జీడిమెట్ల: ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణం తీశాయి. రోడ్డు గుంతల్లో ద్విచక్రవాహనం జారి పడింది. దానిపై ప్రయాణిస్తున్న గృహిణి రోడ్డుపై పడగా.. అదే సమయంలో దూసుకొచ్చిన బస్సు ఆమై నుంచి దూసుకెళ్లడంతో మృతి చెందింది. జీడిమెట్ల ఎస్సై లింగ్యానాయక్ కథనం ప్రకారం.. సురారం కాలనీకి చెందిన మన్మథరావు భార్య సంధ్య(25) ఆదివారం సాయంత్రం పనిపై స్కూటీపై ఎర్రగడ్డ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో సురారం వెళ్లెందుకు జీడిమెట్ల మైలాన్ పరిశ్రమ వద్ద ఉన్న రోడ్డు గుంతల్లో స్కూటీ స్క్రిడ్ కావడంతో పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు (టీఎస్ యూబీ 0448) సంధ్యపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలైన సంధ్యను స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ రాత్రి 9 గంటలకు మృతి చెందింది. సోమవారం భర్త మన్మథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గుంతలు పడ్డ రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.