాస్ బాబయ్య పేరుతో బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారు.
ఆ స్థలాన్ని మావూరి శివభూషణానికి జీపీఏ చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో శివభూషణం పేరును ముసుకు శివభూషణంగా మార్చారు. శివభూషణం పేరుతో పహాణీ కాపీలు, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఈ స్థలంలో దీపక్‌రెడ్డి క్రషర్ ప్లాంట్ నడుపుతున్నారు. ఈ స్థలం ప్రభుత్వాని దంటూ ఆర్డీవో ఖరారు చేసినా.. శైలేష్ సక్సేనా ద్వారా కేసు వేయించి తన అధీనంలోనే ఉంచుకున్నారు.
శివభూషణాన్ని ‘చంపేశాడు’..
స్థలాలను కబ్జా చేయడానికి శివభూషణాన్ని పావుగా వాడుకున్న శైలేష్ సక్సేనా 2012లో అతడిని ‘చంపేశాడు’. ప్రస్తుతం ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా చలామణి అవుతున్న ఇతగాడు తీవ్ర అనారోగ్యంతో ఆ ఏడాది సెప్టెంబర్ 10న చనిపోయినట్లు రికార్డులు సృష్టించాడు. అదే సమయంలో మహ్మద్ బషీర్ అనే వ్యక్తిని తీసుకువచ్చి ఇక్బాల్ ఇస్లాం ఖాన్ కుమారుడు షకీల్ అస్లం ఖాన్‌గా మార్చారు.
మరికొందరినీ రంగంలోకి దింపారు..
గుడిమల్కాపూర్ సమీపంలోని భోజగుట్టలో 78.22 ఎకరాల స్థలంపై కన్నేసిన శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డి.. 2014లో శైలేష్ తండ్రి ప్రకాశ్‌చంద్ సక్సేనా(జై హనుమాన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి)తో పాటు కర్ణాటకకు చెందిన ఎన్‌హెచ్ శైలజను రంగంలోకి దింపారు. 2006 మార్చ్ 3న తమ పేరుతో ఓ బోగస్ జీపీఏ సృష్టించి.. దాని ఆధారంగా రంగారెడ్డి జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జి కోర్టులో సూట్ ఫైల్ చేసి.. యజమానులను ముప్పుతిప్పలు పెట్టారు. ఇది లోక్ అదాలత్‌కు వెళ్లడంతో వీరికి వ్యతిరేకంగా డిక్రీ వచ్చింది.
1936లో చనిపోతే.. 1943లో సంతకమట..!
భోజగుట్ట స్థలాన్ని చేజిక్కించుకునేందుకు శైలేష్ సక్సేనా అండ్ కో.. ఈ భూమిని నిజాం నవాబులు ఇనాం ఇచ్చారంటూ నలుగురు మహిళల పేరుతో ఉర్దూలో పత్రాలు సృష్టించారు. ఈ భూమిని తాము ఓ కల్నల్‌కు ఇచ్చామని, భూ బదలాయింపు చేయమని 1943లో అప్పటి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు కథ అల్లారు. కొద్ది రోజుల తర్వాత తాము సదరు కల్నల్‌కు భూమిని విక్రయిం చామంటూ మరికొన్ని పత్రాలు తెరపైకి తీసుకు వచ్చారు. తర్వాత కల్నల్ తన నలుగురు కుమా రులకు సదరు స్థలాన్ని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు మరికొన్ని పత్రాలు సిటీ సివిల్ కోర్టులో దాఖలయ్యాయి. సదరు కల్నల్ కుమారులు 2008లో భూమి హక్కు పత్రాలు తీసుకున్నారు. సదరు కల్నల్ 1936లో చనిపోయి నట్లు కుమారులు పేర్కొనగా.. 1943లో నలుగురు మహిళలు స్థలాన్ని విక్రయించినట్లు ఉండటంతో తప్పుడు పత్రాలుగా తేలాయి.
కొత్త పత్రాలు పాతవిగా మారుస్తూ..
శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డి వ్యవహారాల్లో బోగస్ పత్రాలదే కీలకపాత్ర. స్టాంప్ వెండర్ల నుంచి ఖాళీ స్టాంపు పేపర్లు సేకరించి.. వాటికి నూనె, పసుపు రాసి ఎండబెట్టడం ద్వారా పాతవిగా మార్చేవారు. వీటిపై తమకు కావాల్సిన పేర్లతో జీపీఏలు, ఏజీపీఏలు రాసేవారు. కబ్జాల కోసం నకిలీ పత్రాలతో పాటు బోగస్ వ్యక్తుల్నీ రంగంలోకి దింపడం శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డిలకు వెన్నతో పెట్టిన విద్య. పిటిషన్ దాఖలు చేయించేది బోగస్ వ్యక్తులతో కావడంతో కొన్ని చిరునామాలను ఈ ముఠా సృష్టించింది.
చంచల్‌గూడ జైలుకు దీపక్‌రెడ్డి
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాతోపాటు మరో నిందితుడు ఆర్.శ్రీనివాస్‌ను సీసీఎస్ పోలీసులు బుధవారం జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. విచారణ కోసం నిందితుల్ని తమ కస్టడీకి అప్ప గించాలని నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, జైలు ప్రాంగణంలో వేచి ఉన్న దీపక్‌రెడ్డి చట్ట విరుద్ధంగా మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ మీడియా కంటికి చిక్కారు. మరోవైపు అలీ మహ్మద్ ఇచ్చిన ఫిర్యాదుతో దీపక్‌రెడ్డి, శ్రీనివాస్‌ను అరెస్టు చేశామన్నారు. షేక్‌పేట మాజీ తహశీల్దార్ చంద్రకళ ఫిర్యాదుతో శైలేష్ సక్సేనాను అరెస్టు చేసినట్లు తెలిపారు.
నాకు సంబంధం లేదు: దీపక్‌రెడ్డి
ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థలాలు, కేసు లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కుట్ర పూరితంగా తనను ఇరికించారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఆరోపించారు. సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత దీపక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన సంతకాలను కొందరు ఫోర్జరీ చేసినట్లు పేర్కొ న్నారు. అయితే ఈ ఆరోపణల్ని సీసీఎస్ పోలీసులు ఖండిస్తున్నారు. ఆయా స్థలాలతో దీపక్‌రెడ్డికి సంబంధం లేకపోతే ఎన్నికల ఆఫిడవిట్‌లో వాటిని ఎలా పొందుపరిచారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దీపక్‌రెడ్డి అరెస్టు విషయంపై ఏపీ శాసన మండలి చైర్మన్‌కు సమాచారం ఇచ్చారు.